Movie Reviews

సమీక్ష – రూల్స్ రంజన్

అందం, టాలెంట్ రెండూ ఉన్న యూత్ హీరోల్లో కిరణ్ అబ్బవరంకు మంచి గుర్తింపే ఉంది. ఎస్ఆర్ కళ్యాణ మండపంతో మంచి విజయం అందుకోవడం మార్కెట్ ని పెంచేసింది. ఆ తర్వాత కథల ఎంపికలో చేసిన తడబాటు మళ్ళీ అదే స్థాయి సక్సెస్ ని చూడనివ్వలేదు. మధ్యలో ఒకటి రెండు ఓ మోస్తరుగా ఆడినా మీటర్ వల్ల చాలా డ్యామేజ్ జరిగింది. అయినా రూల్స్ రంజన్ మీద నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ వచ్చిన కిరణ్ దగ్గరుండి మరీ ప్రమోషన్లు చూసుకున్నాడు. కామెడీ కోసమే రండని పదే పదే చెప్పిన కుర్ర హీరో మాట నిలబడిందా

కథ

ఇంజనీరింగ్ అయ్యాక తిరుపతి నుంచి ముంబైకి సాఫ్ట్ వేర్ ఉద్యోగం కోసం వెళ్తాడు మనోరంజన్(కిరణ్ అబ్బవరం). తక్కువ టైంలో తన క్రమశిక్షణతో పెద్ద స్థాయికి చేరుకుని ఆఫీస్ స్టాఫ్ ని రూల్స్ తో కంట్రోల్ చేస్తుంటాడు. నాలుగు సంవత్సరాల తర్వాత కాలేజీలో ఇష్టపడి ప్రేమించలేకపోయిన సనా(నేహా శెట్టి)ని చూసి ఆమెకు ఒక రోజంతా సిటీ చూపించి ఊరికి పంపిస్తాడు. అయితే ఫోన్ నెంబర్ తీసుకోవడం మర్చిపోయి సనాను వెతుక్కుంటూ తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. ఫ్రెండ్ స్వప్న(మెహర్ చాహల్)సహాయం కోరతాడు. ఈలోగా స్టోరీలో బోలెడు మలుపులు వచ్చేస్తాయి.

విశ్లేషణ

ఆషామాషీ కామెడీకి థియేటర్ జనాలు నవ్వే రోజులు పోయాయి. ఆన్లైన్లో బోలెడు హాస్యం ఉచితంగా దొరుకుతున్నప్పుడు టికెట్ కొని మరీ మన కంటెంట్ కోసం రావాలంటే చాలా కసరత్తు జరగాలి. దర్శకుడు రత్నం కృష్ణ ఈ విషయంలో అప్డేట్ కాలేదని సినిమా మొదలైన కొద్ది నిమిషాలకే అర్థమైపోతుంది. కఠినంగా రూల్స్ ని పాటించే ఒక కుర్రాడు మొత్తం ఆఫీస్ ని తన చెప్పుచేతల్లో పెట్టుకునే స్థాయిలో గడగడలాడించాడంటే దానికి సంబంధించిన క్యారెక్టర్ డెవలప్ మెంట్ చాలా బలంగా ఉండాలి. అదేమీ లేకుండా కేవలం ఒక వైరస్ బగ్ ని పట్టించినంత మాత్రం అతని పై పెత్తనం చెలాయించే మేనేజర్ సైతం జీ హుజూర్ అనడం ఏ కార్పొరేట్ కంపనీలోనూ ఉండదు.

ఇలా టేకాఫ్ నే లోపాలతో మొదలుపెట్టిన రత్నం కృష్ణ ముంబై ఎపిసోడ్ మొత్తాన్ని చప్పగా నడిపించి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడతాడు. అసలు అంత సీరియస్ మొహం పెట్టుకుని రంజన్ సాధించిందేమిటో ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్థం కాదు. ముందు అమాయకంగా చూపించి తర్వాత కఠినంగా మారిపోయే ట్రాన్స్ ఫర్మేషన్ ఏ మాత్రం కన్విన్సింగ్ గా అనిపించదు సరికదా పైపెచ్చు చిరాకు పుడుతుంది. కామేష్ గా రోజుకో అమ్మాయితో గడిపే వెన్నెల కిషోర్ ఎంట్రీ తర్వాత కాసిన్ని నవ్వులు ఆశిస్తాం. అది కూడా గ్రౌండ్ లెవెల్ రైటింగ్ తో మరీ బేలగా మారిపోయింది. తనకు కిరణ్ కు మధ్య సంభాషణలు పేలవంగా ఉండి దిక్కులు చూసేలా చేస్తాయి.

అరగంట తర్వాత హీరోయిన్ నేహా శెట్టిని ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీతో పరిచయం చేసిన రత్నం కృష్ణ పోనీ ఆ ఎపిసోడ్ అయినా ఇంటరెస్టింగ్ గా మలచి ఉంటే కొంత డైవర్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉండేది. ఒక పాట పెట్టి ఆ తర్వాత ఆమె రంజన్ కు దూరమయ్యేందుకు ఎలాంటి కారణం చూపించకుండానే ముగించడం పండలేదు. దాని తర్వాత సనా ముంబైకు రావడం, తోడుగా రంజన్ సిటీ మొత్తం తిప్పి చూపించి, ఫ్లాట్ కు తీసుకొచ్చి ఆమెతో పాటు ఒకే మంచం మీద పడుకోబెట్టడం ఇవన్నీ సీరియల్ తరహాలో పేర్చుకుంటూ పోయారు తప్పించి చూసేవాళ్ళు ఒప్పుకునేలా ప్రాపర్ నెరేషన్ లేకపోయింది. అడపాదడపా ఎమోషన్లు పెట్టినా బాగుండేది కానీ అవి పూర్తిగా సున్నా.

ఇలా రంజన్ ఇంటికి తిరిగి వచ్చాక జరిగే ప్రహసనం మరో ఎత్తు. స్నేహితుడు క్లాస్ మేట్ ని ప్రేమించాడని తెలుసుకుని దాన్ని బ్రేకప్ చేయాలని తాపత్రయపడే హైపర్ ఆది-హర్ష చెముడు-సుదర్శన్ ల ఫ్రెండ్ ఎపిసోడ్ మొత్తం మిస్ ఫైర్ అయ్యింది. దీనికి తోడు అదనంగా ఒక బార్ సాంగ్ పెట్టి ఇంకాస్త నీరసం జోడించారు. సనా కోసం వచ్చిన రంజన్ ఆమె అన్నయ్య ఎవరో తెలిసి కూడా ప్రియురాలిని కలుసుకోవాలని వేసే ఎత్తుగడలు మరీ సిల్లీగా అనిపిస్తాయి. కథని విస్తరించే మార్గం తెలియక అవసరం లేకపోయినా సెకండ్ హీరోయిన్ ఎంట్రీ చేయించి, అజయ్ రూపంలో బలవంతపు స్నేహితుడి ఎంట్రీ ఇప్పించి ఏదో అనుకుని ఇంకేదో ఖంగాళీ చేయించారు.

రీ యూనియన్ ఐడియా, ఫుల్లుగా మందు కొడితేనే సనాకు దగ్గరవ్వొచ్చని కామేష్ ఇచ్చిన మహోన్నత ఆలోచనని రంజన్ అమలు పరచడం ఇలా సెకండ్ హాఫ్ ఎటు తిరిగి ఎక్కడికి వెళ్తుందో అంతు చిక్కనంత గందరగోళంగా సాగుతుంది. చివరికి ఛార్ట్ బస్టర్ అయిన చూసేయ్ చూసేయ్ పాట ప్లేస్ మెంట్ కూడా తేడా కొట్టడం ముమ్మాటికీ దర్శకుడి తప్పే. సనా ఫ్యామిలీ, రంజన్ కుటుంబం మధ్య ఏదో వెంకటేష్ తరుణ్ సినిమాల రేంజ్ లో కన్ఫ్యూజన్ డ్రామా క్రియేట్ చేయబోయిన రత్నం కృష్ణ చేసి చివరికి తానే ఆ అయోమయంలో ఇరుక్కుపోయి నలిగిపోయాడు. అక్కడక్కడా కాసిన్ని జోకులు తప్పించి ఎంటర్ టైన్మెంట్ పరంగా మెప్పించలేదన్నది వాస్తవం.

నటీనటులు

ఇకపై కిరణ్ అబ్బవరం ఇంకా సీరియస్ గా తన స్క్రిప్ట్ సెలక్షన్ ని వడబోత చేసుకోవాల్సి ఉంటుంది. సీరియస్ గా కనిపించడం నటన కాదని వేరియేషన్లు డిమాండ్ చేసే పాత్రలు కథలు ఎంచుకుంటే కెరీర్ వేగమందుకుంటుందని గుర్తించాలి. నటన బ్యాడ్ అని చెప్పడం లేదు కానీ తనను తాను మెరుగుపరుచుకునే అవకాశం కల్పించుకోవడం లేదు. నేహా శెట్టి ఓకే. సనాగా ఒదిగిపోయింది. మెహర్ చాహల్ అందం తప్ప అభినయం శూన్యం. బాలీవుడ్ సీనియర్ నటుడు అను కపూర్ ని వృథా చేసుకున్నారు. వెన్నెల కిషోర్, గోపరాజు రమణ, అభిమన్యు సింగ్, అజయ్, సుబ్బరాజు, హైపర్ ఆది, మకరంద్ దేశ్ పాండే తదితరులు ఎవరివీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పాత్రలు కాదు.

సాంకేతిక వర్గం

సంగీత దర్శకుడు అమ్రిష్ ఏ మాత్రం ఆకట్టుకోలేదు. చూసేయ్ చూసేయ్ పాట ఎంత బాగున్నప్పటికీ అది కూడా కొత్తగా కంపోజ్ చేసిన ట్యూన్ కాదు కాబట్టి గొప్పగా అనలేం. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అంతంతమాత్రంగానే ఇచ్చాడు. మిగిలిన సాంగ్స్ గురించి చెప్పాల్సిన పని లేకపోయింది. దులిప్ కుమార్ ఏంఎస్ చాయాగ్రహణం గురించి ప్రత్యేకంగా చెప్పడానికేం లేదు. వర్క్ డీసెంట్ గా అనిపించింది. ఎడిటింగ్ లో ల్యాగ్ ఎక్కువయ్యింది. ట్రిమ్ చేసే ఛాన్స్ ఉన్నా ఉపయోగించుకోలేదు. కొరియోగ్రఫీ, ఫైట్స్ జస్ట్ ఓకే. ఏఎం రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ ముంబై షెడ్యూల్ తప్ప ఎక్కువగా ఖర్చు పెట్టకుండా చుట్టేయడం స్క్రీన్ మీద కనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్

కాసిన్ని జోకులు

మైనస్ పాయింట్స్

క్యారెక్టరైజేషన్ లోపాలు
నవ్వించని కామెడీ
ముంబై ఎపిసోడ్
సంగీతం

ఫినిషింగ్ టచ్ : రుచి లేని రంజన్

రేటింగ్ : 1.5 / 5

This post was last modified on October 6, 2023 10:06 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అదానీ-జగన్ లింకుపై చంద్రబాబు ఫస్ట్ రియాక్షన్

సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…

1 min ago

ఈవన్నీ చేస్తే AP టూరిజంకు తిరుగుండదు

జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…

2 hours ago

రేవంత్ రెడ్డి.. అదానీ ఒప్పందాలు రద్దు చేస్తారా?

అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…

3 hours ago

మంచు విష్ణు అసలు ప్లానింగ్ ఇదా

మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…

4 hours ago

సాక్షి మీడియా నన్ను కవర్ చేయదు…షర్మిల సెటైర్లు

మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…

4 hours ago