Movie Reviews

సమీక్ష – కమిటీ కుర్రోళ్ళు

బలమైన కంటెంట్ ఉంటేనే చిన్న చిత్రాలకు ఆదరణ దక్కే పరిస్థితుల్లో కమిటీ కుర్రోళ్లు మీద నిర్మాత నీహారిక కొణిదెల గట్టి నమ్మకమే పెట్టుకుంది. గత కొన్ని వారాలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ బాగా నెమ్మదించిన తరుణంలో టాక్ మీద ఆధారపడుతూ వచ్చిన ఈ సినిమా ద్వారా ఏకంగా 11 మంది కొత్త టాలెంట్లను పరిచయం చేశారు. యదు వంశీ దర్శకత్వంలో రూపొందిన కమిటీ కుర్రోళ్ళుని జనసేనకు ముడిపెడుతూ ప్రత్యేకంగా ఎంపిక చేసిన 21 కేంద్రాల్లో ముందు రోజే ప్రీమియర్లు కూడా వేశారు. ఇంతకీ వీళ్ళ అల్లరి ఎలా ఉంది.

కథ

పురుషోత్తంపల్లి సర్పంచ్ ఎన్నికల పోటీలో నిలబడతాడు శివ (సందీప్ సరోజ్). ప్రత్యర్థి బుజ్జి (సాయికుమార్) పన్నెండేళ్ల క్రితం భరింకాళమ్మ జాతరలో జరిగిన గొడవ, దాని వల్ల రేగిన విషాదాన్ని గుర్తు చేసి అవి మళ్ళీ జరగకూడదంటూ ఊరి జనంతో హెచ్చరిక చేయిస్తాడు. ఉద్యోగాల కోసం వేరే చోట సెటిలైన శివ స్నేహితులు సుబ్బు, సూర్య, విలియమ్స్, రవి కిషోర్ అందరూ తిరిగి వచ్చేస్తారు. జాతర జరిపించాలంటే ఈ బ్యాచ్ మొత్తం మూకుమ్మడిగా నెరవేర్చాల్సిన బాధ్యత ఒకటుంటుంది. అందరూ చేతులు కలిపి దానికి పూనుకుంటారు. స్నేహితుల బృందాన్ని అడ్డుకోవడానికి మాజీ సర్పంచ్ బుజ్జి ఏం చేశాడనే ప్రశ్నలకు సమాధానం తెరమీద చూడాలి.

విశ్లేషణ

గత కొన్నేళ్లుగా పల్లెటూరి నేపథ్యంలో యూత్ ఫుల్ డ్రామాలను రాసుకోవడానికి కొత్త దర్శకులు ఉత్సాహం చూపిస్తున్నారు. మేమ్ ఫేమస్, అంబాజీపేట మ్యారేజీ బ్యాండు ఆ కోవలో వచ్చినవే. దర్శకుడు యదు వంశీ కమిటీ కుర్రోళ్ళుకు స్వచ్ఛమైన గోదావరి నేపధ్యాన్ని తీసుకుని దాని ద్వారా కొత్త తరం ఫోర్ జి జెనరేషన్ మిస్సవుతున్న చిన్ననాటి జ్ఞాపకాలతో పాటు యువత ఉద్యోగాలకు సంబంధించిన ఒక సీరియస్ ఇష్యూని జాతర బ్యాక్ డ్రాప్ లో చెప్పాలని ఈ స్టోరీ రాసుకున్నాడు. స్మార్ట్ ఫోన్ తప్ప వేరే ప్రపంచం లేని పిల్లలకు బాల్యమంటే ఎలా ఉండాలో జ్ఞాపకాల దొంతని తెరమీద చూపించడం ద్వారా తట్టిలేపే ప్రయత్నం బలంగా చేయాలని చూశాడు.

తొలి గంట చాలా సింపుల్ గా నడిచిపోతుంది. కొందరు కుర్రాళ్ళు కలిసి తమ బాల్యంలోని మెమరీస్ ని ఇంటి అరుగు మీద కూర్చుని పంచుకుంటారు. పెద్ద గొప్పగా చెప్పుకునే సన్నివేశాలేం ఉండవు. అలాని మరీ బోర్ కొట్టించవు. ఏదోలా నడిచిపోతూ కొందరిని టైం మెషీన్ లో వెనక్కు తీసుకెళ్తాయి. కొన్ని ఎపిసోడ్లను హ్యాండిల్ చేసిన విధానం బాగుంది. ఉదాహరణకు డివిడి ప్లేయర్లో హీరోయిన్ పెద్ద మనిషి ఫంక్షన్ ని ప్లే చేసినప్పుడు వచ్చే కామెడీ నవ్విస్తుంది. చాలా సీన్లు లైటర్ వీన్ లో రాసుకున్నారు. చదువు అబ్బక ఊళ్ళోనే ఆటో నడుపుకునే పెద్దోడి పాత్ర ద్వారా మిగిలిన క్యారెక్టర్లను అనుసంధానించడం ఇంకొంచెం ప్రతిభావంతంగా ఉండాల్సింది.

అక్కడక్కడా రిపిటీషన్ ఉండటంతో కొంత సాగతీత అనిపిస్తుంది. ప్రీ ఇంటర్వెల్ ముందు కుర్రోళ్ళ మధ్య చిచ్చుకు కారణమయ్యే సుబ్బు ద్వారా ఎంసెట్ రిజర్వేషన్ మీద సీరియస్ టర్న్ తీసుకున్న యదు వంశీ ఆ ట్రాక్ ని సమర్ధవంతంగా హ్యాండిల్ చేశాడు. దాని ద్వారానే పదకొండు అబ్బాయిలు రెండు గ్రూపులుగా విడిపోయి జాతర విషాదానికి దారి తీయడం ఎంగేజింగ్ గా ఉంటుంది. ఇంటర్వెల్ కు అవసరమైన బ్యాంగ్ ని వంశీ సరైన రీతిలో ఎస్టాబ్లిష్ చేసి సెకండాఫ్ కు కావాల్సిన ఆసక్తిని పెంపొందిస్తాడు. ఫస్ట్ హాఫ్ లో వచ్చే టీనేజ్ ప్రేమకథలు, వాటి తాలూకు వ్యవహారాలు రొటీన్ గా గడిచిపోతాయి. మరీ స్పెషల్ గా అనిపించవు కానీ టైం పాస్ వరకు ఓకే.

అసలు ఛాలెంజ్ రెండో సగంలో ఎదురయ్యింది. కుర్రోళ్ళ మధ్య కాంఫ్లిక్ట్ అనుకున్నట్టే కుదిరాక ఆపై కథనాన్ని ఎలా నడిపించాలో అర్థం కాని అయోమయం యదు వంశీలో కనిపిస్తుంది. దాని వల్ల ఎమోషన్ బరువెక్కువైపోయి అక్కర్లేని ల్యాగ్ వచ్చేసింది. ఆత్రం (బృందంలో ఒకడి పేరు) ఏమయ్యాడో విశ్రాంతికి ముందే చూపించేశాక సెకండాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ పేరిట ఒక పావుగంట అతని మీద భావోద్వేగాన్ని సాగదీసి పాట పెట్టడం అవసరం లేదనిపిస్తుంది. ఇది కొందరికి కనెక్టవ్వొచ్చేమో కానీ అదేదో ముందే చేసి ఉంటే రంగస్థలం తరహాలో ఆ ట్రాజెడీ ఇంకా బాగా రిజిస్టరయ్యేది. జాతర కన్నా స్నేహితుల మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం అవసరమైన ఫ్లోని తగ్గించేసింది.

శివ ఎన్నికల్లో గెలవడం, స్నేహితులు ఒక్కటైపోవడం ఈ రెండింటిని బ్యాలన్స్ చేసే క్రమంలో ఏర్పడ్డ కన్ఫ్యూజన్ కమిటీ కుర్రోళ్ళు నుంచి ఆశించిన ప్రభావాన్ని సగానికి పైగా తగ్గించేసింది. క్లైమాక్స్ లో జనసేన భావజాలాన్ని ప్రతిబింబించేలా పెట్టిన ఎలక్షన్ క్యాంపైన్, ర్యాప్ సాంగ్, ఓటర్ల మనస్తత్వాన్ని ఎత్తి చూపే చిన్న క్లిప్పులు వగైరాలలో నాటకీయత ఎక్కువైపోయి పంటికింద రాళ్ళలయ్యాయి. వీటిని పక్కనపెడితే ఒక ఫిలిం మేకర్ గా, బడ్జెట్ పరిమితులను తట్టుకుని, అసభ్యత అశ్లీలత లేని ఒక క్లీన్ మూవీని తీయడంలో మాత్రం యదు వంశీ సక్సెసయ్యాడు. సినిమా కమర్షియల్ గా పెద్ద స్థాయికి వెళ్ళకపోవచ్చేమో కానీ ఇంకా సానబడితే వంశీ ప్రామిసింగ్ డైరెక్టరవుతాడు.

నటీనటులు

తెరకు కొత్తే అయినా అందరూ బెరుకు లేకుండా నటించారు. సందీప్ సరోజ్ బాగున్నాడు. ఇంకొంత మెరుగుపడాల్సి ఉన్నా ఉన్నంతలో డీసెంట్ అనిపించాడు. స్టోరీలో కీలక మలుపుకు కారణమయ్యే సుబ్బుగా త్రినాథ వర్మ ఆవేశం బాగా చూపించాడు. ఈశ్వర్ రచిరాజు, యశ్వంత్ పెండ్యాల తదితరులు సహజంగా చేసుకుంటూ పోయారు. అబ్బాయిలతో నిండిపోయిన స్క్రీన్లో టీనా శరణ్య, రాధ్య సురేష్ కొంత రిలీఫ్. తేజస్విరావు నిడివి చాలా తక్కువ. పెద్దోడిగా ప్రసాద్ బెహరా శరీరానికి తగ్గట్టు తెరను కూడా ఆక్రమించుకుని ఆడేసుకున్నాడు. సాయికుమార్, గోపరాజు రమణ, కంచరపాలం కిషోర్ నటనానుభవం సినిమాకు నిండుతనం తీసుకొచ్చింది.

సాంకేతిక వర్గం

అనుదీప్ దేవ్ నేపధ్య సంగీతం ఈ కమిటీ కుర్రోళ్ళుకు ఆయువుపట్టుగా నిలిచింది. హడావిడి లేకుండా డిఫరెంట్ సౌండ్ తో మంచి ఫీల్ వచ్చే బీజీఎమ్ ఇచ్చాడు. మూడు పాటలు బాగున్నాయి. మిగిలినవి పర్వాలేదు తప్పించి మళ్ళీ వినే క్యాటగిరీలో రావు. రాజు ఎదురోలు ఛాయాగ్రహణం అందంగా ఉంది. సింగల్ లొకేషన్ అయినప్పటికీ ఊరి తాలూకు బ్యూటీని, పల్లె మనుషుల జీవితాలను చూపించిన తీరు ఆకట్టుకుంది. అన్వర్ అలీ ఎడిటింగ్ నిడివిని అదుపులోనే ఉంచింది కానీ సెకండాఫ్ మీద ఇంకొంచెం వర్క్ చేయాల్సింది. లెన్త్ పెరిగింది. డైలాగులు న్యాచురల్ గా ఉన్నాయి. రిస్క్ లేని బడ్జెట్ కావడంతో ప్రొడక్షన్ వాల్యూస్ మీద ఎంచి చూపడానికేం లేదు.

ప్లస్ పాయింట్స్

గోదావరి నేపథ్యం
నోస్టాల్జియా జ్ఞాపకాలు
ఇంటర్వెల్ బ్లాక్
మ్యూజిక్

మైనస్ పాయింట్స్

సెకండాఫ్ నెమ్మదితనం
ట్రాక్ తప్పిన ఎలక్షన్ ఎపిసోడ్
ఎమోషన్ల మోతాదు
క్లైమాక్స్ హడావిడి

ఫినిషింగ్ టచ్ : తడబడిన జ్ఞాపకాలు

రేటింగ్ : 2.5 / 5

This post was last modified on August 9, 2024 3:15 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పాలన మీద చంద్రబాబు పట్టు కోల్పోయారా?

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటిసారి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టలేదు. ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఆయన.. పాలనా పరంగా…

30 mins ago

హైదరాబాద్ ఆఫీస్ స్పేస్ పై నైట్ ఫ్రాంక్ రిపోర్టు చదివారా?

హైదరాబాద్ రూపురేఖలు మారిపోతున్నాయి. గతానికి భిన్నంగా దేశంలోని మెట్రోపాలిటిన్ నగరాల్లో కొన్నింటిని మించిపోయిన భాగ్యనగరి.. మరికొన్ని మహానగరాల దూకుడుకు ఏ…

4 hours ago

వ‌లంటీర్లు-స‌చివాల‌యాల‌పై ఏపీ స‌ర్కారు సంచ‌ల‌న నిర్ణ‌యం

రాష్ట్రంలో వైసీపీ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన రెండు కీల‌క వ్య‌వ‌స్థ‌ల‌ను ప్ర‌భుత్వ శాఖ‌ల్లో క‌లిపేసేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. జ‌గ‌న్ హ‌యాంలో…

7 hours ago

అపార్టుమెంట్ పార్కింగ్ ఇష్యూ సుప్రీం వరకు వెళ్లింది

ఒక అపార్టుమెంట్ లోని పార్కింగ్ వద్ద చోటు చేసుకున్న పంచాయితీ ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వరకు వెళ్లటం…

8 hours ago

స్పిరిట్ కోసం క్రేజీ విలన్ జంట ?

దేవర పార్ట్ 1 విడుదల కోసం అభిమానులతో సమానంగా విలన్ గా నటించిన సైఫ్ అలీ ఖాన్ ఆతృతగా ఎదురు…

9 hours ago

`10 టు 10`.. ఇదీ ఏపీ లిక్క‌ర్ పాల‌సీ!

ఏపీలో చంద్ర‌బాబు నేతృత్వంలోని కూట‌మి ప్ర‌భుత్వం నూత‌న మ‌ద్యం విధానాన్ని తీసుకువ‌స్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా జ‌రిగిన మంత్రి వ‌ర్గ…

10 hours ago