కెరీర్ మొదలుపెట్టిన తొలినాళ్లలోనే పందెం కోడి లాంటి సూపర్ హిట్లతో తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న హీరో విశాల్. ఆ తర్వాత అడపాదడపా హిట్లు ఉన్నప్పటికీ ఎంపికలో చేసిన పొరపాట్ల వల్ల సంవత్సరాల తరబడి సక్సెస్ కి దూరంగా ఉండిపోయాడు. అభిమన్యుడు కొంత ఊరటనిచ్చి ట్రాక్ లోకి తెచ్చినా తిరిగి ఫ్లాపులు పలకరించడం మొదలుపెట్టాయి. ఇదంతా ఎలా ఉన్నా తన మీద మాస్ లో ఉన్న సాఫ్ట్ కార్నర్ మార్క్ ఆంటోనీ ట్రైలర్ చూశాక కాసిన్ని అంచనాలు రేపింది. మరి అవి నిలబెట్టుకునేలా ఉందా.
కథ
ఇది రెండు కాలాల్లో జరుగుతుంది. 1975లో పరమ దుర్మార్గుడిగా పేరు మోసిన రౌడీ ఆంటోనీ(విశాల్) శత్రువు ఏకాంబరం(సునీల్) చేతిలో హత్య చేయబడతాడు. ప్రాణ స్నేహితుడు జాకీ(ఎస్జె సూర్య)బ్రతికిపోయి ఆ సామ్రాజ్యాన్ని చేజిక్కించుకుంటాడు. ఇరవై సంవత్సరాల తర్వాత 1995లో ఆంటోనీ కొడుకు మార్క్(విశాల్) మెకానిక్ షెడ్డు పెట్టుకుని గొడవలకు దూరంగా బ్రతుకుతూ ఉంటాడు. జాకీ కొడుకు మదన్(ఎస్జె సూర్య)తండ్రి బుద్దులతోనే పెరుగుతాడు.వీళ్ళందరూ ఒక టైం మెషీన్ ద్వారా ఫోన్ లో మాట్లాడుకుని గతాన్ని మార్చుకునే అనూహ్యమైన పరిస్థితుల్లో చిక్కుకుంటారు. అసలు అది కనిపెట్టింది ఎవరు, వీళ్ళ జీవితాలు ఎలా మారిపోయాయనేది అసలు స్టోరీ
విశ్లేషణ
హాలీవుడ్ మూవీ బ్యాక్ టు ది ఫ్యూచర్ తో మొదలుపెట్టి ఇప్పటిదాకా టైం ట్రావెల్ కాన్సెప్ట్ మీద చాలా సినిమాలొచ్చాయి. మనకు బాగా గుర్తుండిపోయిన ఆదిత్య 369 లాంటివి ఇప్పటికీ క్లాసిక్స్ గా చెప్పుకుంటాం. గత ఏడాది శర్వానంద్ ఒకే ఒక జీవితం అన్ని వర్గాలను మెప్పించింది. అయితే ఇవన్నీ మాస్ ఫార్ములాకు దూరంగా ఒక ఎక్స్ పెరిమెంట్స్ గా వచ్చి మెప్పించినవి. మార్క్ ఆంటోనీ దర్శకుడు అధిక్ రవిచంద్రన్ దీనికి గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ వెరైటీగా ఉంటుందని భావించి ఈ సబ్జెక్టు రాసుకున్నట్టు మొదలైన కొన్ని నిమిషాలకే అర్థమైపోతుంది. ఎక్కువ సాగదీయకుండా నేరుగా నెరేషన్ లోకి వెళ్ళిపోయి మొదటి పావు గంటలోనే ట్విస్టులు మొదలుపెడతాడు.
పాత్రల పరిచయాలు, వాటి మధ్య సంబంధాలు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చూసుకున్న రవిచంద్రన్ కంటెంట్ లో క్వాలిటీ కన్నా క్యారెక్టర్ల మధ్య హడావిడి మీదే ఎక్కువ ఆధారపడ్డాడు. ఆంటోనీని ముందు చెడ్డవాడిగా ఎస్టాబ్లిష్ చేసి అతని అసలు రూపం అది కాదని, కొడుకు ద్వేషించేంత దుర్మార్గుడు కాదని చెప్పడంలో తడబడ్డాడు. ఇలాంటి పొరపాట్ల వల్ల గ్రాఫ్ అటుఇటు అయినప్పటికీ ఏదో ఎలివేషన్ల వల్ల మరీ విసుగు రాకుండా గడిచిపోతుంది. ఇంత సీరియస్ డ్రామాలోనూ ఎంటర్ టైన్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నించడం ఒకరకంగా చాలా ప్లస్ అయ్యింది. ముఖ్యంగా జాకీగా ఎస్జె సూర్యని ప్రెజెంట్ చేసిన తీరు, అతను పండించిన విధానం హైలైటయ్యాయి.
ఇంటర్వెల్ దాకా మ్యాటర్ పెద్దగా లేకపోయినా ఓ మోస్తరు టైం పాస్ చేయించడంలో రవిచందర్ ఫెయిల్ కాలేదు. రెండో సగం మొదలయ్యాక వస్తుంది అసలు సమస్య. టెలిఫోన్ వాడుకుని హీరో విలన్ ఇద్దరూ గతాన్ని మార్చి తమ వాళ్ళను బ్రతికించుకునే తాపత్రయం రిపీట్ అనిపించే స్క్రీన్ ప్లేతో విషయం లేకుండా సాగిపోయింది. గ్రాండియర్ నెస్ తో పాటు ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ ఈ లోపాన్ని కాపాడుకుంటూ వచ్చినా ఒకదశ దాటాక ఎగ్జైట్ అయ్యేంత మ్యాటర్ లేక బోర్ కొట్టడం మొదలవుతుంది. ఆంటోనీ బ్రతికి వస్తాడని ట్రైలర్ లోనే చూపించేశారు కాబట్టి అతని ఎంట్రీ ప్రీ క్లైమాక్స్ దాకా దాచిపెట్టి ఫ్లాష్ బ్యాక్ దాకా నెట్టుకుంటూ వచ్చారు.
మాములుగానే ఈ టైం ట్రావెల్ కాన్సెప్ట్స్ కొంత కన్ఫ్యుజింగ్ గా ఉంటాయి. మానాడు మనదగ్గర రాలేదు కానీ ఒకరకంగా చెప్పాలంటే మార్క్ ఆంటోనీ కూడా అదే టెంప్లేట్ లోనే సాగింది. కాకపోతే కామెడీగా నడిపించాలని చూశారు. ఆంటోనీ, జాకీల మీద పూర్తి దృష్టి పెట్టిన రవిచందర్ అంతే మోతాదులో ఏకాంబరంని మలుపుల కోసం వాడుకునే ఛాన్స్ ఉన్నా ఆ దిశగా ఆలోచించలేదు. ఎంతసేపూ విశాల్, సూర్యలు డబుల్ రోల్ లో పదే పదే కనిపించడంతో ఇంకెవరికీ స్క్రీన్ స్పేస్ దక్కకుండా పోయింది. డబుల్ డెక్కర్ బస్సు ఛేజ్, నాన్నకు రోజు ఫోన్ చేసి జాకీ క్లాసులు పీకే ఎపిసోడ్ డ్యామేజ్ ఎక్కువ జరగకుండా కాపాడాయి కానీ బాగుందని చెప్పడానికవి సరిపోలేదు.
కంటెంట్ లో మంచి స్కోప్ ఉన్నప్పటికీ డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ దాన్ని పూర్తి స్థాయిలో వాడుకోకపోవడంతో హాస్యం గందరగోళం మధ్య మార్క్ ఆంటోనీ నలిగిపోయాడు. ఇలాంటి వాటిలో లాజిక్స్ అక్కర్లేదు. ప్రేక్షకులు వెతకకూడదని ప్రిపేరయ్యే వస్తారు. కానీ మేజిక్ జరగాలి. అది ఆంటోనీలో పూర్తి స్థాయిలో లేదు. వైవిధ్యం ఉన్నప్పటికీ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసే అంశాలను సరిగా కూర్చుకోలేకపోవడంతో మసాలా సరిపోని బిర్యానీలా మిగిలిపోయింది. క్రియేటివ్ గా ఆలోచించడం మంచిదే కానీ దానికి సరైన క్యాలికులేషన్ కూడా ఉండాలి. కానీ ఈ కామెడీ కం యాక్షన్ డాన్ లెక్కలు వేసుకోవడంతో తడబడి పూర్తి సంతృప్తినివ్వలేదు
నటీనటులు
విశాల్ రకరకాల గెటప్స్ లో రెండు షేడ్స్ ఉన్న మార్క్ ఆంటోనీగా బాగానే చేశాడు. గెడ్డంతో గెటప్ బాగుంది. తనకన్నా ఎక్కువ చెలరేగింది మాత్రం ఎస్జె సూర్యనే. అరుస్తూ నటించినా సరే తన టైమింగ్ తో చాలా చప్పగా సాగే కొన్ని సీన్లను నిలబెట్టేశాడు. తనలో ఎంత మంచి పెర్ఫార్మర్ ఉన్నాడో మరోసారి అర్థమవుతుంది. హీరోయిన్ రీతూ వర్మ మొక్కుబడిగా ఉంది. స్కోప్ దక్కలేదు. మరో అమ్మాయి అభినయ అభినయం ఓకే. సునీల్ కెపాసిటీని పూర్తిగా వాడుకోలేకపోయారు. గేగా సీనియర్ నటులు వైజి మహేంద్రన్ నప్పలేదు. రాంగ్ ఛాయస్. లీడ్ యాక్టర్సే హాస్యాన్ని పండించడంతో కింగ్స్ లే లాంటి వాళ్ళు మొక్కుబడిగా మిగిలిపోయారు
సాంకేతిక వర్గం
జివి ప్రకాష్ కుమార్ అప్పటి వాతావరణానికి అనుగుణంగా నేపధ్య సంగీతాన్ని ఇవ్వడానికి ప్రయత్నించడం బాగుంది. రెట్రో కంపోజింగ్ డిఫరెంట్ ఫీల్ ఇస్తుంది. అయితే ఒక దశ దాటాక అదీ రిపీట్ అయిపోతుంది. పాటలు ఎక్కువ లేకపోవడం రిలీఫ్. ఉన్న రెండు కూడా సౌండ్ తప్ప చెప్పుకోదగ్గవి కాదు. అభినందం రామానుజం ఛాయాగ్రహణంలో ప్రొడక్షన్ వేల్యూస్ బాగా కనిపించాయి. టోన్ సెట్టింగ్, ఫ్రేమ్ వర్క్ చక్కగా చూపించారు. విజయ్ మురుగన్ ఆర్ట్ వర్క్ ని మెచ్చుకోవచ్చు. పరిమిత బడ్జెట్ లోనే ఇంటీరియర్స్ బాగున్నాయి. విజయ్ వేలుకుట్టి ఎడిటింగ్ లో కాస్త షార్ప్ నెస్ ఉంటే ల్యాగ్ తగ్గేది. బడ్జెట్ పరంగా నిర్మాత వినోద్ కుమార్ బాగానే ఖర్చు పెట్టారు.
ప్లస్ పాయింట్స్
SJ సూర్య నటన
విశాల్ పాత్ర
ఫస్ట్ హాఫ్
కొంత కామెడీ
మైనస్ పాయింట్స్
రిపీట్ అనిపించే స్క్రీన్ ప్లే
రెండో సగం ఎపిసోడ్లు
పాటలు
సెకండ్ హాఫ్
ఫినిషింగ్ టచ్ : కన్ఫ్యుజింగ్ మార్క్
రేటింగ్ : 2.5 / 5
This post was last modified on September 15, 2023 8:36 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…