మద్యం బాబుల దయ వల్ల పలు రాష్ట్రాలు బలమైన ఆదాయంతో కొనసాగుతున్నాయి. ఇక వైన్ షాపుల ఓనర్లు కూడా ఏడాది తిరిగేసరికి ఊహించని లాభాలు చూస్తున్నారు. మొన్న దసరా సమయంలో మద్యం అమ్మకాల కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలకు ఊహించని ఆదాయం లభించింది.
ఇక ఆంధ్రప్రదేశ్‌లో కొత్త వైన్ షాపుల టెండర్లు ఊహించని ఉత్సాహాన్ని రేకెత్తించాయి. ఈ టెండర్లకు రాజకీయ నాయకుల నుంచి వ్యాపారవేత్తల వరకు పోటీ పడగా, సామాన్యులూ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ముందుకొచ్చారు.
ఇందులో ఆసక్తికర విషయం ఏమిటంటే, ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేక దరఖాస్తులు రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రత్యేకంగా, ఢిల్లీలోని ఓ లిక్కర్ వ్యాపారి ఏకంగా 155 షాపులకు దరఖాస్తు చేయడం పెద్ద చర్చకు దారి తీసింది.
సిండికేట్లుగా పోటీ పడుతున్న వారు కూడా ఆయన వ్యూహానికి షాక్ అయ్యారు. విశాఖ జిల్లాపై పూర్తి దృష్టి పెట్టిన ఈ వ్యాపారి అమిత్ అగర్వాల్, సౌరభ్ గోయల్, నందినీ గోయల్, సారికా గోయల్, పేర్లతో దరఖాస్తులు సమర్పించారు.
కేవలం ఈ దరఖాస్తుల కోసమే ఆయన రూ. 3.10 కోట్లు టెండర్ ఫీజు చెల్లించాడు. దీన్ని బట్టి ఈ బిజినెస్ కోసం వ్యాపారులు ఏ విధమైన ఆసక్తి చూపిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక ఫైనల్ గా లాటరీలో ఈ వ్యాపారికి 6 షాపులు మాత్రమే దక్కాయి.
ఒడిశా నుంచి మరో లిక్కర్ వ్యాపారి కూడా ఈ పోటీలో అడుగుపెట్టడం విశేషం. అనేక దరఖాస్తులు సమర్పించినప్పటికీ, లాటరీ ద్వారా ఆయనకు 2 షాపులు దక్కాయి. ప్రభుత్వం ఈ టెండర్ ప్రక్రియ ద్వారా భారీ ఆదాయాన్ని సమకూర్చుకోవడమే కాకుండా, రాష్ట్రంలో మద్యం మార్కెట్‌పై ఇతర రాష్ట్రాల ఆసక్తిని కూడా గమనించింది. ఈ పోటీ పన్నుల రూపంలో పెద్ద ఎత్తున నిధులు సమకూరాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates