సమీక్ష – ది ఫ్యామిలీ స్టార్

2/5

2 Hr 43 mins   |   Action   |   05-04-2024


Cast - Vijay Devarakonda, Mrunal Thakur, Jagapathi Babu, Vennela Kishore, Rohini and others

Director - Parasuram

Producer - Dil Raju

Banner - Sri Venkateswara Creations

Music - Gopi Sundar

మొన్నటిదాకా అగ్రెసివ్ హీరోయిజం సినిమాలే చేస్తూ వచ్చిన విజయ్ దేవరకొండ పూర్తిగా రూటు మార్చేశాడు. ఖుషిలో అది స్పష్టంగా బయట పడింది. గొప్ప ఫలితాన్ని అందుకోకపోయినా క్లాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకున్న వైనం కనిపించింది. అందుకే ఫ్యామిలీ స్టార్ మీద విపరీతమైన నమ్మకాన్ని పెట్టేసుకున్నాడు. బ్లాక్ బస్టర్ గీత గోవిందం ఇచ్చిన పరశురామ్ దర్శకుడు కావడం, నిర్మాత దిల్ రాజు నిర్మాణం నుంచి ప్రమోషన్ దాకా బాగా ఖర్చు పెట్టడం అంచనాలు పెంచాయి. వాటికీ తగ్గట్టు ఫ్యామిలీ స్టార్ ఉన్నాడో లేదో చూద్దాం.

కథ

సివిల్ ఇంజనీర్ గోవర్ధన్ (విజయ్ దేవరకొండ)ది పిసినారి మనస్తత్వమే అయినా కుటుంబాన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. ఇద్దరు అన్నయ్యలు, వదినలు, పిల్లలు, బామ్మ ఇలా ఇన్ని బాధ్యతలు ఉన్నా నెట్టుకుంటూ వస్తాడు. పై పోర్షన్ లో ఇందు (మృణాల్ ఠాకూర్) అద్దెకు వచ్చాక గోవర్ధన్ జీవితంలో మార్పులు మొదలవుతాయి. పరిచయం కాస్తా ప్రేమగా మారుతున్న టైంలో ఆమెకు సంబంధించిన నిజం ఒకటి బయటపడుతుంది. దీంతో విడిపోయే పరిస్థితి తలెత్తుంది. అనూహ్యమైన పరిణామాల తర్వాత ఈ జంట అమెరికా వెళ్లాల్సి వస్తుంది. అసలు ఇందూ ఉద్దేశం ఏంటి, అపార్థాలు ఎందుకు వచ్చాయనేది తెరమీద చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ

సరిగ్గా వాడుకోవాలే కానీ మిడిల్ క్లాస్ ఎమోషన్ అద్భుతమైన పాయింటు. ఎందుకంటే ప్రేక్షకుల్లో ముప్పాతిక శాతం ఆ క్యాటగిరీ వాళ్ళే  కాబట్టి. దర్శకుడు పరశురామ్ ఈ ఆలోచనతోనే ఫ్యామిలీ స్టార్ రాసుకున్నాడు. అయితే తెరమీద ఆ అనుబంధాలను, భావేద్వేగాలను అందంగా, నమ్మశక్యంగా తీర్చిదిద్దినప్పుడే బాగా కనెక్ట్ అవుతాయి. కానీ ఇందులో సినిమాటిక్ లిబర్టీతో పాటు కమర్షియల్ ఫార్ములాకు అనుగుణంగా నడిపించాలనే పరిమితులు పెట్టుకోవడంతో మొదలైన కాసేపటి నుంచే అతిశయోక్తితో కూడిన కథనాన్ని ఫీలవుతాం. పోకిరి రేంజ్ లో గోవర్ధన్ ఎంట్రీ ఇచ్చిన బిల్డప్ నుంచి ఇందు ప్రవేశించడం వరకు పెద్దగా ఇబ్బంది లేకుండా సీన్లు జరుగుతాయి.

పొదుపుగా ఖర్చు పెట్టుకునే గోవర్ధన్ మానసత్త్వాన్ని బాగానే ఎస్టాబ్లిష్ చేసినప్పటికీ దాన్ని సూపర్ హీరో తరహాలో ఓవర్ బిల్డప్ ఫైట్లతో ఇరికించాలని చూడటంతో డ్యామేజ్ మొదటి అరగంటలోనే మొదలైపోయింది. ఒక సామాన్యుడికి సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించుకునే విధానం రియల్ లైఫ్ కి దగ్గరగా ఉండాలి. అప్పుడే సహజత్వం అనిపించి ఆడియన్స్ క్యారెక్టర్ లోని ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటారు. కానీ పరశురామ్ ఈ విషయంలో ఎక్కడిక్కడ క్రమం తప్పకుండా తడబడ్డాడు. ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్టు బాగానే ఉన్నప్పటికీ ఇందూకి బుద్ది చెప్పాలనే ఉద్దేశంతో చేసే పనులు అతిగా అనిపించి అతని వ్యక్తిత్వాన్నే బాలన్స్ తప్పేలా చేశాయి.

సరే ఇక్కడిదాకా ఏదో కష్టం మీద టైం పాస్ అయ్యిందనుకున్నా అమెరికా వెళ్ళాక అసలు సమస్య వచ్చింది. ఎంగేజ్ అయ్యేలా ఎలాంటి ఎపిసోడ్స్ ఉండాలో పరశురామ్ కు తట్టలేదు కాబోలు కేవలం ఫిల్లింగ్ సీన్లు పెట్టి గంట లాగించాలని చూసిన ప్రయత్నం బెడిసి కొట్టింది. గోవర్ధన్ లో తింగరితనం ఉందని స్టార్టింగ్ లోనే చెప్పించారు కానీ యుఎస్ వచ్చాక అతను చేసే పనులు మరీ సిల్లీగా మారిపోయి చిరాకు పుట్టిస్తాయి. పార్ట్ టైం సంపాదన కోసం విజయ్ కు వెన్నెల కిషోర్ చూపించే మార్గం మరీ ఎబ్బెట్టుగా అనిపించడమే కాదు పరశురామ్ బృందం ఇది కన్వే అవుతుందని ఎలా అనుకున్నారో అర్థం కాదు. ఇలా అవసరం లేని సన్నివేశాలు వచ్చి పోతూనే ఉంటాయి.

తిరిగి ఇండియా వచ్చాక జరిగే డ్రామా, మృణాల్ పెళ్లికి ఇచ్చిన మలుపు మరీ విచిత్రంగా అనిపిస్తాయి. గోవర్ధన్ ని ఒక మిడిల్ క్లాస్ ఐకాన్ గా చూపించాలనుకున్నప్పుడు అతని పనులు కూడా అలాగే ఉండాలి. థియేటర్లో చూసేవాడు నేను అక్కడ ఉన్నట్టు ఫీలవ్వాలి. ఆమ్మో ఒకటో తారీఖు ఎల్బి శ్రీరామ్, మిడిల్ క్లాస్ మెలోడీస్ ఆనంద్ దేవరకొండ లాంటి వాళ్ళతో ప్రయాణం సింక్ అవ్వడానికి కారణం ఇదే. ఈ ప్రాథమిక సూత్రాన్ని పరశురామ్ విస్మరించాడు. ఈ మాత్రం దానికి ఆ రియల్ ఎస్టేట్ ప్రహసనం యుఎస్ లో ఎందుకు ఏ ముంబైలోనో ఊటీలోనో పెట్టినా పెద్ద తేడా ఉండేది కాదు, భారీతనం ముసుగులో నేచురాలిటీ అమాంతం దెబ్బ తింది.

కాంఫ్లిక్ట్ పాయింటే వాస్తవ దూరంగా ఉన్నప్పుడు ఎలాంటి ట్రీట్ మెంట్ అయినా లెక్క తప్పుతుంది. అసలు ఒక మనిషిని స్టడీ చేస్తే డాక్టరేట్లు ఇచ్చే యునివర్సిటీలు, నవల రాసినట్టు థీసిస్ రాస్తే సత్కారం చేసే కాలేజీలు ఇవన్నీ లాజిక్స్ కి దూరంగా సగటు మనిషికి కొరుకుడు పడని వ్యవహారాలు. పైగా అమెరికాలో వెయ్యి ఎకరాల్లో ప్లాట్లు అమ్మే కార్పొరేట్ సంస్థ యజమాని కూతురు తెలుగు ఇంగ్లీష్ మిక్స్ చేసి పుస్తకం రాయడం ఎంత మాత్రం అతకని వ్యవహారం. పెద్దన్నయ్య అతి తాగుడుకి కారణం, తర్వాత మారిపోయే వైనం విచిత్రంగా అనిపిస్తాయి. ఊరికే హీరోని హైలైట్ చేస్తూ కుటుంబ సభ్యులను డమ్మీ చేస్తే ఫ్యాన్స్ కి నచ్చడం కూడా కష్టమే.

ఒక వెరైటీ ట్విస్టుతో గీత గోవిందంలో హీరో హీరోయిన్ మధ్య ఈగో వార్ ని నవ్విస్తూ మెప్పించేలా చేసిన పరశురామ్ ఇందులో కూడా అదే చేయబోయి ఆ మలుపు తాలూకు డెప్త్ ని గుర్తించలేక గోవర్ధన్ ని స్టార్ చేయలేకపోయాడు. కేవలం లొకేషన్లు, ఖరీదైన ఇంటీరియర్లు, విదేశాల్లో దృశ్యాల  కోసం టికెట్ కొనే ట్రెండ్ లేదిప్పుడు. నవ్వించండి, థ్రిల్ చేయండి, మాస్ స్టఫ్ తో వావ్ అనిపించండి, లేదా ఎమోషన్లతో కంటతడి పెట్టించండి డబ్బులిస్తాం అంటున్నారు ప్రేక్షకులు. అంతే తప్ప సీరియల్ టైపు నాటకీయతకు కాసులు రాలడం కష్టం. ఎంతో క్యాలికులేటెడ్ గా ఉండే దిల్ రాజు గారు గోవర్ధన్ ప్రేమలో పడి మిగిలిన విషయాలను అంత సీరియస్ గా తీసుకోలేదేమో.

నటీనటులు

విజయ్ దేవరకొండ తన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి బాగానే చేశాడు కానీ ఎటొచ్చి తన ఎనర్జీ, టైమింగ్ ని వాడుకునే సత్తా ఫ్యామిలీ స్టార్ లో లేకపోయింది. మృణాల్ ఠాకూర్ ఫస్ట్ హాఫ్ లో క్యూట్ గా కనిపించినా రెండో సగం మొత్తం సింగల్ సీరియస్ ఎక్స్ ప్రెషన్ తో నీరసం తెప్పించింది. అఫ్కోర్స్ ఆమె తప్పేం లేదు. రోహిణి హట్టంగడిని పూర్తిగా వాడుకోలేదు. వాసుకి, అభినయ, రవి ప్రకాష్, దివ్యంషు కౌశిక్ జస్ట్ మొక్కుబడిగా ఉన్నారు. జగపతిబాబుది ఎన్నోసార్లు చూసిన పాత్రే. చివర్లో వచ్చే అచ్యుత కుమార్ చేసిందేమీ లేదు. వెన్నెల కిషోర్ నవ్వులు పూయించలేకపోయాడు. రవిబాబు, ప్రభాస్ శీను ఇలా చిన్న చితక తారాగణం అలా వచ్చి ఇలా వెళ్లిపోయేవాళ్లే

సాంకేతిక వర్గం

గోపి సుందర్ సంగీతం ఏ మాత్రం మేజిక్ చేయలేదు. రెండు పాటలు పర్వాలేదనిపించినా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో నిరాశ పరిచాడు. ప్రత్యేకంగా ఫలానా చోట బీజీఎమ్ బాగుందనే ఛాన్స్ ఇవ్వలేదు. కెయు మోహనన్ ఛాయాగ్రహణం పర్వాలేదు. విజువల్స్ బాగానే చూపించారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ లో అమెరికా ఎపిసోడ్ ఇంకొంచెం కోతకు గురవ్వాల్సింది. ల్యాగ్ ఎక్కువగా ఉంది. సంభాషణల పరంగా ఎక్కడా పరశురామ్ మెరుపులు లేవు. అవకాశమున్న చోట కూడా సింపుల్ గా లాగించారు. ఏవీ గుర్తుండవు. విపరీతంగా ఇష్టపడిన సబ్జెక్టు కావడంతో దిల్ రాజు నిర్మాణంలో రాజీ లేదు. ఎండ్ టైటిల్ సాంగ్ కోసం అంత ఖర్చు పెట్టడం ఈజీ కాదు.

ప్లస్ పాయింట్స్

నిర్మాణ విలువలు
రెండు పాటలు

మైనస్ పాయింట్స్

బలం లేని కథ
కుదరని భావోద్వేగాలు
యుఎస్ ఎపిసోడ్
సంగీతం

ఫినిషింగ్ టచ్ : కష్టం సార్

రేటింగ్ : 2 / 5