Movie Reviews

సమీక్ష – రత్నం

పేరుకి తెలుగువాడనే కానీ పూర్తిగా తమిళంలో సెటిలైపోయిన విశాల్ కు కెరీర్ ప్రారంభంలోనే పందెం కోడి లాంటి పెద్ద హిట్ తో మాస్ లో ఫాలోయింగ్ ఏర్పడింది. దాని వల్లే తర్వాత వచ్చిన పొగరు, భరణి, భయ్యా లాంటివి కమర్షియల్ గా వర్కౌట్ అయ్యాయి. ఆపై వచ్చిన వరస ఫ్లాపులు మార్కెట్ ని దెబ్బ తీశాయి. అభిమన్యుడు సక్సెసైనా ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. ఇంత స్లంప్ లోనూ రత్నం మీద కాసిన్ని అంచనాలు ఏర్పడ్డాయంటే ఒకప్పుడు వచ్చిన ఇమేజ్ వల్లే. మరి టైటిల్ కు తగట్టు రత్నం మెరిసిందో లేదో చూసేద్దాం

కథ

రత్నం (విశాల్) అనాథ. చిన్నప్పుడు ఒక గొడవలో స్థానిక నాయకుడు పన్నీర్(సముతిరఖని)మీద హత్య ప్రయత్నం జరిగితే అతన్ని కాపాడే క్రమంలో జైలుకు వెళ్తాడు. బయటికి వచ్చాక ఎమ్మెల్యేగా ఎదిగిన పెద్దాయన దగ్గరే బార్ నడుపుతూ వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. ఓ సందర్భంలో మౌనిక (ప్రియా భవాని శంకర్) ని చూసి ఎప్పుడో పరిచయమున్నట్టు అనిపించి వెంట తిరుగుతాడు. తమిళనాడు సరిహద్దులో ఉండే లింగం(మురళీశర్మ) మనుషులు మౌనికని చంపడానికి వస్తే కాపాడి వాళ్ళ కుటుంబం నివసించే నగరికి వెళ్తాడు. అక్కడే తన తల్లికి సంబంధించిన ఒక విస్తుపోయే నిజం రత్నంకు తెలుస్తుంది. ఇదంతా ఎందుకు జరిగిందనేది తెర మీదే చూడాలి

విశ్లేషణ

దర్శకుడు హరిది ఊర మాస్ స్టైల్. సింగం సిరీస్ తో ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న ఈయన సినిమాల్లో హీరోలు కేకలు పెడుతూ, ఫిజిక్స్ కి సవాల్ విసిరే ఫైట్లు చేస్తూ నానా రక్తపాతం చేస్తుంటారు. అయినా సరే జనాలకవి నచ్చడానికి కారణం కేవలం కమర్షియల్ ఎలిమెంట్స్ మాత్రమే కాదు. కుటుంబానికి సంబంధించిన ఒక బలమైన ఎమోషన్ ని తీసుకొచ్చి దాని ద్వారా హీరోయిజం ఎలివేట్ చేయడానికి ప్రయతిస్తారు. ఇది ఒక దశ వరకు బాగా కాసులు కురిపించిన ఫార్ములా. అందుకే ఇదే హరి విశాల్ కాంబోలో వచ్చిన భరణి – పూజ లు బాక్సాఫీస్ వద్ద సేఫ్ అయ్యాయి. కానీ మారిన అభిరుచులకు తగ్గట్టు హరి తనను తాను మలుచుకోలేకపోవడం అసలు సమస్య.

రత్నంలో తల్లి సెంటిమెంట్ మీద ఒక విచిత్రమైన ట్విస్టు రాసుకుని దాన్ని హీరోయిన్ కు ముడిపెట్టి ఏదో కొత్తగా ట్రై చేయాలని చూశారు హరి. అదేంటో ఇక్కడ చెప్పేయడం భావ్యం కాదు కానీ ఆ పాయింట్ ని కన్విన్సింగ్ గా చెప్పడంలో ఘోరంగా తడబడ్డారు. మౌనిక ప్రమాదంలో ఉందని రివీల్ చేశాక దానికి తగిన కారణాలను త్వరగా ఎస్టాబ్లిష్ చేయాలి. పదే పదే రత్నం ఆ అమ్మాయి కాపాడుతూ ఉండటం, లింగం గుండాలు వెనుకబడుతూ ఉండటం ఇలా రిపీట్ సీన్లు ఒకదశ దాటాక విసుగు పుట్టిస్తాయి. రత్నం అమ్మ వెనుక ఏం జరిగిందో పెద్ద సస్పెన్స్ లాగా ముప్పాతిక సినిమా దాకా సాగదీశారు. ఈలోగా ఏమయ్యుంటుందో సులభంగా గెస్ చేసేయొచ్చు.

ప్రేక్షకుల మేధాశక్తిని తక్కువంచనా వేసినప్పుడే ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి. దర్శకుడు హరి చాలా తెలివిగా రెండు రాష్ట్రాల సరిహద్దుల మధ్య గొడవలను తీసుకుని ఏదో గొప్ప డ్రామా నడిపించాననుకుని అత్తెసరు సన్నివేశాలతో నింపేసిన తీరు ఫస్ట్ హాఫ్ కే చేతులు ఎత్తేసేలా మార్చేసింది. తన రెగ్యులర్ స్టైల్ కి భిన్నంగా విశాల్ తో గట్టిగట్టిగా అరిపించకుండా టోన్ ని పూర్తిగా తగ్గించి చూపించినా సరే మితిమీరిన యాక్షన్ ఎపిసోడ్లు సహనానికి పరీక్ష పెడతాయి. ప్రారంభంలో బస్సు దొంగతనం ఎపిసోడ్ ని అమీర్ ఖాన్ సర్ఫరోష్ నుంచి యథాతథంగా ఎత్తుకొచ్చి దానికి హరిహరన్ పాడిన మంచి పాటను వృథా చేయడం పెద్ద క్రియేటివ్ బ్లండర్.

బోలెడు క్యారెక్టర్లు తెరనిండా కనిపిస్తున్నా వాటి మధ్య సంబంధాల కన్నా రత్నం చేసే ఫైట్లే డామినేట్ చేయడంతో అసలు నేపధ్యం తాలూకు ఎమోషన్ పూర్తిగా జీరో అయ్యింది. విశాల్, ప్రియా భవాని ఫ్యామిలీల మధ్య లింకుని బలవంతంగా సెట్ చేసిన తీరు అతకలేదు. పైగా సగటు మాస్ ప్రేక్షకుడు ఆశించే హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ స్థానంలో వాళ్ళిద్దరి మధ్య ఒక విచిత్రమైన అనుబంధాన్ని సృష్టించడం నభూతో నభవిష్యత్. సెకండ్ హాఫ్ లో కొంచెం వేగం పెరిగినట్టు అనిపించినా సులభంగా ఊహించేలా సాగే కథనం ఎలాంటి ఆసక్తిని కలిగించక నిస్సారంగా మారిపోయింది. ఏ పాత్ర మీద సీరియస్ హోమ్ వర్క్ జరగకపోవడం మూలలను పూర్తిగా దెబ్బకొట్టింది.

తమిళంలో ఆడుతుందేమో మనం చెప్పలేం కానీ సరైన దారి దిక్సూచి లేని ఈ రత్నం లాంటి సగం ఉడికిన వంటకాలు తెలుగులో నిలవడం కష్టం. అందులోనూ విశాల్ ఏదో ఎక్స్ ట్రాడినరిగా చేస్తే తప్ప జనం థియేటర్లకు రాలేని పరిస్థితిలో ఈ తరహా సబ్జెక్టులను ఎందుకు ఎంచుకుంటున్నాడో అర్థం కాదు. అభిమన్యుడు రూపంలో తామేం కోరుకుంటున్నామో ప్రేక్షకులు చెప్పాక కూడా తిరిగి పాత దారికే వెళ్లడం విచారకరం. లోకేష్ కనగరాజ్, నెల్సన్ దిలీప్ లాంటి కొత్త తరం డైరెక్టర్ల నుంచి ఎంతో నేర్చుకుంటున్నానని చెప్పిన దర్శకుడు హరి తీరా సినిమాల తీయడంలో మాత్రం తానింకా పాతికేళ్ల వెనుకే ఉన్నట్టు ఋజువు చేసేందుకే ఈ రత్నం తీశారు.

నటీనటులు

విశాల్ అలవాటైన రీతిలో రత్నంగా చేసుకుంటూ పోయాడు. గతంలో చేసిన టైపే కావడంతో కొత్తగా అనిపించదు. ప్రియా భవాని శంకర్ ఓకే. ఇచ్చిన రెండు షేడ్స్ ని బాగానే చేసుకుంది. సముతిరఖని, మురళీశర్మ పాత్రలు ఎన్నోసార్లు చూసినవే. యోగిబాబు అక్కడక్కడా నవ్వించాడు కానీ ఆ కామెడీ డోస్ సరిపోలేదు. హరీష్ పేరడీ, విజయ్ కుమార్, జయప్రకాష్, గుండు రాజేందర్, మోహన్ రామన్, తులసి తదితరులందరివి కొట్టిన పిండి లాంటి పాత్రలే. గౌతమ్ మీనన్ ఒక చిన్న సీన్ లో హడావిడి చేసి వెళ్ళిపోయారు. పెర్ఫార్మన్స్ పరంగా ఇలాంటివి ఛాలెంజ్ అనిపించేలా ఉండవు కనక ఏ ఆర్టిస్టుకి ఎలాంటి ప్రత్యేకత దక్కలేదు. అందరిదీ మొక్కుబడి వ్యవహారమే

సాంకేతిక బృందం

దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో ఎటువైపో పాట చాలా బాగుంది. మూడు ఎమోషనల్ సాంగ్స్ వల్ల తన మార్కు కిక్కిచ్ఛే ఛాన్స్ దొరకలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వరకు వీలైనంత ఎలివేట్ చేయడానికి ప్రయత్నించినా ఒకదశ దాటాక అది కూడా రొటీన్ గా మారిపోయింది. ఎం సుకుమార్ ఛాయాగ్రహణం చాలా కష్టపడింది. కెమెరా వర్క్ ని మెచ్చుకోవచ్చు. టిఎస్ జె ఎడిటింగ్ మాత్రం నిడివిని అదుపులో ఉంచలేదు. అవసరం లేని లెన్త్ తగ్గించాల్సింది. పేరొందిన ఫైట్ మాస్టర్లు నలుగురు పని చేయడం కొంత రిలీఫ్. డైలాగులు రొటీన్ గా అనిపిస్తాయి. నిర్మాణ విలువల పరంగా చూసుకుంటే సంతానం – జీ స్టూడియోస్ సబ్జెక్టు డిమాండ్ మేరకు రాజీ పడలేదు.

ప్లస్ పాయింట్స్

ప్రొడక్షన్ వేల్యూస్

మైనస్ పాయింట్స్

విచిత్రమైన ట్విస్టులు
గాడి తప్పిన కథనం
రొటీన్ ట్రీట్ మెంట్
విసిగించే యాక్షన్

ఫినిషింగ్ టచ్ : భరించడం కష్టం

రేటింగ్ : 1.75/5

This post was last modified on April 26, 2024 3:47 pm

Share
Show comments
Published by
Satya
Tags: Feature

Recent Posts

తిరుప‌తి క్యూలైన్లో తోపులాట‌.. ఎంత మంది చనిపోయారు

ఈ నెల 10 శుక్ర‌వారం నాడు వైకుంఠ ఏకాద‌శిని పుర‌స్క‌రించుకుని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ప్ర‌త్యేక స‌ర్వ‌ద‌ర్శ‌న టోకెన్ల పంపిణీని…

58 minutes ago

న‌మో-న‌మో-న‌మో.. నారా లోకేష్ 21 సార్లు!

ఏపీ మంత్రి, టీడీపీ యువ నేత నారా లోకేష్ త‌న ప్ర‌సంగంలో ఏకంగా 21 సార్లు న‌మో అనే ప‌దాన్ని…

1 hour ago

మోదీ, పవన్ పై చంద్రబాబు ప్రశంసలు

విశాఖ బహిరంగ సభలో ప్రధాని మోదీని ఉద్దేశించి ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం మెచ్చే ఏకైక…

1 hour ago

తెలుగులో మోదీ స్పీచ్ కు ఫిదా!

ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఇతర కేంద్ర, రాష్ట్ర మంత్రులకు, రాష్ట్ర…

3 hours ago

ఏపీకి ప్ర‌ధాని ఇచ్చిన వ‌రాల ప్రాజ‌క్టులు ఇవీ..

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌లు గంటున్న ల‌క్ష్యాల‌ను సాకారం చేసేందుకు తాము అండ‌గా ఉంటామ‌ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ…

3 hours ago

ప్రభాస్ ఫౌజీ హీరోయిన్ డిమాండ్ చూశారా

మొన్నటిదాకా అసలెవరో తెలియని ఇమాన్వి ఇస్మాయిల్ ప్రభాస్ సరసన హీరోయిన్ గా ఎంపిక కాగానే ఒక్కసారిగా ఇతర బాషల నిర్మాతల…

4 hours ago