2/5
2 Hr 26 Mins | Action | 31-05-2024
Cast - Vishwak Sen, Anjali, Neha Shetty, Nassar, P. Sai Kumar, Hyper Aadi and others
Director - Krishna Chaitanya
Producer - Suryadevara Naga Vamsi, Sai Soujanya
Banner - Sithara Entertainments, Fortune Four Cinemas
Music - Yuvan Shankar Raja
సంక్రాంతి తరువాత వేసవి మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా సరైన మాస్ సినిమా రాలేదనే కొరత థియేటర్లను వేధిస్తూనే వచ్చింది. అందుకే గ్యాంగ్స్ అఫ్ గోదావరి మీద మంచి అంచనాలు నెలకొన్నాయి. గామి లాంటి ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన విశ్వక్ సేన్ దానికి పూర్తి విరుద్ధమైన పాత్రను ఇందులో పోషించడం ఆసక్తి రేపింది. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ విలేజ్ డ్రామాను సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించడంతో బడ్జెట్ పరంగా మంచి మద్దతు దక్కింది. మరి లంకల రత్నం మెప్పించాడా లేదా
కథ
గోదావరి తీరం కొవ్వూరు గ్రామంలో ఉండే లంకల రత్నాకర్(విశ్వక్ సేన్) స్థానిక ఎమ్మెల్యే దొరస్వామిరాజు (గోపరాజు రమణ) పంచన చేరి స్వంతంగా నాయకుడయ్యే ప్రయత్నాల్లో ఉంటాడు. ఈ క్రమంలో శత్రువు నానాజీ (నాజర్) తో చేతులు కలిపి అతని కూతురు బుజ్జి (నేహా శెట్టి)ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. స్థానికుల సహాయంతో ఆశ్రయమిచ్చిన గురువు మీదే పోటీ చేసి లంకల రత్నం ఎమ్మెల్యే అవుతాడు. అధికారం, డబ్బు పిచ్చి పట్టిన రత్నంకు పలు సవాళ్లు, చిక్కులు ఎదురవుతాయి. కుటుంబం ప్రమాదంలో పడుతుంది. బయట పడలేని పద్మవ్యూహంలో చిక్కుకున్న రత్నం చివరికి ఏ గమ్యం చేరుకున్నాడు, ఏమయ్యాడు అనేదే అసలు స్టోరీ.
విశ్లేషణ
పల్లెటూరి నేపథ్యంలో రాజకీయలను జోడించి దానికి రౌడీయిజం బ్యాక్ డ్రాప్ తగిలించడం కొత్తేమి కాదు కానీ గత కొన్నేళ్లలో రంగస్థలం తర్వాత ఈ తరహా ప్రయత్నాలు ఎక్కువయ్యాయి. దర్శకుడు కృష్ణ చైతన్య ప్రశాంతంగా కనిపించే గోదావరి తీరంలో రక్తపాతం ఎలా ఉండేదో చూపించే ఆలోచనతో లంకల రత్నంని డిజైన్ చేసుకుని అతని చుట్టూ కుట్రలు, కుతంత్రాలు చేసే పాత్రలను అల్లుకున్నాడు. పేపర్ మీద మంచి వర్త్ ఉన్న పాయింట్ గా అనిపించే ఈ లైన్ ని బలంగా, కన్విన్సింగ్ గా విస్తరిస్తే తప్ప ప్రేక్షకులను మెప్పించలేం. ఏ మాత్రం అటు ఇటు అయినా విసుగెత్తించి తేడా కొట్టేస్తుంది. కృష్ణ చైతన్య ఈ బేసిక్ పాయింట్ ని పూర్తిగా మర్చిపోయాడు.
రత్నాకర్ పాత్రను ఎస్టాబ్లిష్ చేసే క్రమమే ఒక తీరుగా మొదలవ్వదు. కిరాణా సామాన్లు దొంగలించి ఊళ్ళో పట్టు సాధించే వైనం సిల్లీగా అనిపిస్తుంది. క్యారెక్టరైజేషన్ లోపం వల్ల ఒక మాములు చిల్లర దొంగ శక్తివంతుడిగా ఎదిగే తీరుకి కనెక్ట్ కాలేం. దొరస్వామిరాజు, నానాజీ మధ్య వైరాన్ని తనకు అనుకూలంగా రత్నం మార్చుకోవడాన్ని మరింత బెటర్ గా రాసుకుని ఉండాల్సింది. వ్యవహారాలన్నీ తనకు అనుకూలంగా జరగడం ఎంత మాత్రం రుచించదు. పైగా బుజ్జితో ప్రేమకథ, బాండింగ్ కృత్రిమంగా అనిపించడం వల్ల ఆ జంట మధ్య ఎమోషన్ మొదటి దశ నుంచే కనెక్ట్ కాదు. దీని వల్ల బరువైన భావోద్వేగాలు సైతం తేలిపోయి ఎలాంటి అనుభూతిని కలిగించవు.
ఇలాంటి ఒక పల్లెటూరి రౌడీ బయోపిక్ చెప్పేటప్పుడు విపరీతమైన హింస ఉండొచ్చు. తప్పు లేదు. కానీ దాని మీదే అతిగా ఆధారపడితే తెరమీద రక్తం ఎక్కువైపోయి బోర్ కొట్టేస్తుంది. కృష్ణ చైతన్య ట్విస్టుల పేరుతో పదే పదే దాడులు, ప్రతి దాడులను రిపీట్ చేయడంతో నాటకీయత పూర్తిగా పక్కకెళ్ళిపోయి కేవలం నరుక్కోవడం మాత్రమే హైలైట్ అవుతూ వెళ్ళింది. ఊరి బాగు కోసం తండ్రి చనిపోతే కొడుకు దానికి బదులుగా ప్రతీకారానికి తెగబడటం బాగుంది కానీ, అది వదిలేసి కామం, క్రోధంతో రగిలిపోతూ ఒకదశ దాటాక ఏం చేస్తున్నాడో అర్థం కానీ అయోమయం రత్నంలోనే కాదు ఆడియన్స్ లోనూ ఏర్పడుతుంది. కథనాన్ని బ్యాలన్స్ తప్పించడం వల్ల వచ్చిన సమస్యిది.
నాయకుడులో కమల్ హాసన్ హత్యలు చేసినా నలుగురికి మంచి చేసే గుణం అంత మాఫియా డాన్ లో సైతం దేవుడు కనిపించేలా చేస్తుంది. జగడంలో సుకుమార్ ఈ సూత్రాన్ని పాటించకుండా కేవలం వన్ సైడ్ యాంగిల్ చూపించడంతో ఫెయిల్యూర్ దక్కింది. కృష్ణ చైతన్య కూడా ఇదే తప్పు చేశాడు. లంకల రత్నం లక్ష్యం వైపే వెళ్తే ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. మర్డర్లు చేసినా రైటనిపించేది. కానీ పావుగంటకోసారి అపరిచితుడిలా వేరియేషన్స్ చూపించడం వల్ల తప్పో ఒప్పో అర్థం చేసుకునేలోపే లెక్కలేనన్ని మారణ కాండలు జరిగిపోతాయి. కత్తి కడితే ప్రాణం తీసే వరకు వదిలిపెట్టరనే థ్రెడ్ బాగున్నా దాన్ని డెవలప్ చేసే క్రమం తడబడింది.
ఒకటి రెండు యాక్షన్ ఎపిసోడ్లు, కొన్ని పదునైన డైలాగులు బాగున్నా ఓవర్ ది బోర్డు వెళ్లిన దర్శకుడి చిత్రణ లాజిక్స్ ని సైతం తేలికగా తీసుకోవడం అతకలేదు. ఊరు మొత్తం రక్తం ఏరులై పారుతుంటే కనిపించని పోలీసులు కేవలం రత్నంని జైల్లో పెట్టడం కోసమే ప్రీ క్లైమాక్స్ కు ముందు వచ్చి అరెస్ట్ చేయించడం పాతకాలం ఫార్ములా. ఎమ్మెల్యే, అపోజిషన్ లీడర్ వ్యవహారాన్ని మరీ అర్థం లేకుండా చూపించారనిపిస్తుంది. రత్నం లాగే ఊరి జనం ప్రవర్తన కూడా బహు విచిత్రంగా ఉంటుంది. ఎక్కడా రత్నం నాయకుడనిపించుకునే పనులు చేయకపోవడం పెద్ద మైనస్. మాస్ అంటే కత్తులు కటార్లే కాదు ఎమోషన్లు రిలేషన్లు కూడా ఉంటేనే ఆదరణ దక్కుతుంది.
రౌడీ ఫెలో లాంటి సీరియస్ సబ్జెక్టుని సెన్సిటివ్ గా డీల్ చేసి మెప్పులు పొందిన కృష్ణ చైతన్య చల్ మోహనరంగా తర్వాత ఇంత సుదీర్ఘమైన గ్యాప్ తీసుకుని ఇలాంటి అవుట్ డేటెడ్ నెరేషన్ ఇవ్వడం నిరాశ పరుస్తుంది. కేవలం మలుపుల మీద ఆధారపడకుండా పాత్రల చిత్రణ మీద ఇంకాస్త శ్రద్ధ వహించి ఉంటే బాగుండేది. గ్యాంగ్స్ అఫ్ వసేపూర్ కేవలం కొట్టుకోవడం చంపుకోవడం వల్ల కల్ట్ అవ్వలేదు. అనురాగ్ కశ్యప్ ప్రతి ఒక్క క్యారెక్టర్ ని తీర్చిదిద్దిన విధానం, వాటిలో డెప్త్, డ్రామా రెండు భాగాలను బ్లాక్ బస్టర్ అయ్యేలా చేసింది. దాని స్ఫూర్తితో టైటిల్ అయితే పెట్టగలిగారు కానీ కంటెంట్ అయితే ఆ స్థాయిలో తీర్చిదిద్దలేకపోయారు.
నటీనటులు
నటుడిగా ఒకే మూసకు కట్టుబడకుండా సవాళ్ళను స్వీకరించడానికి ఇష్టపడే విశ్వక్ సేన్ ఇందులో లంకల రత్నంగా తనదైన శైలిలో చెలరేగాడు. ఆ పాత్ర డిమాండ్ చేసిన ఇంటెన్సిటీ, హింసాత్మక ప్రవృత్తిని ఏ మాత్రం తూకం తగ్గకుండా జీవించాడు. కెరీర్ బెస్ట్ లో ఒకటిగా చెప్పొచ్చు. నేహా శెట్టికి కేవలం గ్లామర్ కే కట్టుబడకుండా కాసింత స్కోప్ దక్కడం ఊరట. అంజలి తనకిచ్చిన క్యారెక్టర్ కి పూర్తి న్యాయం చేసింది. గోపరాజు రమణ మీద ఎక్కువ బరువు పెట్టేశారు. ఆయన రైట్ ఛాయస్ అనిపించుకోలేదు. నాజర్, సాయికుమార్ పర్వాలేదు. కుర్ర విలన్ గా వినోద్ కిషన్ ఎక్స్ ప్రెషన్లతో పని కానివ్వాలని చూశాడు కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. మిగిలినవాళ్లు ఓకే.
సాంకేతిక వర్గం
యువన్ శంకర్ రాజా పాటలు ఒకటి క్లాస్ గా ఆకట్టుకున్నా బెటర్ ఆల్బమ్ పడి ఉంటే అదైనా పాజిటివ్ ఫ్యాక్టర్ గా పని చేసేది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సైతం ఎక్కడిక్కడ సీన్స్ కు తగ్గట్టు హడావిడిగా ఉండి ఒకదశ దాటాక రొటీన్ సౌండ్ లోకి మారిపోయింది. అనిత్ కుమార్ మదాడి ఛాయాగ్రహణం గోదావరి అందాలనే కాదు అక్కడి హింసను సైతం బాగానే ఆవిష్కరించింది. ఈయన పనితనాన్ని ప్రస్తావించుకోవచ్చు. నవీన్ నూలి ఎడిటింగ్ రెండున్నర గంటల లోపే నిడివిని పరిమితం చేసినా బాగా ల్యాగ్ వచ్చేసింది. కృష్ణచైతన్య సంభాషణల్లో మెరుపులు తక్కువ . అక్కడక్కడా కొన్ని పేలాయి. సితార నిర్మాణం, ఖర్చు గురించి కొత్తగా చెప్పేందుకేం లేదు.
ప్లస్ పాయింట్స్
విశ్వక్ పెర్ఫార్మన్స్
గోదావరి నేపథ్యం
యాక్షన్ బ్లాక్స్
మైనస్ పాయింట్స్
మితిమీరిన హింస
కనెక్ట్ కాని భావోద్వేగాలు
అక్కర్లేని ట్విస్టులు
లోపించిన బలమైన కథ
ఫినిషింగ్ టచ్ : పడవ మునిగింది
రేటింగ్ : 2 / 5