సమీక్ష – డంకీ

2.5/5

2 Hr 40 Mins   |   Drama   |   21-12-2023


Cast - Shah Rukh Khan, Vicky Kaushal, Taapsee, Boman Irani, Vikram Kochhar, Anil Grover, and others

Director - Rajkumar Hirani

Producer - Gauri Khan, Rajkumar Hirani

Banner - Red Chillies Entertainment, Jio Studios & Rajkumar Hirani Films

Music - Pritam, Aman Pant

ఒక స్టార్ హీరో కేవలం తొమ్మిని నెలల వ్యవధిలో రెండు వెయ్యి కోట్ల బ్లాక్ బస్టర్లు ఇవ్వడం ఒక్క షారుఖ్ ఖాన్ విషయంలోనే జరిగింది. జీరో డిజాస్టర్ తర్వాత మూడేళ్ళ గ్యాప్ తీసుకున్న కింగ్ ఖాన్ తన అభిమానుల నిరీక్షణకు న్యాయం చేకూరుస్తూ 2023లో ఏకంగా మూడు సినిమాలతో పలకరించాడు. జవాన్, పఠాన్ తర్వాత వస్తున్న మూవీగా కన్నా సలార్ కి పోటీగా నిలవడంతో తెలుగు ఆడియన్స్ దృష్టిలో పడ్డ డంకీ ప్యాన్ ఇండియా రిలీజ్ కు వెళ్లకుండా కేవలం హిందీ వెర్షన్ కు కట్టుబడింది. దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ – షారుఖ్ మొదటి కలయికలో వచ్చిన ఈ ఎమోషనల్ డ్రామా మీద క్లాస్ ఆడియన్స్ కి మంచి అంచనాలున్నాయి. మరి అవి నిలబడ్డాయా

కథ

నేపథ్యం 1995లో మొదలవుతుంది. ఆర్మీలో తన ప్రాణాలు కాపాడిన స్నేహితుడికి కృతజ్ఞత చెప్పడం కోసం పంజాబ్ లోని లాల్టూ గ్రామానికి వస్తాడు హర్దయాల్ సింగ్ ధిల్లాన్ అలియాస్ హార్డీ(షారుఖ్ ఖాన్). ఫ్రెండ్ చనిపోయాక అతని చెల్లెలు మను(తాప్సీ పన్ను)తో పాటు మరో ముగ్గురు కుటుంబ అవసరాల కోసం లండన్ వెళ్లే ప్లాన్ లో ఉన్నారని తెలుసుకుని సహాయం చేసేందుకు పూనుకుంటాడు. అయితే ఇంగ్లీష్ రాని కారణంగా వీసాలు తిరస్కరించబడతాయి. దీంతో అక్రమ పద్ధతితో వెళ్లాలని నిర్ణయించుకుని సాహసోపేతంగా వాళ్ళతో పాటు ఇంగ్లాండ్ చేరుకుంటాడు. అక్కడ మొదలవుతాయి అసలు కష్టాలు. అవేంటనేది తెరమీద చూడాల్సిన అసలు స్టోరీ.

విశ్లేషణ

సుదీర్ఘమైన కెరీర్లో అతి తక్కువ సినిమాలు తీసినా బాలీవుడ్ గర్వించదగిన క్లాసిక్స్ ఇచ్చిన దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ. ప్రేక్షకుల్లో ఆయన పట్ల ప్రత్యేకమైన గౌరవం ఉంది. అందుకే డంకీ మీద భారీ అంచనాల కన్నా ఆసక్తి ఎక్కువగా ఉంది. డంకీ అంటే అక్రమ రవాణా. ముప్పై సంవత్సరాల క్రితం జీవనోపాధి కోసం వేలాది భారతీయులు ఈ పద్దతిలో ఇతర దేశాల్లోకి చొరబడి ఉద్యోగాలు తెచ్చుకుని అక్కడే సెటిలయ్యారు. వాళ్లలో బాగా సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. సరిహద్దుల్లో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళూ ఉన్నారు. ఈ రెండో క్యాటగిరీకి చెందిన వాళ్ళ వ్యధకే కాసింత ఎమోషన్లు, కొంత ఎంటర్ టైన్మెంట్ జోడించే ప్రయత్నమే డంకీ.

ప్రారంభం నుంచే అవసరం లేని అంశాలకు చోటివ్వకుండా పాత్రల పరిచయం, వాటి తాలూకు సమస్యని త్వరగా ఎస్టాబ్లిష్ చేసిన హిరానీ ప్రీ ఇంటర్వెల్ దాకా ఎక్కడా ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్ టిట్యూట్ లో మరికాస్త కామెడీ జొప్పించే అవకాశం ఉన్నప్పటికీ దాన్ని డీసెంట్ గా నడిపించి విక్కీ కౌశల్ ఎపిసోడ్ తో ఒక్కసారిగా భావోద్వేగాల వైపు టర్న్ తీసుకోవడం మలుపు తిప్పుతుంది. అక్కడి దాకా సరదాగా నడిచిన సన్నివేశాలు మెల్లమెల్లగా సీరియస్ టోన్ లోకి మారిపోతాయి. స్నేహితుల లక్ష్యమేంటో మొదట్లోనే చెప్పేశారు కాబట్టి దానికి సంబంధించిన సస్పెన్స్ పెద్దగా ఉండదు కానీ ఎలా వెళ్తారనే ఆసక్తిని బాగానే చూపించగలిగారు.

రెండో సగం మొదలయ్యాక చిక్కొచ్చి పడింది. హిరానీ కొన్ని లాజిక్స్ ని విస్మరించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఎంత లండన్ లో ఉన్నా సరే పాతికేళ్ళు అసలు కుటుంబ సభ్యులతో మాట్లాడిందే లేదన్నట్టు చూపించడం అంతగా సింక్ అవ్వలేదు. డబ్బులు పంపించి వ్యవహారాలు చక్కదిద్దుకున్నా వాటికి సంబంధించిన సన్నివేశాలు జొప్పించి ఉంటే బాగుండేది. హార్డీ, మనుల మధ్య గ్యాప్ కి సరైన న్యాయం చేకూరలేదు. పాకిస్థాన్, దుబాయ్ మీదుగా లండన్ దాకా వెళ్లే క్రమాన్ని సైతం పైపై చూపించేసి మమ అనిపించారు. విదేశంలో పౌరసత్వాన్ని సంపాదించుకోవాలంటే మన దేశాన్ని తక్కువ చేయకూడదన్న సందేశాన్ని హార్డీ ద్వారా చెప్పించడం బాగుంది.

వీర్ జారా తరహాలో షారుఖ్ తాప్సి మధ్య బాండింగ్ ని ఆవిష్కరించాలని ప్రయత్నించిన హిరానీ రెండో సగంలో లండన్ లో బ్రతుకుతెరువుని, అక్కడ ఎదురుకున్న సమస్యలకు ఇంకాస్త ఎక్కువ డ్రామా జోడించి తీసి ఉంటే మాస్ కి కూడా కనెక్ట్ అయ్యే అవకాశం ఉండేది. పైగా దుబాయ్ నుంచి రివర్స్ డంకీ పద్దతిలో ఇండియాకు రావడం సిల్లీ ట్రీట్ మెంట్ తో రాసుకోవడం నమ్మశక్యంగా అనిపించలేదు. దీంతో క్లైమాక్స్ లో బరువెక్కించాల్సిన సన్నివేశాలు తేలిగ్గా అనిపిస్తాయి. దర్శకుడి గత చిత్రాల స్థాయిలో ఎక్కడా మేజిక్ జరుగుతున్న ఫీలింగ్ కలగకపోవడం సెకండ్ హాఫ్ లో జరిగిన మెయిన్ డ్యామేజ్. అంచనాల బరువు ఇక్కడ తప్పింది.

అలా అని డంకీని ఎంత మాత్రం బ్యాడ్ మూవీ అనలేం కానీ 3 ఇడియట్స్, పీకే, మున్నాభాయ్ సరసన నిలిచేలా మాత్రం లేదు. లైట్ ఎమోషన్స్, లీడ్ క్యాస్టింగ్ పెర్ఫార్మన్స్, ఓ మోస్తరు సంగీతం ఉంటే చాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. అలా కాకుండా హీరో డైరెక్టర్ కాంబినేషన్ మీద ఏవేవో ఊహించుకుని థియేటర్లో అడుగు పెడితే మాత్రం బాగుందా పూర్తిగా బాలేదా చెప్పలేని అయోమయంలోనే బయటికి రావాల్సి ఉంటుంది. సగటు జనాలకు అంతగా కనెక్ట్ కాలేని అక్రమ వలస కాన్సెప్ట్ ని తీసుకున్నప్పుడు ఎమోషన్స్ తో పాటు పరుగులు పెట్టాల్సిన స్క్రీన్ ప్లే డంకీ ఇంకో స్థాయికి తీసుకెళ్లేది. అలాని హిరానీ బ్రాండ్ కి నష్టపరిచేలా కూడా లేదు.

నటీనటులు

షారుఖ్ ఖాన్ అనుభవం గురించి చెప్పేదేముంది. హార్డీని అలవోకగా పండించేశాడు. ముసలి వేషంలో మేకప్ కాస్త శ్రద్ధ తీసుకుని ఉంటే బాగుండేది. బరువైన సీన్లలో బాద్షా ఎప్పటిలాగే అదరగొట్టాడు. తాప్సి పన్ను పెర్ఫార్మన్స్ తో మెప్పించడం ఆశ్చర్యపరుస్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో చలాకి మన్నుగా బెస్ట్ ఇచ్చింది. విక్కీ కౌశల్ ఉండేది కాసేపే అయినా కీలకంగా వ్యవహరించి గుర్తుండిపోయాడు. హిరానీకి బలమైన సపోర్ట్ గా ఉండే బోమన్ ఇరానీకి పరిమిత పాత్ర దక్కింది. విక్రమ్ కొచ్చర్, అనిల్ గ్రోవర్ సపోర్టింగ్ రోల్స్ లో బాగా కుదిరారు. అయితే త్రీ ఇడియట్స్ లో మాధవన్ రేంజ్ ఆర్టిస్టులు దొరికి ఉంటే ఇంకా బాగుండేది కానీ తారాగణంలో ఎవరూ నిరాశపరచలేదు

సాంకేతిక వర్గం

ప్రీతమ్ అందించిన పాటలు క్యాచీగా ఉన్నాయి. చూసేందుకు ఓకే కానీ మరీ పదే పదే వినాలనిపించే రిపీట్ ఆల్బమ్ కాదు. అమన్ పంత్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. రణగొణ ధ్వని లేకుండా డీసెంట్ గా సాగింది. మురళీధరన్ – మానుష్ నందన్ – అమిత్ రాయ్ ల జంట ఛాయాగ్రహణం బాగుంది. రాజ్ కుమార్ హిరానీ స్వీయ ఎడిటింగ్ లో వీలైనంత లెన్త్ ని కంట్రోల్ లో ఉంచేందుకు ప్రయత్నించారు. మూడు గంటలు లేకపోవడం పెద్ద రిలీఫ్. కట్ చేసి ఉంటే బాగుండేదనిపించే భాగాలు పెద్దగా లేవు. జియో స్టూడియోస్, రాజ్ కుమార్ హిరానీ ఫిలిమ్స్, రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్మెంట్ నిర్మాణ విలువలు గ్రాండ్ గా ఉన్నాయి. ప్రొడక్షన్ వేల్యూస్ తెరమీద కనిపిస్తాయి.

ప్లస్ పాయింట్స్

షారుఖ్ – తాప్సి నటన
స్టోరీ బ్యాక్ డ్రాప్
ఫస్ట్ హాఫ్
కొన్ని భావోద్వేగాలు

మైనస్ పాయింట్స్

డ్రామా పాలు తగ్గడం
లాజిక్స్ తగ్గిన సన్నివేశాలు
సెకండ్ హాఫ్
ఎంటర్ టైన్మెంట్ తక్కువే

ఫినిషింగ్ టచ్ – కొంచెం డల్లే….కానీ డీసెంట్

రేటింగ్ : 2.5/5