లోకేశ్ లోని చతురతను వెలుగులోకి తీసుకొచ్చిన ఇంటర్వ్యూ

ఒక రాజకీయ నేత సమర్థతను.. అంశాల మీద.. ప్రజా సమస్యల మీద అతడికున్న అవగాహనతో పాటు.. రాజకీయ చతురత ఎంతన్న విషయాన్ని చాటి చెప్పేందుకు.. ఏదైనా మీడియా సంస్థకు ఇచ్చే ప్రత్యేక ఇంటర్వ్యూ.. ఆ సందర్భంగా కఠినమైన ప్రశ్నలు.. చిరాకు పెట్టే ట్రికీ క్వశ్చన్లకు ఇచ్చే సమాధానాల ఆధారంగా అంచనా వేసేందుకు అవకాశం లభిస్తుంది. తాజాగా జాతీయ మీడియా సంస్థల్లో ఒకటైన టైమ్స్ నౌకు ఏపీ ఐటీ మంత్రినారా లోకేశ్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన పలు ప్రశ్నల్ని ఎదుర్కొంటూ.. సూటిగా సమాధానం ఇచ్చారు.

అదే సమయంలో తనను ఇబ్బంది పెట్టే వీలున్న ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు చెప్పి.. తనలోని కొత్త యాంగిల్ ను చూపించారని చెప్పాలి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని.. సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ను ఉద్దేశించి అడిగిన ప్రశ్నలకు అందరి మన్నన పొందేలా సమాధానాలు ఇచ్చారు. పాదయాత్ర రాహుల్ గాంధీని మార్చిందని తాను నమ్ముతున్నట్లుగా చెప్పిన లోకేశ్.. ఆయనలో తాను అంగీకరించని కొన్ని విధానాలు ఉన్నాయన్న మాటను చెప్పుకొచ్చారు.

భారతదేశం అంటే సంక్షేమం మాత్రమే కాదని.. సంక్షేమం.. డెవలప్ మెంట్ ను బ్యాలెన్సింగ్ చేయాల్సిన అవసరం ఉందనన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన లోకేశ్.. “వారిది మితిమీరిన సంక్షేమ ఎజెండా” అని పేర్కొన్నారు. రాహుల్ గాంధీలో దేశాన్ని నడిపించే సామర్థ్యం ఎంత? అన్న ప్రశ్నకు.. కాలమే సరైన సమాధానం ఇస్తుందన్న లోకేశ్.. సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఎంతోకొంత మేలు చేశారన్న లోకేశ్.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మీద అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. “ఆమెను గౌరవిస్తా” అని పేర్కొన్నారు. ఇటీవల పశ్చిమ బెంగాల్ లో చోటు చేసుకున్న పరిస్థితుల గురించి ప్రశ్నించగా.. సవాళ్లతో కూడుకున్న సమయంగా అభివర్ణించారు.

పార్టీ అధినేత.. తండ్రి చంద్రబాబు అరెస్టు గురించి ప్రశ్నించిన సమయంలోనూ లోకేశ్ బ్యాలెన్సు మిస్ కాకుండా బదులివ్వటం కనిపించింది. చంద్రబాబు చాలా క్లీన్ ట్రాక్ రికార్డు ఉన్న వ్యక్తిగా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తన సహకారాన్ని ఎప్పుడూ ఇస్తూనే ఉన్నట్లుగా పేర్కొన్నారు. “ఆయన అరెస్టు అయినప్పుడు ఓవైపు నేను వ్యవస్థ ద్వారా నిరాశకు గురయ్యా. మరోవైపు రాష్ట్ర ప్రజల నుంచి.. దేశంలోని నాయకుల నుంచి ఆయనకు వచ్చిన మద్దతు అధ్బుతమైనది. హైదరాబాద్ లో చంద్రబాబుకు కృతజ్ఞత చూపేందుకు నిర్వహించిన కార్యక్రమంలో 45 వేల మంది ఐటీ ఉద్యోగులు ఆయనకు మద్దతు తెలిపేందుకు ముందుకు వచ్చారు. చివరకు న్యాయమే గెలిచింది” అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

జైల్లో ఉన్న సమయంలో చంద్రబాబును చూసిన తాను కుటుంబ సభ్యుడిగా జీర్ణించుకోలేకపోయినట్లుగా లోకేశ్ పేర్కొన్నారు. చాలా భావోద్వేగానికి గురయ్యానని.. అంతకు ముందు ఎవరిని జైలుకు వెళ్లి కలవలేదని.. తొలిసారి జైలుకు వెళ్లి చంద్రబాబుతో ములాఖత్ అయినట్లు పేర్కొన్నారు. “చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సదరు జైలును డెవలప్ చేశారు. ములాఖత్ కు వెళ్లినప్పుడు ఆ విషయాన్ని అక్కడి వారు చెప్పారు” అన్న అంశాన్ని ప్రస్తావించారు. ప్రతీకార రాజకీయాల గురించి ప్రశ్నిస్తే.. తమకు ప్రజలు ఓటేసింది ఏపీని నెంబర్ వన్ గా నిలిపేందుకు.. సమాజానికి మంచి చేయటానికి మాత్రమే అంటూ లోకేశ్ వ్యాఖ్యానించారు.మొత్తంగా రెడ్ బుక్ ట్రాప్ లో పడి.. రాజకీయ ప్రత్యర్థుల చేతికి చిక్కకుండా ఉన్న వైనం ఆకర్షిస్తోందని చెప్పాలి.