1.75/5
2 Hr 38 Mins | Thriller | 28-09-2023
Cast - Raghava Lawrence, Kangana Ranaut, Vadivelu, Radhika Sarathkumar, Lakshmi Menon, Rao Ramesh and others
Director - P. Vasu
Producer - Subhaskaran
Banner - Lyca Productions
Music - M.M. Keeravani
ఎప్పుడో పద్దెనిమిదేళ్ల క్రితం వచ్చిన చంద్రముఖి హారర్ కామెడీ జానర్లో ఒక కొత్త బెంచ్ మార్క్ సృష్టించింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఎన్ని సినిమాలు వచ్చాయో లెక్క బెట్టడం కష్టం. రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ తో దెయ్యం కథను చూపిస్తే జనం ఆదరిస్తారని దర్శకుడు పి వాసు ఋజువు చేయడం, అది ఏకంగా ఇండస్ట్రీ రికార్డులు సాధించడం ఒక చరిత్ర. అందుకే ఇన్ని సంవత్సరాల తర్వాత లారెన్స్ హీరోగా సీక్వెల్ చంద్రముఖి 2 ప్రకటించగానే ఆడియన్స్ లో ఆసక్తి రేగింది. ఇంతకీ ఆ మేజిక్ మళ్ళీ రిపీట్ అయ్యిందా లేదా
కథ
రంగనాయకి(రాధిక శరత్ కుమార్)కుటుంబంలో చెలరేగిన కలతలకు కులదైవం గుడిని పట్టించుకోకపోవడమే కారణమని ఓ బాబా చెప్పడంతో ఫ్యామిలీ మొత్తం చంద్రముఖి కొలువున్న ప్యాలెస్ కు చేరుకుంటుంది. ఎప్పుడో దూరంగా వెళ్ళిపోయిన పెద్దావిడ మనవళ్లతో పాటు గార్డియన్ మదన్(లారెన్స్)అక్కడికి వస్తాడు. దక్షిణం వైపున్న గదిని వాళ్లలో ఒకరు తెరవడంతో చంద్రముఖి(కంగనా రౌనత్) బయటికి వచ్చి ఆవహించడం మొదలుపెడుతుంది. దాన్ని వదిలించే బాధ్యత మదన్ మీద పడుతుంది. ఆ తర్వాత జరిగేదే స్టోరీ.
విశ్లేషణ
కోట్లాది అభిమానులున్న ఒక స్టార్ హీరోతో దెయ్యం సినిమా చేయడం, అది గొప్ప ప్రయోగంగా నిలవడం ఒక్క చంద్రముఖి విషయంలోనే జరిగింది. అలాని ఇది దర్శకులు పి వాసు ఒరిజినల్ ఐడియా కాదు . 1993లో వచ్చిన ఫాజిల్ మణిచిత్రతజుని రీమేక్ చేసి గొప్ప విజయం అందుకున్నారు. ఒరిజినల్ వెర్షన్ లో లేని కామెడీ టచ్ ని జోడించి అద్భుత ఫలితాన్ని అందుకున్నారు. దీంతో ఆయన దశాబ్దంన్నర దాటినా అదే హ్యాంగోవర్ ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయం. ఒకే కథని పదే పదే తీయడం వల్ల ఆడియన్స్ ఎగ్జైట్ అవుతారని ఎలా అనుకుంటున్నారో అంతు చిక్కని విషయం. కనీసం మెయిన్ ట్విస్టులైనా మార్చాలి కదా. అది కూడా జరగకపోవడమే మైనస్.
ఆ మధ్య వెంకటేష్ తో నాగవల్లిని తీస్తేనే ప్రేక్షకులు ఒప్పుకోలేదు. కారణం క్లైమాక్స్ తప్ప మిగిలినదంతా మక్కికి మక్కి ఫస్ట్ పార్ట్ లాగా ఉండటమే. అనుష్క లాంటి హీరోయిన్ కుదిరినా ప్రయోజనం లేకపోయింది. అలా ఎందుకు జరిగిందని పి వాసు విశ్లేషించుకుని ఉంటే చంద్రముఖి 2 ఇంత పేలవంగా వచ్చేది కాదు. అంతఃపురం బంగాళా రూములో చంద్రముఖి ఆత్మ దాక్కోవడం, దాని వెనుక దుర్మార్గుడైన రాజు ఉండటం, వాడి మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం ఆమె ఆ గదిలోనే దాక్కుని అవకాశం కోసం చూడటం ఇదంతా మళ్ళీ రిపీట్ అయ్యింది. రజని ప్లేసులో లారెన్స్, జ్యోతిక స్థానంలో కంగనా రౌనత్ తో పాటు లక్ష్మి మీనన్ రావడమొకటే చేంజ్.
టైటిల్ కార్డు అయిపోయాక రాధికా గ్యాంగ్ బిల్డింగులో అడుగు పెట్టడం ఆలస్యం ప్రతి ఫ్రేమ్ లో ఏ మాత్రం కొత్తదనం కనిపించకుండా వాసు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆఖరికి వడివేలు జోకులు కూడా అవుట్ డేటెడ్ అనిపిస్తాయి. లారెన్స్ ఇంట్రో మరీ ఎన్టీఆర్ కాలానికి వెళ్లి రాసినట్టు నవ్వొచ్చేలా ఉంది. సరే ఇదంతా ఎలా ఉన్నా చంద్రముఖి గతం ఏదైనా విభిన్నంగా ఉంటుందేమోనని ఆశిస్తాం. కానీ అక్కడా నిరాశే ఎదురవుతుంది. వేటయ్య రాజా కామవాంఛ, ఇష్టపడిన యువతి ఒక నృత్యకారుడి మీద మనసు పడటం, అతని తల తీసి ఆమెను సజీవ దహనం చేయడం ఇదంతా రిపీట్ మోడ్ లో సాగిందే తప్ప ఫ్రెష్ నెస్ అనేది మచ్చుకు కూడా కనిపించదు.
ఒకవేళ చంద్రముఖి ఎప్పుడో ముప్పై నలభై ఏళ్ళ క్రితం తీసి ఉంటే ఇప్పుడు రీమేక్ చేసినా ప్రయోజనం ఉంటుంది. 5జి జనరేషన్ లో టీనేజ్ సైతం రజనీకాంత్ వెర్షన్ ని టీవీలో, యూట్యూబ్ లో వందలసార్లు చూసేశారు. ఈ ప్రాధమిక వాస్తవాన్ని విస్మరించి తిప్పి తిప్పి ఒకే కథని చెప్పాలనుకుంటే జనం అంత తేలికగా మోసపోరు. మరి అంత అనుభవమున్న వాసు గారు ఇంత వెనుకబడి ఆలోచించడం విచిత్రమే. టేకింగ్ పరంగానూ ఎలాంటి మెరుపులు లేవు. టెంప్లేట్ ఒకటే అయినప్పుడు పెద్దగా రిస్క్ ఉండదు. లకలక డైలాగుతో సహా దేన్నీ వదల్లేదు. ఒకవేళ పాటల మద్దతు బలంగా ఉంటే కొంత హెల్ప్ అయ్యేది కానీ కీరవాణి సైతం నిస్సహాయులుగా మిగిలారు.
ప్రతిదీ కొత్తగా ఉండాలన్నా రూల్ లేదు. కానీ పాత కథ తీసుకున్నా దాన్ని కొత్తగా చెప్పడం ఇప్పటి సక్సెస్ ఫార్ములా. లోకేష్ కనగరాజ్, నెల్సన్ దిలీప్ లాంటి దుడుకు రక్తాల మధ్య నెగ్గుకురావాలంటే వాసు లాంటి అనుభజ్ఞులు అప్డేట్ కావాలి. ఒకవేళ తమిళ పబ్లిక్ చంద్రముఖి 2ని రిసీవ్ చేసుకోవచ్చేమో కానీ తెలుగులో పెద్దగా వర్కౌట్ కావడం కష్టమే. ఒకవేళ రజని వెర్షన్ చూడని బ్యాచ్ కొంత మేర తట్టుకున్నా మిగిలినవాళ్ళు మాత్రం ఈ ప్రహసనం భరించలేరు. భవిష్యత్తులో చంద్రముఖి 3 తీసినా కించిత్ కూడా కొత్తగా ఉండదని ముందే ఫిక్సయిపోతారు. అసలు దీనికి బదులు చంద్రముఖినే 4Kలో రీమాస్టర్ చేసి రీ రిలీజ్ చేసి ఉంటే ఖచ్చితంగా ఆడేది. నో డౌట్.
నటీనటులు
లారెన్స్ కు ఇదేమీ ఛాలెంజింగ్ క్యారెక్టర్ కాదు. మదన్, వేటయ్య రాజాగా రెండు పాత్రలను అలవోకగా చేసుకుంటూ పోయాడు. కంగనా రౌనత్ సెకండ్ హాఫ్ ఎంట్రీ ఇచ్చాక మంచి స్కోప్ దక్కింది కానీ జ్యోతికను మరిపించడం కానీ, దాటేయడం కానీ జరగలేదు. లక్ష్మి మీనన్ ఉన్నంతలో ఓకే. వడివేలుది జస్ట్ కొనసాగింపు. రావు రమేష్ విగ్గు నప్పకపోవడంతో ఆ పాత్ర తాలూకు డెప్త్ ని అంతగా ఫీల్ కాలేం. గంభీరమైన సలహాలు ఇవ్వడానికి పరిమితం చేశారు. రాధిక, విఘ్నేష్, సురేష్ మీనన్, మహిమ, సృష్టి, మిథున్ శ్యామ్, రవి మారియా, సుభిక్ష, కూల్ సురేష్, మానస్వి ఇలా పెద్ద గ్యాంగ్ ఉంది. కొన్ని నెలల క్రితం చనిపోయిన మనోబాల ఓ సీన్లో మెరుస్తారు.
సాంకేతిక వర్గం
ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి చంద్రముఖి 2కి ఎలాంటి మాయాజాలం చేయలేకపోయారు. పాటలు వీక్ గా ఉన్నాయి. మొదటి భాగంకి విద్యాసాగర్ ఇచ్చినంత బలం ఈసారి కుదరలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పర్వాలేదనిపిస్తుందే తప్ప గొప్పగా లేదు. ఆర్డి రాజశేఖర్ ఛాయాగ్రహణంలో నాణ్యత ఉంది. పరిమిత లొకేషన్లే కాబట్టి ఆయన పనితనం మరీ ఎలివేట్ అయ్యే స్థాయిలో ఛాన్స్ దక్కలేదు. ఆంటోనీ ఎడిటింగ్ నిడివికి బాధ్యత వహించాలి. చెప్పుకోదగ్గ ల్యాగ్ ఉంది. తోట తరణి ఆర్ట్ వర్క్ పాత ఫీల్ ని మళ్ళీ కలిగించింది. వందల కోట్లు ఖర్చు పెట్టే సబ్జెక్టు కాకపోవడంతో లైకాకు రిస్క్ ఏమీ లేదు. ఉన్నంతలో డీసెంట్ గా పని కానిచ్చేశారు
ప్లస్ పాయింట్స్
ఆర్టిస్టుల నటన
మైనస్ పాయింట్స్
అదే పాత కథ
సంగీతం
విపరీత సాగతీత
చప్పగా సాగే ట్విస్టులు
ఫినిషింగ్ టచ్ : బాబోయ్ దెయ్యం
రేటింగ్ : 1.75/ 5