సమీక్ష – మా ఊరి పొలిమేర 2

2.25/5

2 hr 2 min   |   Horror - Thriller   |   03-11-2023


Cast - Sathyam Rajesh, Baladitya, Kamakshi Bhaskarla Sahithi Dasari, Getup Sreenu, Chitram Sreenu and others

Director - Anil Viswanath

Producer - Gauri Krishna

Banner - Shree Krishna Creations

Music - Gyaani

కరోనా టైంలో డైరెక్ట్ ఓటిటిలో రిలీజైన సినిమాకు సీక్వెల్ తీయడం పెద్ద ఆశ్చర్యం కాదు కానీ దాన్ని థియేటర్ రిలీజ్ కు సిద్ధం చేయడం మాత్రం మా ఊరి పొలిమేరకే జరిగింది. పబ్లిసిటీ విషయంలో టీమ్ తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ అంచనాలు క్రమంగా పెంచుతూ పోయింది. క్రేజీ కంటెంట్ గా ప్రీ బజ్ తెచ్చుకున్న కీడా కోలా పోటీలో ఉన్నా దానివైపున్న ఆసక్తిలో కొంత భాగం తనవైపుకు తిప్పుకునేలా చేయడంలో సక్సెసయ్యింది. స్టార్లు లేకుండా కేవలం సపోర్టింగ్ ఆర్టిస్టులతో తీసిన ఈ పొలిమేర 2 సరిహద్దులు దాటిందా లేదా

కథ

జాస్తిపల్లి జనాలు చనిపోయాడనుకున్న కొమిరి(సత్యం రాజేష్) కేరళలో హోటల్ పెట్టుకుని అక్కడ కవిత(రమ్య)తో కొత్త కాపురం పెట్టి జీవితం గడుపుతూ ఉంటాడు. ఇతని తమ్ముడు జంగయ్య(బాలాదిత్య) అదృశ్యం కేసుని తవ్విన కొత్త ఎస్ఐ రవీంద్ర(రాకేందు మౌళి) అసలు రహస్యాన్ని ఛేదించడానికి పూనుకుంటాడు. భర్త బ్రతికే ఉన్నాడని తెలిసిన లక్ష్మి(కామాక్షి)అతని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఊరి పొలిమేరలో ఉన్న గుడిలో ఏదో గొప్ప నిధి ఉందని తెలుసుకున్న కొందరు నగరవాసులు సర్పంచ్(రవివర్మ) సహాయంతో వల పన్నుతారు. మరి కొమిరి చేతబడులు వదిలేశాడా, బలిజ(గెటప్ శీను)ని కలిశాక ఏం చేశాడన్నది తెర మీద చూడాలి.

విశ్లేషణ

ఒకప్పుడు చేతబడులు గురించి గ్రామాల్లో చాలా అవగాహన ఉండేది. ఈ పాయింట్ మీద యండమూరి వీరేంద్రనాథ్ రాసిన తులసి దళం నవల నలభై ఏళ్ళ క్రితం ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. క్రమంగా దీని మీద జనంలో ఆసక్తి తగ్గిపోయి అక్కడక్కడా తప్ప ఈ ప్రక్రియ గురించి ఆనవాళ్లు తక్కువగా కనిపిస్తాయి. దెయ్యాలు భూతాలు నవ్వుల సరుకుగా మారిపోయిన ట్రెండ్ లో సీరియస్ గా చెప్పగలిగే అవకాశం ఉన్నది ఇలాంటి చేతబడుల గురించే. విరూపాక్ష అంత పెద్ద బ్లాక్ బస్టర్ కావడానికి కారణం ఒళ్ళు గగుర్పొడిచే విధంగా దాన్ని చెప్పిన తీరు. మా ఊరి పొలిమేర దర్శకుడు అనిల్ విశ్వనాథ్ అదే బాటలో వెళ్లేందుకు బలమైన ప్రయత్నం చేశాడు.

స్టోరీ పరంగా చూసుకుంటే ఇందులో బోలెడు మలుపులున్నాయి. ఫస్ట్ పార్ట్ అంతగా సక్సెస్ ఎందుకయ్యిందంటే కేవలం గంటన్నర నిడివితో ఓటిటిలో వచ్చింది కాబట్టి. ఎప్పుడైతే కొనసాగింపుని థియేటర్ కు ప్లాన్ చేసుకున్నారో దీని పరిధి బాగా పెంచాల్సి వచ్చింది. అనిల్ సరైన హోమ్ వర్క్ చేసుకోలేదు. కొమిరి చనిపోలేదనే నిజం ఆల్రెడీ ప్రేక్షకులకు తెలిసిపోయింది కాబట్టి కొత్తగా ఆసక్తి రేపడానికి ఇంకో హుక్ పాయింట్ కావాలి. దాని కోసం కార్తికేయ తరహాలో గుడిలో నిధి కాన్సెప్ట్ ని తీసుకున్నాడు. దానికి కొమిరి చేతబడులకు లింక్ పెట్టి తద్వారా ఆడియన్స్ ని భయపెట్టాలని ఆలోచనతో స్క్రిప్ట్ రాసుకున్నాడు. కానీ ఆచరణలో తడబాటు ఎదురయ్యింది.

స్పాన్ పెరిగింది కాబట్టి దానికి అనుగుణంగా కథనం పరుగులు పెట్టాలంటే ట్విస్టులు చాలా కీలకం. ఇందులో షాక్ ఇచ్చేవి రెండు మూడున్నాయి. అయితే మొదటి గంట అధిక శాతం పొలిమేర 1లో ఏం జరిగిందో మళ్ళీ చూపించేందుకు ఎక్కువ సమయం కేటాయించడంతో నెమ్మదితనం వచ్చేసింది. పైగా నాన్ లీనియర్ స్టైల్ లో చెబుదామని ట్రై చేసి గతం, వర్తమానం మధ్య పదే పదే ట్రిప్పులు కొట్టడంతో ఒకదశలో అయోమయం కూడా నెలకొంటుంది. కొమిరి కేరళకు వెళ్ళాక కూడా చేతబడులు మానలేదని చూపించడం వరకు బాగానే ఉన్నా ఆ తర్వాత వచ్చే ఫ్లాష్ బ్యాకులు ఎక్కువైపోవడంతో అవన్నీ రిపీట్ అనిపించే రిస్క్ తెచ్చుకున్నాయి.

అసలైన మలుపులను సెకండ్ హాఫ్ లో రాసుకున్న అనిల్ విశ్వనాథ్ వాటిని బాగానే ప్రెజెంట్ చేశాడు. కానీ సీరీస్ కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో ప్రీ క్లైమాక్స్ లో అవసరం లేకపోయినా పాట పెట్టడం, కొమిరి లక్ష్మిల మధ్య ఎమోషన్ కోసం సుదీర్ఘమైన సంభాషణలు పెట్టడం నిడివిని పెంచాయి తప్ప థ్రిల్ ని కాదు. తెరమీద చూస్తున్న క్యారెక్టర్ల మీద ముందొక అభిప్రాయం కలిగించి తెలివిగా మోసం చేసిన అనిల్ విశ్వనాథ్ వాటి తాలూకు గుట్టుని క్రమంగా విప్పుకుంటూ పోవడం పర్లేదనిపిస్తాయి. అయినా నెరేషన్ ఒక ఫ్లోలో వెళ్లకుండా ఎక్కువ శాతం ట్విస్టుల మీద ఆధారపడటంతో చాలా చోట్ల లాజిక్స్ మిస్సయిపోయాయి. గుడి బ్యాక్ డ్రాప్ కూడా ఫోర్స్ గానే అనిపిస్తుంది.

మా ఊరి పొలిమేర 2 బడ్జెట్ పరిమితులు క్వాలిటీని తగ్గించాయి. పొలిమేర 1 ఒకే ఊరిలో జరుగుతుంది. కానీ సీక్వెల్ లో అవుట్ డోర్స్ కావాల్సి వచ్చింది. కానీ ఖర్చు చేయడానికి లేదు. దీంతో లొకేషన్లలో సహజత్వం తగ్గింది. నైట్ షాట్స్ లో తగినంత శ్రద్ధ తీసుకోలేకపోవడం సన్నివేశాల్లోని గాఢతని తగ్గించేసింది. తప్పు చేసింది ఒకరైతే ఇంకొరు చేశారన్నట్టు నమ్మించడం వరకు ఓకే కానీ ఒక దశ దాటాక కేవలం ఇలా చేస్తేనే ఆడియన్స్ థ్రిల్ అవుతారనే అనిల్ అంచనా పూర్తిగా నెరవేరలేదు. విలేజ్ బ్యాక్ డ్రాప్ నడవడం వల్ల ఆ వాతావరణం తాలూకు రా ఫీలింగ్ విసుగు రాకుండా చేసింది. మూడో భాగానికి కావాల్సిన ఎగ్జైట్ మెంట్ అయితే కలిగించలేకపోయారు

నటీనటులు

సత్యం రాజేష్ యథావిధిగా కొమిరిగా జీవించేశాడు. ఇంటర్వెల్ లో మంత్రాలు చదివేటప్పుడు అసలైన ఆర్టిస్టుని చూడొచ్చు. గెటప్ శీనును ఎక్కువగా వాడుకోలేదు. పొలిమేర 3 కోసం బాలాదిత్యని సైడ్ లైన్ చేసి కేవలం రెండు సీన్లతో సరిపెట్టేశారు. రాకేందు మౌళి మొదట్లో కొంత హడావిడి చేయడం తప్పించి తర్వాత పక్కకెళ్ళిపోయాడు. రవివర్మ చేయడానికి పెద్దగా ఏం లేకపోయింది. కామాక్షి భాస్కర్లకు చివరి అరగంట బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇవ్వడానికి ఛాన్స్ దక్కింది. వాడుకుంది కూడా. సాహితి, రమ్యలు జస్ట్ ఓకే. ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ లో క్యాస్టింగ్ సరిగా కుదరలేదు. నటన పరంగా హైలైట్ అయ్యేది ముగ్గురే కాబట్టి ఇంకెవరి ప్రస్తావన పెద్దగా అవసరం లేదు

సాంకేతిక వర్గం

గ్యానీ నేపధ్య సంగీతం మా ఊరి పొలిమేర 2కి ప్రధాన బలం. చాలా చోట్ల తన స్కోర్ తో నిలబెట్టేశాడు. మరీ జిబ్రాన్, తమన్ రేంజ్ అని చెప్పలేం కానీ కుర్రాడిలో టాలెంట్ ఉన్న విషయం ఈ విభాగం మీద పట్టున్న వాళ్లకు అర్థమవుతుంది. కుషేన్దర్ రమేష్ రెడ్డి ఛాయాగ్రహణంలో మాత్రం హెచ్చు తగ్గులున్నాయి. ముఖ్యంగా నైట్ ఎపిసోడ్లో లైటింగ్ తో మొదలుపెట్టి డిఐ దాకా పొరపాట్లు కనిపిస్తాయి. డీసెంటని చెప్పొచ్చు అంతే. శ్రీవర ఎడిటింగ్ కొంత రిపీట్ ట్రాక్స్ ని తగ్గించాల్సింది. ఉపేంద్ర రెడ్డి ఆర్ట్ వర్క్ పర్వాలేదు. కాస్త బడ్జెట్ పెంచి ఉంటే క్వాలిటీ ఇంకా మెరుగయ్యేదేమో. నిర్మాణ విలువలు మరీ ఘనంగా అయితే లేవు. రాజీపడిన దాఖలాలు పుష్కలం

ప్లస్ పాయింట్స్

బ్యాక్ గ్రౌండ్ స్కోర్
రెండు మూడు ట్విస్టులు
విపరీత హారర్ లేకపోవడం

మైనస్ పాయింట్స్

రిపీట్ అనిపించే గతాలు
గుడి బ్యాక్ డ్రాప్
మలుపులు ఎక్కువైపోవడం
సీక్వెల్స్ కోసం ఆరాటం

ఫినిషింగ్ టచ్ : ట్విస్టులు ఎక్కువ థ్రిల్స్ తక్కువ

రేటింగ్ : 2.25 / 5