సమీక్ష – జిగర్ తండ డబుల్ ఎక్స్

1.75/5

2 hour 52 Minutes   |   Period - Action - Drama   |   10-11-2023


Cast - Raghava Lawrence, SJ Suryaj, Shine Tom Chacko, Nimisha Sajayan, Naveen Chandra, Sathyan, Aravind Akash, Ilavarasu and Others

Director - Karthik Subbaraj

Producer - Kaarthikeyan Santhanam, S Kathiresan

Banner - Stone Bench Films, Five Star Creations

Music - Santhosh Narayan

పిజ్జాతో దర్శకుడిగా లైమ్ లైట్ లోకి వచ్చిన కార్తీక్ సుబ్బరాజ్ తర్వాత మనకు దగ్గరయ్యింది రజనీకాంత్ పేటతోనే. జిగర్ తండ మొదటి భాగం తెలుగులో గద్దలకొండ గణేష్ గా రీమేక్ కావడంతో దాని ఒరిజినల్ వెర్షన్ చూసే ఛాన్స్ దక్కలేదు కానీ ఈసారి అలా జరగకుండా చూసుకున్నారు నిర్మాతలు. లారెన్స్, ఎస్జె సూర్య కలయికతో పాటు ట్రైలర్ ఆసక్తికరంగా ఉండటంతో భారీగా కాదు కానీ ఓ మోస్తరు అంచనాలు ఏర్పడ్డాయి. దీపావళి పండగని డబ్బింగ్ సినిమాలకు వదిలేసిన తరుణంలో ఈ డబుల్ ఎక్స్ కోరుకున్న కిక్ ఇచ్చిందా

కథ

పోలీసుగా ఎంపికైన రే దాస్(ఎస్జె సూర్య) చేయని హత్యకు అన్యాయంగా జైలు పాలవుతాడు. తాను చెప్పిన మర్డర్ చేస్తే బయటికి తెస్తానని డిఎస్పి(నవీన్ చంద్ర) మాట ఇవ్వడంతో ఒప్పుకుంటాడు దాస్. కర్నూలులో రౌడీగా చెలామణి అయ్యే సీజర్ (రాఘవేంద్ర లారెన్స్)ని చంపడమే లక్ష్యంగా అతనికున్న సినిమా పిచ్చి బలహీనత ఆధారంగా ప్లాన్ చేసుకుని అక్కడికి వెళ్తాడు. షూటింగ్ మొదలుపెట్టాక ఇద్దరు కలిసి ఓ అడవికి వెళ్లాల్సి వస్తుంది. తర్వాత జరిగే రాజకీయ పరిణామాలు వీళ్ళ జీవితాలను మార్చేస్తాయి

విశ్లేషణ

కల్ట్ డైరెక్టర్ గా మూవీ లవర్స్ గౌరవించే కార్తీక్ సుబ్బరాజ్ ది చాలా ప్రత్యేక శైలి. సమాజాన్ని పట్టి పీడించే ఒక సమస్యను తీసుకుని దానికి తనదైన శైలిలో డ్రామా జోడించి మెప్పించే ప్రయత్నం చేస్తాడు. సిద్దార్థ్, బాబీ సింహలతో తీసిన ఫస్ట్ పార్ట్ లో మెసేజ్ జోలికి వెళ్లకుండా ఒక కరుడుగట్టిన దుర్మార్గుడిలో సినిమా అనే మాధ్యమం ఎలాంటి మార్పు తీసుకురావచ్చో చాలా విభిన్నంగా చూపించాడు. అది ఆడియన్స్ కి బ్రహ్మాండంగా కనెక్ట్ అయిపోయి కమర్షియల్ గానూ ఆడింది. ఈసారి సీక్వెల్ కి దానికి సంబంధం లేని బ్యాక్ డ్రాప్ ఎంచుకుని ఎమోషన్స్ కి పెద్ద పీఠ వేసి ప్రేక్షకులను ఆలోచింపజేయాలనే లక్ష్యంతో సుదీర్ఘమైన కథాకథనాలతో వచ్చాడు.

జిగర్ తండలో డబుల్ ఎక్స్ లోనూ మళ్ళీ అలాంటి పాయింటే తీసుకున్న సుబ్బరాజ్ టెక్నికల్ గా కొన్ని సన్నివేశాలను అద్భుతంగా తీర్చిదిద్దారు. సాంకేతిక విభాగాల మీద తనకెంత పట్టుందో అర్థమవుతుంది. అయితే బలమైన క్యారెక్టరైజేషన్లు లేకపోవడం వల్ల దాని తాలూకు ప్రభావాన్ని పూర్తిగా ఫీల్ కాలేం. సీజర్ ని కరుడు గట్టిన దుర్మార్గుడిగా చూపించి, రే దాస్ రాగానే అతనేం చెబితే అది వినే అమాయక రీతిలో ప్రవర్తించడం అంత నమ్మశక్యంగా అనిపించదు. అతనిలో అంత మార్పు రావడానికి కారణాలు సరైన రీతిలో ఎస్టాబ్లిష్ చేయలేదు. దీని వల్ల ఫస్ట్ హాఫ్ లో అధిక భాగం నెమ్మదిగా సాగుతూ అసలు స్టోరీ ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తాం.

ఇంటర్వెల్ బ్యాంగ్ మరీ వావ్ అనలేం కానీ నెక్స్ట్ ఏం జరుగుతుందానే ఆసక్తి రేపడంలో సుబ్బరాజ్ సక్సెసయ్యాడు. సీజర్, దాస్ ఇద్దరూ అడవిలోకి వెళ్ళాక కొండజాతిని ఉద్ధరించే బాధ్యతను వీళ్లకప్పగించి కొత్త మలుపు తిప్పాక అసలు స్టోరీ మొదలవుతుంది. కాకపోతే ఇదంతా లాజిక్ కి దూరంగా సాగే వ్యవహారంలా తోస్తుంది. అయిదు దశాబ్దాల క్రితం జరిగిన సంఘటనలను అల్లుకుని రాసుకున్న కథే అయినా వాస్తవానికి దూరంగా వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్ గా ఆడియన్స్ కంటెంట్ తో డిస్ కనెక్ట్ అవుతారు. మూవీ లవర్స్ తెరమీద జరుగుతున్న టెక్నికల్ బ్రిలియన్స్ ని ఎంజాయ్ చేయొచ్చు. కానీ సగటు ఆడియన్స్ మాత్రం ఏంటిదని ఊగిసలాడుతూ ఉంటారు.

చివరి గంట ఎంగేజింగ్ గా ఉన్నప్పటికీ అదంతా తమిళ వాసనలోనే సాగటం ప్రధాన మైనస్. నేటివిటీ తగ్గినప్పటికీ మొత్తం అడవిలోనే జరుగుతుంది కాబట్టి కొంత డిఫరెంట్ గా ఫీలవుతాం. కొన్ని సినిమాలకు థియేటర్ లో చూడాల్సి వస్తే ముందే కొంత ప్రిపేరేషన్ అవసరమవుతుంది. అప్పుడే వాటిని ఆస్వాదించగలం. ఈ జిగర్ తండ డబుల్ ఎక్స్ ఆ కోవలోకే వస్తుంది. అలా చేసుకుని వెళ్ళడానికి ఇదేమి పరీక్ష కాదుగా. సాధారణ జనాలకు అదంతా అనవసరం. టికెట్ కొన్నాను, నేను ఊహించినట్టు ఉందా లేదానేదే ముఖ్యం. మహేష్ బాబు 1 నేనొక్కడినే ఫెయిలవ్వడానికి కారణం ఇదేగా. జిగర్ తండలో ఈ సమస్య మరింత ఎక్కువైపోయింది.

కమర్షియల్ సక్సెస్ కోణంలో ఇదేమీ అద్భుతాలు చేయకపోవచ్చు కానీ ఒక నిజాయితీ కలిగిన ప్రయత్నంగా మాత్రం జిగర్ తండ డబుల్ ఎక్స్ నిలుస్తుంది. నల్లగా ఉన్న వాళ్ళు హీరోగా పనికిరారని అప్పట్లో ఉన్న ఇండస్ట్రీ పోకడ గురించి ఏదో చెబుదామని ప్రయత్నించాడు కానీ తర్వాత డైవర్ట్ అయిపోయాడు. వీరప్పన్ లాంటి వాళ్ళను పెంచి పోషించింది ప్రభుత్వ పెద్దలేనని చెప్పే పాయింట్ కూడా బాగానే సింక్ అయ్యింది. లారెన్స్, ఎస్జె సూర్యలు తమ యాక్టింగ్ తో ఎన్నో బలహీనతలను కవర్ చేసే ప్రాయత్నం చేసినా అవన్నీ మలి భాగంలో ఉపయోగపడ్డాయి. చివరి అరగంట మాత్రం ఎమోషనల్ గా ఎక్కువ హై ఇవ్వకపోయినా గుడ్ అనే మెచ్చుకోలు తెచ్చుకుంది

నటీనటులు

సీజర్ గా రాఘవేంద్ర లారెన్స్ కెరీర్ లోనే బెస్ట్ అనే పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. కొన్ని చోట్ల రాతలో ఉన్న తడబాటు వల్ల కాస్త ఊగాడు కానీ ఫైనల్ గా గుర్తుండిపోయేలా చేశాడు. ఎస్జె సూర్య తనవంతుగా ఇచ్చిన బాధ్యతని నెరవేర్చాడు. మార్క్ ఆంటోనీలా డామినేట్ చేసే ఛాన్స్ దక్కలేదు. దసరా విలన్ షైన్ టామ్ షాకో రెండు మూడు సీన్లు కనిపించి మాయమైపోయాడు. నవీన్ చంద్రకు కోలీవుడ్ ద్వారాలు తెరిచినట్టే. సెటిల్డ్ విలనీని బాగా పండించాడు. నిమిష విజయన్ నటన పరంగా ఓకే. అధిక శాతం జూనియర్ ఆర్టిస్టులు నిండిపోయారు. ముఖ్యమంత్రిగా చేసినావిడ నప్పలేదు. సత్యన్ ఫస్ట్ హాఫ్ కే పరిమితం. స్త్రీ పాత్రలు ఎక్కువ లేకపోవడం గమనించాల్సిన విషయం

సాంకేతిక వర్గం

సంతోష్ నారాయణన్ ఈ జిగర్ తండ డబుల్ ఎక్స్ కు అసలు పిల్లర్. పాటల్లో సౌండ్ ఎక్కువైపోయి నిరాశపరిచాయి కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం బెస్ట్ ఇచ్చాడు. చాలా చోట్ల అతి మాములు సీన్లు సైతం తన నేపధ్య సంగీతం వల్ల ఎలివేట్ అయ్యాయి. ముఖ్యంగా ఆనాటి వాతావరణానికి తగ్గట్టు ఇచ్చిన సౌండ్ సహజంగా ఉంది. తిరు ఛాయాగ్రహణంకు ఫుల్ మార్కులు ఇవ్వొచ్చు, క్లిష్టమైన ఇంటీరియర్స్, కష్టంగా అనిపించే అటవీ లొకేషన్లను చూపించిన తీరు బాగా వచ్చింది. షఫీక్ మొహమ్మద్ అలీ ఎడిటింగ్ లో కత్తెరలో ఇంకొంత పదును ఉంటే స్పీడ్ పెరిగేది. అయిదు నిర్మాణ సంస్థలు చేతులు కలపడంతో ప్రొడక్షన్ పరంగా ఎలాంటి లోటుపాట్లు జరగలేదు

ప్లస్ పాయింట్స్

లారెన్స్ నటన
అడవి ఎపిసోడ్లు
టెక్నికల్ స్టాండర్డ్స్

మైనస్ పాయింట్స్

ఫస్ట్ హాఫ్
ఎగుడుదిగుడు కథనం
ఎక్కువ నిడివి
సింకవ్వని పాటలు

ఫినిషింగ్ టచ్ – సింగిల్ ఎక్స్

రేటింగ్ – 1.75 / 5