2/5
2 Hrs | Action,Drama | 26-7-2024
Cast - Raj Tarun, Hassini Sudhir, Ramya Krishnan, Murali Sharma, Brahmaji, Raj Tirandasu, Praveen & others
Director - Rom Bhimana
Producer - Ramesh Tejawat, Prakash Tejawat
Banner - Shree Sridevi Productions
Music - Gopi Sundar
ఇటీవలే లావణ్య అనే అమ్మాయి కేసులో చిక్కుకున్న యూత్ హీరో రాజ్ తరుణ్ ఇంకా ఆ వివాదం నుంచి బయటికి రాకముందే అతని కొత్త సినిమా విడుదలకు సిద్ధం కావడం పరిశ్రమ వర్గాలనూ ఆశ్చర్యపరిచింది. మాములుగా కథానాయకుడు లేకుండా ప్రమోషన్లు చేయడం కష్టం. అయినా కూడా టీమ్ ఆ రిస్క్ తీసుకుని ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసింది. సరే ఇలాంటి కాంట్రావర్సీల సంగతి ఎలా ఉన్నా పురుషోత్తముడు మీద టీమ్ వ్యక్తం చేస్తున్న నమ్మకం బలంగానే ఉంది. తక్కువంచనాలతో వచ్చిన పురుషోత్తముడు ఎలా ఉన్నాడు
కథ
మల్టీ మిలియనీర్ ఆదిత్య రామ్ (మురళీశర్మ) కొడుకైన రచిత్ రామ్ (రాజ్ తరుణ్) విదేశాల్లో ఉన్నత చదువుల పట్టా అందుకుని ఇండియాకు తిరిగి వస్తాడు. వ్యాపార సామ్రాజాన్ని అతనికి అప్పగించాలని తండ్రి నిర్ణయించుకున్న తరుణంలో పెద్దమ్మ వసుంధర (రమ్యకృష్ణ) కంపెనీ లా ప్రకారం వంద రోజులు అజ్ఞాత జీవితం గడిపి రావాలనే నిబంధన గుర్తు చేస్తుంది. ఫలితంగా రామ్ ఎక్కడో మారుమూల ఉన్న రాయపులంక అనే గ్రామానికి చేరుకుంటాడు. అక్కడే అమ్ములు (హాసిని సుధీర్) తో పరిచయం ప్రేమగా మారుతుంది. రైతు కూలిగా కొత్త లైఫ్ మొదలుపెట్టిన రామ్ కు అసలు సవాళ్లు మొదలవుతాయి. అతని లక్ష్యం ఎలా చేరుకున్నాడనేదే స్టోరీ.
విశ్లేషణ
కొన్ని సబ్జెక్టులు వినడానికి బాగుంటాయి. స్టార్ హీరోలు చేస్తే వాటి స్థాయి పెరిగి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టరవుతాయి. శ్రీమంతుడు కన్నా ఉదాహరణ అక్కర్లేదు. దర్శకుడు రామ్ భీమనకు ఇలాంటి ప్రయత్నం రాజ్ తరుణ్ లాంటి అప్ కమింగ్ హీరో మీద ఎందుకు చేయకూడదనే ఆలోచన వచ్చింది కాబోలు పూర్తిగా ఆ స్ఫూర్తితోనే పురుషోత్తముడు రాసుకున్నట్టు టైటిల్ దగ్గరి నుంచి మేకింగ్ దాకా అన్ని చోట్ల కనిపిస్తుంది. ఆయన పోల్చవద్దని ముందే చెప్పాడు కానీ అడుగడుగునా దీంతో పాటు బిచ్చగాడు, పిల్ల జమీందార్ లాంటి రెఫరెన్సులు గుర్తుకు వస్తుంటే అవి మరపుకు రానంత బలహీనంగా స్క్రిప్ట్ రాసుకున్న రచయితదే తప్పవుతుంది.
ఒక కోటీశ్వరుడు సర్వం వదిలి చిన్న పల్లెటూరికి రావడం పదులసార్లు చూసిందే. ఇలాంటి పాయింట్ ఎంచుకున్నప్పుడు టైం పాస్ చేయించే ఎంటర్ టైన్మెంట్ తో పాటు బలమైన ఎమోషన్ అంతకు మించి కొత్తగా అనిపించే హుక్ పాయింట్ ఉండాలి. కానీ పురుషోత్తముడులో ఇవన్నీ మిస్సయ్యాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం రచిత్ రిటర్న్ రావడం, ఫ్యామిలీ నేపథ్యం ఇలా మొదలుపెట్టి తన కొడుకు ప్రయోజకుడు అవ్వాలనే స్వార్థంతో వసుంధర అతన్ని ఇంటి నుంచి పంపించేయడం ఇదంతా రొటీన్ డ్రామాని తలపిస్తుంది. అక్కడక్కడా ఫన్ పెట్టి నవ్వించే ప్రయత్నం సఫలమయ్యింది కానీ అది కూడా ఏమంత కొత్తగా అనిపించకపోవడం దెబ్బ తీసింది.
హీరో పాత్రకు ఒక సంఘర్షణని సృష్టించినప్పుడు అది అతని ఇమేజ్ కి సరితూగేలా ఉండాలి. కానీ పురుషోత్తముడులో రచిత్ చేసే పనులు, ఫైట్లు రాజ్ తరుణ్ స్టామినాకి మించి పెట్టడంతో ఒకదశ దాటాక ఇదంతా ఓవర్ బిల్డప్ లా అనిపిస్తుంది. రామాయణాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాముడికి బదులు భరతుడికి సింహాసనం దక్కాలన్న కౌసల్య చేసిన కుట్రనే ఇక్కడ వసుంధర, రచిత్ ల మధ్య సృష్టించిన రామ్ భీమన దాన్ని ప్రేక్షకులకు కనెక్టయ్యేలా చేసే క్రమంలో రొటీన్ పంథాని ఎంచుకోవడం కొత్తదనాన్ని దూరం చేసింది. పైగా పూల రైతుల కష్టాలు మనకు పరిచయం లేకపోయినా వాళ్ళ పరిస్థితులను మరీ ఓవర్ డ్రమాటిక్ గా చూపించడం పండలేదు.
అందుకే సెకండాఫ్ విపరీతమైన సాగతీతకు గురయ్యింది. రైతులు పడే వ్యథలను హృదయాలను తాకేలా చెప్పడం సులభం కాదు. శర్వానంద్ శ్రీకారంలో ఎంత సహజత్వంగా చూపించినా జనాలకు ఎక్కలేదు. అలాంటిది ఒక కమర్షియల్ సినిమాలో వాటిని మోతాదు మించి రుద్దాలని చూడటం ల్యాగ్ కు తగ్గ ఇంకెందుకు ఉపయోగపడదు. పైగా రాజ్ తరుణ్ పాత్రకు దేవుడి రేంజ్ లో బిల్డప్ ఇస్తూ, ఇంకో వైపు సూపర్ మ్యాన్ తరహాలో పోరాటాలు చేయిస్తూ ఇలా తనకు తెలియకుండా దర్శకుడు రెగ్యులర్ పంథాలోకి వెళ్ళిపోయాడు. ఒక స్టేజి అయ్యాక చూస్తున్నది టీవీ సీరియలా లేక వెబ్ సిరీసా అనేంత అసహనం కలుగుతుంది. వీటి పట్ల కొంత జాగ్రత్త వహించాల్సింది.
దర్శకుడు అబ్బో అనిపించే సీనియర్ క్యాస్టింగ్ ని తీసుకున్నాడు కానీ వాళ్ళను పూర్తిగా వాడుకునే రేంజ్ లో పురుషోత్తముడుని రాసుకోలేకపోయాడు. కామెడీ లాంటి సపోర్టింగ్ ఎలిమెంట్స్ తో ఫస్ట్ హాఫ్ ని కొంత వరకు నెట్టుకొచ్చినా ఆ తర్వాత వైవిధ్యాన్ని చూపించలేక చేతులు ఎత్తేశాడు. రెండో సగంలో గ్రాఫ్ అమాంతం కిందకు వెళ్లిపోవడాన్ని చూసుకోలేదు. దీని ఫలితంగా చెప్పుకోదగ్గ సందేశం ఉన్న పాయింట్ కాస్తా చెప్పుకోలేని బాధని ఇచ్చిన కంటెంట్ గా మిగిలిపోయింది. వంద కోట్ల మార్కెట్ ఉన్న హీరోలే ఏ మాత్రం రొటీన్ గా వెళ్లినా ప్రేక్షకులు తిరస్కరిస్తున్న ట్రెండ్ లో పురుషోత్తముడు మీద ఇంత బడ్జెట్ పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తుంది
నటీనటులు
రాజ్ తరుణ్ తన స్థాయికి మించిన క్యారెక్టరే అయినా వీలైనంత వరకు నిలబెట్టే ప్రయత్నం చేశాడు. కొన్నిచోట్ల యాక్షన్ ఎపిసోడ్లు, ఎలివేషన్లు ఓవర్ ది బోర్డ్ వెళ్లిపోయాయి. కానీ దానికి ఇతన్నే నిందించలేం. హీరోయిన్ హాసిని సుధీర్ లవ్ ట్రాక్, పాటలకు బాగానే ఉపయోగపడింది కానీ గుర్తుపెట్టుకునే స్థాయిలో ఏమి లేదు. మురళీశర్మ, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ తదితర సీనియర్ నటులవి కొట్టిన పిండి లాంటి పాత్రలు. అలవాటైన రీతిలో చేసుకుంటూ పోయారు. ప్రవీణ్ నయం ఉన్నంతలో కొంత నవ్వించాడు. బ్రహ్మానందంని ఇందులోనూ సరిగా వాడుకోలేకపోయారు. విరాన్ ముత్తంశెట్టి అంతగా నప్పలేదు. చిన్నా చితకా క్యాస్టింగ్ బోలెడుంది ఇంకా.
సాంకేతిక వర్గం
మంచి బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ ఇచ్చిన గోపి సుందర్ మేజిక్ ఈసారి పని చేయలేదు. నేపధ్య సంగీతం పర్వాలేదనిపించినా ఓవరాల్ గా చూసుకుంటే గుర్తుండిపోయే స్థాయిలో మ్యూజిక్ అయితే లేదు. పిజి విందా ఛాయాగ్రహణంలో ఆయన అనుభవం తొంగి చూసింది. విజువల్స్ ని ఖర్చుకి తగ్గట్టు రిచ్ గా ప్రెజెంట్ చేశారు. ఎక్కువ లెన్త్ లేకుండా నిడివిని తగ్గించడంలో ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ సీనియారిటీ ఉపయోగపడింది కానీ ల్యాగ్ కు ఆయన బాధ్యులు కారు. రమేష్ – ప్రకాష్ నిర్మాణ విలువలను మెచ్చుకోవాలి. ఇలాంటి కథతో రాజ్ తరుణ్ మీద ఇంత ఖర్చు పెట్టే రిస్క్ తీసుకున్నారంటే అది సినిమా తీయాలన్న ప్యాషన్ అన్నది అర్థమైపోతుంది.
ప్లస్ పాయింట్స్
అక్కడక్కడా కామెడీ
రాజ్ తరుణ్ ఎఫర్ట్
మైనస్ పాయింట్
రొటీన్ అనిపించే కథాకథనాలు
మితిమీరిన డ్రామా
కొరవడిన భావోద్వేగాలు
సెకండాఫ్
ఫినిషింగ్ టచ్ : ‘ఉత్త’ముడు
రేటింగ్ : 2 / 5