స్టార్ క్యాస్టింగ్ లేని హిట్ సినిమాకు పదేళ్ల తరువాత సీక్వెలంటే ఒక విధంగా సాహసమే. అందులోనూ పోస్ట్ కోవిడ్ పరిణామాలు, ఓటిటి విప్లవం, మారిన ప్రేక్షకుల అభిరుచులు లాంటి కారణాల వల్ల చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. నిర్మాత కం రచయిత కోన వెంకట్ టీమ్ దానికి సిద్ధపడటం ఆశ్చర్యమే. 2014లో రిలీజై మంచి సక్సెస్ అందుకున్న గీతాంజలికి కొనసాగింపుగా టైటిల్ కు మళ్ళీ వచ్చింది జోడించి రంజాన్ కానుకగా ఈరోజు థియేటర్లలో విడుదల చేశారు. మరి ఫ్రెష్ గా వచ్చిన దెయ్యం ఆకట్టుకునేలా ఉందా.
కథ
మూడు ఫ్లాపులు రావడంతో డైరెక్షన్ కోసం ఎదురు చూస్తున్న శీను(శ్రీనివాసరెడ్డి)కి ఊటీలో ఉండే ఒక కోటీశ్వరుడి నుంచి సినిమా తీయమని కాల్ వస్తుంది. దీంతో స్నేహితులు ఆత్రేయ(సత్యం రాజేష్), ఆరుద్ర(షకలక శంకర్)లను వెంటబెట్టుకుని అక్కడికి వెళ్ళిపోతాడు. హీరోని చేస్తానని తాను మాటిచ్చిన అయాన్(సత్య)ని కూడా తీసుకెళ్తాడు. నిర్మాతే స్టోరీ ఇవ్వడంతో దానికి అనుగుణంగా షూటింగ్ కోసం మహాలక్ష్మి మహల్ లోకి వెళ్తారు. అక్కడ శాస్త్రి(రవిశంకర్) ఫ్యామిలీ ఆత్మల రూపంలో తిరుగుతూ ఉంటుంది. తర్వాత ఏం జరిగింది, ఇంత దూరం పిలిపించడానికి కారణం ఎవరు, గీతాంజలికి మళ్ళీ ఏమైంది ప్రశ్నలకు సమాధానం తెరమీద చూడాలి
విశ్లేషణ
దశాబ్దంన్నర క్రితం హారర్ కామెడీని లారెన్స్ లాంటి వాళ్ళు పరిచయం చేసినప్పుడు ఆడియన్స్ కొత్తగా ఫీలయ్యి బాగా ఎంజాయ్ చేశారు. అందుకే కొన్నేళ్ల పాటు ఇవి నిర్మాతలకు కనకవర్షం కురిపించాయి. ఆ ఊపులో అప్పట్లో వచ్చిందే గీతాంజలి. ఇండస్ట్రీలో ఛాన్సుల కోసం ట్రై చేస్తున్న ఫ్రెండ్స్ గ్యాంగ్ కి దెయ్యాల కాన్సెప్ట్ ని ముడిపెట్టడమనే ఆలోచనకు మంచి హాస్యం తోడవ్వడంతో జనాలకు నవ్వులతో పాటు థ్రిల్ ని పంచింది. రివెంజ్ డ్రామాని బలంగా రాసుకోవడం వల్ల మాస్ కి కనెక్ట్ అయ్యింది. కోన వెంకట్ టీమ్ ఈసారి క్రియేటివిటీకి పెద్దగా పని చెప్పకుండా అదే థ్రెడ్ ని పొడిగించి జస్ట్ రావు రమేష్ కొడుకుగా ఇంకో విలన్ ని తీసుకొచ్చి అదే టెంప్లేట్ కొనసాగించారు.
పాత్రల పరిచయం, నిరుద్యోగం కష్టాలు, హఠాత్తుగా కాల్ వస్తే శీను బ్యాచ్ ఊటీకి వెళ్లిపోవడం ఇలా పెద్దగా ఆలోచించే పని లేకుండా సాఫీగా సాగిపోతాయి. సత్య టైమింగ్ వల్ల అక్కడక్కడా నవ్వులు పూసినా మిగిలిన ముగ్గురికి బలమైన ట్రాక్స్ పడకపోవడంతో సన్నివేశాలు అతి మాములుగా జరుగుతాయి. పాడుబడిన బంగాళాలో ఏదో రహస్యం ఉంటుందని, దెయ్యంగా కనిపించే రవిశంకర్ ఫ్యామిలీకి అన్యాయం జరిగి ఉంటుందని ఈజీగా ఊహిస్తాం కాబట్టి అక్కడేం పెద్ద సస్పెన్స్ ఉండదు. పైగా గోపరాజు రమణ ద్వారా ఆ గతాన్ని చెప్పించేయడంతో చివరి వరకు ఎదురు చూసే అవసరం రాలేదు. కానీ గీతాంజలి 2కి వచ్చిన సమస్య అది కాదు.
షూటింగ్ బ్యాక్ డ్రాప్ గా పెట్టి సగానికి పైగా సినిమాని ఒకే భూత్ బంగాళాలో తిప్పాలని రాసుకోవడంతో కథనం ఎంతకీ ముందుకు కదలదు. నలుగురు కలిసి భయపడే సన్నివేశాలు ఒక దశ దాటాక రిపీట్ అనిపించి ల్యాగ్ కు దారి తీశాయి. సునీల్ ఎంట్రీ తర్వాత ఎంటర్ టైన్మెంట్ పెరిగిన మాట వాస్తవమే కానీ అది ట్రెండీగా లేక ఓల్డ్ ఫార్ములాలో నడిపించడం మైనస్ అయ్యింది. ఓం భీం బుష్ తరహాలో ఇప్పటి జనరేషన్ కు సింక్ అయ్యేలా కాస్త వినూత్నంగా ఆలోచించాల్సింది. అలా కాకుండా భారం మొత్తం ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ మీద తోసెయ్యడంతో స్క్రీన్ ప్లేలో బలహీనత రొటీన్ ఫ్లేవర్ తీసుకొచ్చింది. వినోదం పాళ్ళు ఆశించిన స్థాయిలో పండలేదు.
పోనీ అన్నాబెల్లె రేంజ్ లో బిల్డప్ ఇచ్చిన బొమ్మ తాలూకు ట్విస్టుని సరిగా హ్యాండిల్ చేసి ఉంటే ఇంకొంచెం బెటర్ గా ఉండేది. అలీతో దాన్నేదో ఇరికించబోయి వెరైటీగా చెప్పాలనుకున్నారు కానీ ఒకదశ దాటాక దర్శకుడు కన్ఫ్యూజ్ అయిపోయి కీలకమైన ఈ మలుపుని నిర్లక్ష్యం చేయడం దెబ్బ కొట్టింది. సెకండ్ హాఫ్ లో చాలా మటుకు సునీల్, సత్యలు కాపాడారు కానీ లేదంటే డ్యామేజ్ ఇంకా ఎక్కువ జరిగేది. క్లైమాక్స్ ని భారీగా ప్లాన్ చేసుకుని దాన్ని తక్కువ క్వాలిటీ విఎఫెక్స్ తో సర్దేయడం వల్ల గీతాంజలి తాలూకు ఎమోషన్, పగ రెండూ ఫీలవ్వలేక శివ తుర్లపాటితో పాటు మనమూ చేతులెత్తేస్తాం. నిర్మాణంలో పడిన రాజీ స్క్రీన్ మీద ఫోర్ కెలో కనిపిస్తుంది.
ఒక ఫ్రాంచైజ్ ని సక్సెస్ ఫుల్ గా కొనసాగించాలంటే కేవలం టైటిల్ కున్న బ్రాండ్ సరిపోదు. దానికి సరైన హోమ్ వర్క్ జరగాలి. లారెన్స్ ఈ విషయంలో లెక్క తప్పడం వల్లే కాంచన 3 వచ్చే నాటికి తన దగ్గర కొత్త ఆలోచనలు లేక తిప్పి తిప్పి అదే కథను తీసి విమర్శలు కొని తెచ్చుకున్నాడు. గీతాంజలి మళ్ళీ వచ్చింది బృందం కూడా అదే చేసింది. మాస్ సెంటర్స్ లో ఇందులోని లౌడ్ కామెడీ కొంత మేర వసూళ్లు తేవచ్చేమో కానీ ఓవరాల్ గా చూసుకుంటే గీతాంజలి 3 కోసం ఎదురు చూసేంత మ్యాటర్ కానీ టిల్లు స్క్వేర్ లాగా మొదటి భాగం కన్నా ఇదే బాగుందనే ఫీలింగ్ కానీ ఏ కోశానా దక్కవు. సున్నా అంచనాలతో వెళ్తే తప్ప గీతాంజలి ఏ కోశానా ఎంజాయ్ చేయనివ్వదు.
నటీనటులు
అంజలికి గీతాంజలి రేంజ్ లో ఈ మళ్ళీ వచ్చింది గుర్తుండిపోయే క్యారెక్టర్ కాదు. ఉన్నంతలో డీసెంట్ గా కానిచ్చేసింది కానీ స్కోప్ ఉన్న క్లైమాక్స్ లోనూ దర్శకుడు ఆమెను వాడుకోలేదు. శ్రీనివాసరెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్ లకు పెద్దగా ఛాన్స్ దక్కలేదు. అలవాటైన రీతిలో అతి మాములుగా నటించేశారు. సత్య ఆకట్టుకుంటాడు. దెయ్యంని వెక్కిరించే సీన్ లో, బిల్డప్ ఇచ్చే హీరోగా డైలాగులు చెప్పే విధానంలో మంచి టాలెంట్ చూపించాడు. సునీల్ పర్వాలేదు. చాలా గ్యాప్ తర్వాత తనలో అసలు కమెడియన్ ని బయటికి తీశాడు. విలన్ రాహుల్ మాధవ్ జస్ట్ ఓకే. అలీ పర్వాలేదు. రవిశంకర్ తదితరులవి చాలాసార్లు చూసిన అరిగిపోయిన బాపతే. కొత్తగా ఏం లేదు.
సాంకేతిక వర్గం
ప్రవీణ్ లక్కరాజు సంగీతంలో పెద్దగా మెరుపుల్లేవ్. పాటలు ఏ మాత్రం ఉపయోగడపడలేదు. బీజీఎమ్ అక్కడక్కడ పర్వాలేదనిపించినా ఒకదశ దాటాక రిపీట్ అనిపిస్తుంది. సుజాత సిద్దార్థ ఛాయాగ్రహణం వీలైనంతలో బడ్జెట్ కాంప్రోమైజ్ ని దాచిపెట్టి క్వాలిటీ చూపించేందుకు కష్టపడింది. గ్రాఫిక్స్ వల్ల ఆ పనితనం కూడా ప్రభావితం చెందింది. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ ఇంకొంచెం క్రిస్పీగా ఉండాల్సింది. రెండో సగం ల్యాగ్ గుర్తించాల్సింది. భాను భోగవరపు, నంది సవరిగన సంభాషణల్లో కొంచెం చమక్కులు ఉన్నాయి కానీ ఫుల్ ఫన్ అనిపించేందుకు సరిపోలేదు. ఎంవివి సినిమా, కోన ఫిలిం కార్పొరేషన్ నిర్మాణ విలువలు గొప్పగా కాదు తెలివిగా సాగాయి.
ప్లస్ పాయింట్స్
సత్య టైమింగ్
కొంతమేర సునీల్
మైనస్ పాయింట్స్
ఆసక్తి లేని కథనం
రొటీన్ కామెడీ
బలంగా లేని దెయ్యాల ట్రాక్
సంగీతం
ఫినిషింగ్ టచ్ : అదే దెయ్యం … అదే కామెడీ
రేటింగ్ : 2/5
This post was last modified on April 11, 2024 3:12 pm
ఈ నెల 10 శుక్రవారం నాడు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక సర్వదర్శన టోకెన్ల పంపిణీని…
ఏపీ మంత్రి, టీడీపీ యువ నేత నారా లోకేష్ తన ప్రసంగంలో ఏకంగా 21 సార్లు నమో అనే పదాన్ని…
విశాఖ బహిరంగ సభలో ప్రధాని మోదీని ఉద్దేశించి ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం మెచ్చే ఏకైక…
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఇతర కేంద్ర, రాష్ట్ర మంత్రులకు, రాష్ట్ర…
ఏపీ సీఎం చంద్రబాబు కలలు గంటున్న లక్ష్యాలను సాకారం చేసేందుకు తాము అండగా ఉంటామని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ…
మొన్నటిదాకా అసలెవరో తెలియని ఇమాన్వి ఇస్మాయిల్ ప్రభాస్ సరసన హీరోయిన్ గా ఎంపిక కాగానే ఒక్కసారిగా ఇతర బాషల నిర్మాతల…