దసరా లాంటి మాస్ బ్లాక్ బస్టర్ పడ్డ తర్వాత సాధారణంగా హీరోలు సేఫ్ గేమ్ కోసం అదే జానర్ లో మళ్ళీ ప్రయత్నిస్తారు. కానీ న్యాచురల్ స్టార్ నాని దానికి భిన్నంగా కొత్త దర్శకుడు శౌర్యువ్ కి అవకాశం ఇవ్వడమే కాక హాయ్ నాన్న లాంటి కాన్సెప్ట్ కి ఓకే చెప్పడం విశేషమే. మంచి ప్రమోషన్లు, తను టార్గెట్ చేసుకున్న ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా ట్రైలర్ కట్ చేయడం అంచనాలు రేకెత్తించాయి. బాక్సాఫీస్ వద్ద యానిమల్ దూకుడు, ఒక రోజు గ్యాప్ తో నితిన్ ఎక్స్ ట్రాడినరీ మ్యాన్ తో పోటీ మధ్యలో వచ్చిన నాన్నా గెలిచేలా ఉన్నాడా
కథ
ముంబైలో స్టూడియో నడిపే ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ విరాజ్(నాని)కు కూతురు మహి(బేబీ కియారా)నే లోకం. కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటాడు. ఓ రాత్రి కథ చెప్పలేదని అలిగి బయటికెళ్లిన మహికి అనుకోకుండా యష్న(మృణాల్ ఠాకూర్) పరిచయమవుతుంది. ఇద్దరూ కలిసి ఒక కేఫ్ లో అమ్మ కథ చెప్పమని కోరతారు. దీంతో యష్నినే తల్లి పాత్రలో ఊహించుకోమంటూ విరాజ్ ఓ హిల్ స్టేషన్ లో తన భార్య వర్షతో జరిగిన ప్రేమకథను మొదలుపెడతాడు. ఆ తర్వాత ఈ ముగ్గురి ప్రయాణం ఊహించని మలుపులకు దారి తీస్తుంది
విశ్లేషణ
భావోద్వేగాలు ప్రధానంగా నడిపించే డ్రామాలను ఏ దర్శకుడైనా సరే వేగంగా చెప్పలేరు. ఎందుకంటే థ్రిల్స్, సస్పెన్స్, యాక్షన్ లాంటి ఎలిమెంట్స్ కి చోటు ఉండదు కాబట్టి. క్లాసిక్ గా కొనియాడబడే మణిరత్నం గీతాంజలి కూడా స్లో నెరేషన్ లోనే సాగుతుంది. దర్శకుడు శౌర్యువ్ తాను రాసుకున్న స్క్రిప్ట్ కి కట్టుబడి నిజాయితీగా హాయ్ నాన్న చెప్పాలనుకున్నాడు. అది రెండు గంటల ముప్పై అయిదు నిమిషాల నిడివిలో ప్రతి చోటా అనిపిస్తునే ఉంటుంది. ముందు విరాజ్, మహిల మధ్య బాండింగ్ ని మెల్లగా ఎస్టాబ్లిక్ చేసి ఆ తర్వాత యష్నిని తీసుకొచ్చి ముగ్గురిని థ్రెడ్ ని మరీ గొప్పగా కాకపోయినా చక్కగా కలిపి తానేం చెప్పబోతున్నాడో ప్రిపేర్ చేస్తాడు.
విరాజ్ లవ్ స్టోరీ మొదలయ్యాక జరిగే క్రమం సాధారణంగా ఉండటంతో అక్కడెలాంటి ప్రత్యేకత అనిపించదు. పెళ్లి చేసుకున్నాక ఇద్దరూ ఎందుకు దూరమయ్యారనే కారణాన్ని కన్విన్సింగ్ గా చెప్పగలిగినా వాళ్ళ బంధంలోని ఘాడత మరీ తీవ్రంగా ప్రేక్షకుల మనసులో నాటుకోలేకపోయింది. అయినా సరే ఇబ్బందేం లేకుండా అలా గడిచిపోతుంది. అయితే శౌర్యువ్ ఎక్కువ డిటైలింగ్ కి ప్రాధాన్యం ఇవ్వడంతో సన్నివేశాలు నెమ్మదిగా కదులుతాయి. పైగా కామెడీ లేకపోయినా సరే అవసరమున్నచోట సరదాగా అనిపించే సీన్లకు సైతం చోటివ్వకపోవడంతో కొంత బోర్ ఫీలయ్యే అవకాశం ఇచ్చాడు. పాప సమస్యని డీవియేట్ చేయకూడదనే ఆలోచన కావొచ్చు.
ఎంత కాన్సెప్ట్ కి కట్టుబడి ఉండాలనుకున్నా సరే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ తో పాటు ఎంటర్ టైన్మెంట్ అవసరం. చిరంజీవి డాడీ ఫస్ట్ హాఫ్ లో విపరీతంగా ఏడ్పించాక సెకండ్ హాఫ్ లో కుటుంబాలకు నచ్చేలా తండ్రి కూతురు మధ్యలో మంచి ఫన్ ఉంటుంది. కానీ హాయ్ నాన్నలో అలాంటి వాటికి చోటివ్వలేదు. క్లైమాక్స్ కు ముందు అరగంట హెవీ ఎమోషన్ ని బాగా పండించినప్పటికీ దానికి ముందు జరిగే తతంగమంతా ఊహించినట్టే జరుగుతూ పోవడం కొంత మైనస్ అయ్యింది. ఇంటర్వెల్ తర్వాత అసలు ట్విస్ట్ ఓపెన్ చేశాక యష్ని పెళ్ళికి ముందు నడిపించిన నాటకీయతలో సినిమాటిక్ ఫ్లేవర్ తగ్గిపోయింది. దాంతో నెమ్మదితనంపెరిగి ల్యాగ్ ఫీలింగ్ కలుగుతుంది.
విరాజ్, మహి, యష్న ఈ ముగ్గురితో విపరీతంగా కనెక్ట్ అయితే హాయ్ నాన్నతో ఎలాంటి సమస్య రాదు. అలా కాకుండా చక్కగా కాలక్షేపం అవుతుందనుకుని సిద్ధపడితే మాత్రం శౌర్యువ్ చూపించిన స్లోనెస్ అసహనానికి దారి తీసే ఛాన్స్ లేకపోలేదు. బేబీ కియారా క్యూట్ లుక్స్, నటనని మరింత వాడుకునేలా అదనపు ప్లాట్స్ ఏమైనా రాసుకుని ఉంటే పెద్దలతో పాటు పిల్లలు కూడా ఎంజాయ్ చేసేవాళ్ళు. ఆ ఛాన్స్ వదిలేశారు. చాలా సేపు ఫోకస్ మొత్తం నాని, మృణాల్ వైపే ఉండటంతో ఒకదశ దాటాక కియారా సైడ్ ట్రాక్ అయిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. టైటిల్ హాయ్ నాన్నని పెట్టారు కానీ నిజానికి స్టోరీ పరంగా అమ్మకే ప్రాధాన్యం ఎక్కువగా అనిపిస్తే పొరపాటేం కాదు.
ఒకపక్క కన్నీళ్లు పెట్టించే బలగంలు, ఇంకో పక్క రక్తపాతంతో నిండిన యానిమల్ లు రెండింటినీ ఆదరిస్తున్న ట్రెండ్ లో హాయ్ నాన్న కంటెంట్ పరంగా ఎటు వైపు నిలుస్తుందో ఈజీగా చెప్పొచ్చు కానీ బాక్సాఫీస్ లెక్కలను ఏ మేరకు కంట్రోల్ లోకి తీసుకుంటుందనేది రకరకాల పరిస్థితుల మీద ఆధారపడి ఉంది. థియేటర్ ఎక్స్ పీరియన్స్ డిమాండ్ చేసే సినిమా ఇస్తే చాలు హీరో ఎవరనేది పట్టించుకోకుండా జనాలు పోటెత్తున్నారు. హాయ్ నాన్న అద్భుతాలు చేసినా చేయకపోయినా ఇలాంటి సెన్సిబిలిటీస్ అప్పుడప్పుడు స్క్రీన్ ని తడుముతుంటే ప్రేక్షకుల సున్నితత్వం బ్రతుకుతూ ఇలాంటివి చూడొచ్చనే భావన పెంచుతూ పోతుంది. శౌర్యువ్ లక్ష్యం ఇదే
నటీనటులు
నాని అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా విరాజ్ గా పరకాయ ప్రవేశం చేశాడు. రెస్టారెంట్లో మృణాల్ తల్లితో సంభాషణ, యష్న వేడుక జరిగే చోట చూపించే వేరియేషన్స్ కొన్ని ఉదాహరణలు మాత్రమే. మృణాల్ ఠాకూర్ పర్ఫెక్ట్. తనకిచ్చిన అంత బరువైన పాత్రలో ఒదిగిపోయిన తీరు ఆశ్చర్యపరుస్తుంది. జయరాం కనిపించే కాసేపే అయినా నిండుతనం తీసుకొచ్చారు. ప్రియదర్శిని ఎక్కువ వాడుకోలేదు. ఉన్నంతలో ఓకే. శృతి హాసన్ ఒక పాట కోసమే తీసుకున్నా తేలిపోయింది. నాజర్, అంగద్ బేడీ రెగ్యులరే. బేబీలో గుర్తింపు తెచ్చుకున్న విరాజ్ అశ్విన్ ఇందులో సపోర్టింగ్ ఆర్టిస్టుగా మరీ చిన్న పాత్ర దక్కించుకున్నాడు. ప్రధాన క్యాస్టింగ్ వీళ్ళే.
సాంకేతిక వర్గం
హేశం అబ్దుల్ వహాబ్ ఎప్పటిలాగే ఫీల్ గుడ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో హాయ్ నాన్నని నిలబెట్టాడు. సాహిత్యపు విలువలు స్పష్టంగా వినిపించడం బాగుంది కానీ రెండు తప్ప పాటలు మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా లేవు. పార్టీ సాంగ్స్ కంపోజ్ చేయడంతో తన బలహీనత మరోసారి బయటపడింది. ఎవర్ గ్రీన్ ఆల్బమ్ పడి ఉంటే ఇంకో స్థాయికి వెళ్ళేది. సాను వర్గీస్ ఛాయాగ్రహణం ప్లెజెంట్ గా ఉంది. విజువల్స్ ని అందంగా ప్రెజెంట్ చేశారు. ప్రవీణ్ ఆంటోనీ ఎడిటింగ్ కొంత నిడివిని షార్ప్ చేసి ఉంటే వేగం పెరిగేది. ఫైట్లు గట్రా పెట్టలేదు. సంభాషణలు కూల్ అండ్ సింపుల్ గా ఉన్నాయి. బడ్జెట్ పరంగా రిస్క్ లేని వైరా సంస్థ నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్
నాని నటన
మృణాల్, బేబీ కియారా
బీజీఎమ్
కెమెరా పనితనం
మైనస్ పాయింట్స్
నెమ్మదిగా సాగే కథనం
ఎంటర్ టైన్మెంట్ లేకపోవడం
కొంత హెవీ ఎమోషన్
ఫ్లాష్ బ్యాక్
ఫినిషింగ్ టచ్ : నెమ్మదిగా హత్తుకునే నాన్న
రేటింగ్ : 2.75/5
This post was last modified on December 7, 2023 12:45 pm
ప్రభాస్ తన లైనప్ లో ఎన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసినా కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫోకస్ మాత్రం…
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం వైసీపీ లేని లోటును టీడీపీ ఎమ్మెల్యేలే తీర్చేస్తున్నారు. నిజానికి వైసీపీ ఉంటే కూడా ఇంతగా…
టాలీవుడ్లో అయినా.. మొత్తం ఇండియాలో అయినా… సోషల్ మీడియాలో అత్యధిక ట్రోలింగ్ ఎదుర్కొన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే మరో…
మాములుగా ఎంత పెద్ద సినిమా అయినా సరే మూడో వారంలోకి వచ్చాక నెమ్మదించడం సహజం. కానీ అమరన్ మాత్రం ఈ…
తెలుగు సినిమా చరిత్రలోనే గొప్ప దర్శకుల్లో సుకుమార్ ఒకరు అనడంలో సందేహం లేదు. 20 ఏళ్ల కిందట్నుంచి సినిమాలు తీస్తున్న…
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…