సమీక్ష – జవాన్

2.75/5

2 Hr 47 Mins   |   Action   |   07-09-2023


Cast - Shah Rukh Khan, Nayanthara, Vijay Sethupathi, Deepika Padukone, Priyamani, Sanya Malhotra, Ridhi Dogra and others

Director - Atlee

Producer - Gauri Khan Banner

Banner - Red Chillies Entertainment

Music - Anirudh Ravichander

వరస ఫ్లాపుల తర్వాత సుదీర్ఘమైన గ్యాప్ తీసుకుని కంబ్యాక్ రూపంలో పఠాన్ తో అదిరిపోయే బ్లాక్ బస్టర్ అందుకున్న షారుఖ్ ఖాన్ తిరిగి ఇదే ఏడాదిలో జవాన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎప్పుడూ లేనిది దక్షిణాది రాష్ట్రాల్లోనూ దీనికి భారీ అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం చూసి ట్రేడ్ షాక్ అయ్యింది. నయనతార, విజయ్ సేతుపతి, దీపికా పదుకునే లాంటి క్రేజీ క్యాస్టింగ్ తో పాటు అనిరుద్ రవిచందర్ సంగీతం లాంటి ఎన్నో ఆకర్షణలతో వచ్చిన ఈ విజువల్ గ్రాండియర్ ఇంత హైప్ ని నిలబెట్టుకునేలా మెప్పించిందా లేదా

కథ

వేలాది మహిళా ఖైదీలుండే కారాగారానికి జైలర్ ఆజాద్(షారుఖ్ ఖాన్). అసాంఘిక శక్తిగా మారిన కాళీ గైక్వాడ్(విజయ్ సేతుపతి) ని కట్టడి చేయడానికి ఒక లేడీ గ్యాంగుని తయారు చేసుకుని కిడ్నాపులతో వేల కోట్ల రూపాయలు ప్రజలకు పంచడం మొదలుపెడతాడు. కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి పూనుకుంటుంది నర్మద(నయనతార).అయితే ఎప్పుడో పాతికేళ్ల క్రితం అందరూ చనిపోయాడనుకున్న ఆజాద్ తండ్రి విక్రమ్ రాధోడ్(షారుఖ్ ఖాన్) తిరిగి రావడంతో కొత్త పరిణామాలు చోటు చేసుకుంటాయి. అవేంటనేది తెరమీద చూడాలి

విశ్లేషణ

దర్శకుడు అట్లీకి మాస్ మీద మంచి పట్టున్న సంగతి ఇంతకు ముందు చేసిన సినిమాల్లోనే అర్థమైపోయింది. అతని స్టోరీల్లో కొత్తదనం ఉండదు. తనను నమ్మిన స్టార్ హీరోని ఎలా హ్యాండిల్ చేస్తే థియేటర్లో విజిల్స్ పడతాయో, ఫ్యాన్స్ రిపీట్స్ వేసుకుని చూస్తారో వాటి మీద మాత్రమే దృష్టి పెడతాడు. దీనికోసం పాత బ్లాక్ బస్టర్లను స్ఫూర్తిగా తీసుకోవడానికి సైతం వెనుకాడడు. జవాన్ కూడా ఇదే బాపతులోకి వస్తుంది. నార్త్ ఆడియన్స్ చాలా కాలంగా మసాలా సినిమాలకు మొహం వాచిపోయిన సంగతిని పసిగట్టి దానికి తగ్గట్టే షారుఖ్ ఖాన్ ని ఊర మాస్ గా ప్రెజెంట్ చేయాలని ఆచితూచి లెక్కలేసుకుని మరీ జవాన్ రాసుకున్నట్టు ప్రతి ఫ్రేమ్ లో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.

చాలా సీన్లు గతంలో చూసినట్టే అనిపిస్తాయి. ఇంటర్వెల్ ఎపిసోడ్ ని కన్నార్పకుండా చూసి కాసేపు స్థిమితంగా ఆలోచిస్తే ఇది రాజమౌళి విక్రమార్కుడులో వచ్చిందేనని ఫ్లాష్ అవుతుంది. కానీ రిపీట్ ఫీల్ రాదు. మెట్రో ట్రైన్ ని హైజాక్ చేయడం పాతదే అయినా అందులో నుంచి ఆజాద్ ముఠా తప్పించుకోవడం స్పెషల్ గా అనిపిస్తుంది. లాజిక్స్ కి దూరంగా హీరో పాత్రలతో చాలా ఫీట్లు చేయించిన ఆట్లీ ఇందులోనూ విజయ్ మెర్సల్(తెలుగులో అదిరింది) ఫార్ములానే వాడుకున్నారు. డ్యూయల్ రోల్స్ లో ఒకరిని చంపకుండా ఇద్దరినీ బ్రతికించి ఒకే ఫ్రేమ్ లో పోరాటాలు చేయించడమనే థీమ్ పాతదే అయినా దాన్ని అల్ట్రా మోడరన్ గా ప్రెజెంట్ చేసిన తీరు బాగుంది.

శంకర్ తరహాలో ఏదో ఒక సోషల్ మెసేజ్ చెప్పాలని తాపత్రయపడే అట్లీ ఇందులోనూ అలాంటివి జొప్పించాడు. నిరుపేద రైతులకు రుణాలు ఇచ్చాక బ్యాంకులు ఎంత దారుణంగా ప్రవర్తిస్తాయో చూపించే ఎపిసోడ్ లో డ్రామా మరీ ఎక్కువైపోయి అరవ సాంబార్ వాసన కొట్టేస్తుంది. ఇక్కడ ఎమోషన్ బదులు ఇంత అవసరమా అనిపిస్తుంది. ఇలా అనుకుంటుండగానే దాన్ని మర్చిపోయేలా వెంటనే ఒక కిక్ యాస్ ఫైట్ తో మర్చిపోయేలా చేస్తాడు. ఇలాంటి గిమ్మిక్కులు బోలెడున్నాయి. ట్రైలర్ లోనే ద్విపాత్రాభినయం గురించి చెప్పేశారు కాబట్టి అది రివీల్ కావడం పెద్ద సస్పెన్స్ అనిపించదు కానీ ఆ క్యారెక్టర్ కు పెట్టిన వెరైటీ ట్విస్టు కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది.

ఇంత చేసిన అట్లీ తనకంటూ ఉన్న బలహీనతలను ఇందులోనూ తప్పించుకోలేదు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అవసరానికి మించిన లెన్త్ లో బలవంతపు భావోద్వేగాలను ఇరికించే ప్రయత్నం చేయడంతో అది త్వరగా అయిపోతే బాగుందనిపిస్తుంది. ఇక్కడ వచ్చిన ల్యాగ్ తిరిగి కొడుకు షారుఖ్ కోలుకునే దాకా కొనసాగుతుంది. ధూమ్ తరహాలో ఇద్దరు షారుఖ్ లు విలన్ల భరతం పట్టే హై వోల్టేజ్ యాక్షన్ ఛేజ్ అభిమానులకే కాదు సగటు మూవీ లవర్స్ కి సైతం ఈలలేయించే స్టఫ్. ఇలాంటివి క్రమం తప్పకుండ పేర్చుకుంటూ పోవడం వల్ల బోర్ కొట్టిన ప్రతిసారి ఆ లోటుని తన స్క్రీన్ ప్లేతో కవర్ చేసుకుంటూ పోయాడు ఆట్లీ. మనకు ఏదీ కొత్తగా అనిపించదు అలాని విసిగించదు.

హీరో విలన్ కాంఫ్లిక్ట్ ని రెగ్యులర్ గానే పెట్టిన అట్లీ విచిత్రంగా విజయ్ సేతుపతి లాంటి టాలెంటెడ్ నటుడిని సరిగా వాడుకో లేకపోయాడు. ఒకరకంగా చెప్పాలంటే షారుఖ్ స్క్రీన్ ప్రెజెన్స్ ముందు అతను తేలిపోయాడు. గెటప్ తో పాటు డైలాగులు చెప్పించిన తీరు కొంచెం తేడాగా అనిపిస్తుంది. రెండో సగంలో గ్రాఫ్ బాగా ఎగుడుదిగుడుగా వెళ్లినా ఉత్తరాది సింగల్ స్క్రీన్ జనాలు ఊగిపోయేలా క్లైమాక్స్ ఘట్టాన్ని ముగించడం జవాన్ ని హిట్టు మార్గంలో వెళ్లేలా చేసింది. తారాగణం సెట్ చేసుకోవడం దగ్గరి నుంచి లెక్కలేనట్టు ఖర్చు పెట్టే నిర్మాత దొరికిన అట్లీ వాటిని అడ్డం పెట్టుకునే తన వీక్ నెస్ లు బయటపడకుండా విన్నరయ్యే ఛాన్స్ పెంచుకున్నాడు

నటీనటులు

సరైన మాస్ అవతారంలో చూపిస్తే షారుఖ్ ఖాన్ ఎలా చెలరేగిపోతాడో చెప్పడానికి జవాన్ మరో ఉదాహరణగా నిలిచింది. ముఖ్యంగా తండ్రి కొడుకు పాత్రల వేరియేషన్ ని బాగా చూపించాడు. నయనతారకు మంచి స్కోప్ దక్కింది. అందం అభినయం రెండూ కుదిరాయి. దీపికా పదుకునే ఒక పాటతో పాటు హెవీ ఎమోషనల్ బ్లాక్ దక్కించుకుంది. విజయ్ సేతుపతి మాత్రం స్పెషల్ గా అనిపించడు. ప్రియమణి, సాన్యా మల్హోత్రా, రిద్ధి డోగ్రా తదితరులు నప్పారు. మాధవన్ నాయర్ గా సంజయ్ దత్ స్పెషల్ క్యామియో మరీ అంత మెరిపించలేదు. జస్ట్ ఓకే. చిన్నా చితక సపోర్టింగ్ ఆర్టిస్టులు పదుల్లో కాదు వందల్లో ఉండటంతో తెరనిండుతనం ఎక్కడ తగ్గలేదు

సాంకేతిక వర్గం

ఇటీవలే జైలర్ ని కేవలం తన బీజీఎమ్ తో దాని స్థాయిని పెంచిన అనిరుద్ చందర్ దాంతో పోలిస్తే మాత్రం ఆ రేంజ్ నేపధ్య సంగీతం ఇవ్వలేదు. ఎలివేషన్లకు కొదవ లేకపోయినా ఇంకా బెటర్ గా ఉండాల్సిందన్న ఫీలింగ్ వస్తుంది. ఆడియో కన్నా పాటల పిక్చరైజేషన్ బాగుంది. జికె విష్ణు ఛాయాగ్రహణం మాత్రం స్టేడియం బయట సిక్స్ కొట్టినట్టు ఉంది. విఎఫెక్స్ ఎఫెక్ట్స్ కి పెద్ద పీఠ వేసినా ఇంత గ్రాండియర్ ని ప్రెజెంట్ చేయడంలో సంక్లిష్టతను బాగా హ్యాండిల్ చేశారు. రూబెన్ ఎడిటింగ్ లెన్త్ మీద ఫోకస్ పెట్టాల్సింది. పావు గంట కోత వేసుంటే బెటరయ్యేది. ఆర్ట్ డిపార్ట్ మెంట్ పనితనం భేష్. రెడ్ చిల్లీస్ నిర్మాణ విలువలు కోట్లు వెదజల్లినట్టు ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్

షారుఖ్ ఖాన్ టూ మెన్ షో
పోరాటలు
మాస్ మెచ్చే ఎలివేషన్లు

మైనస్ పాయింట్స్

బ్యాక్ డ్రాప్ రొటీనే
సుదీర్ఘమైన ఫ్లాష్ బ్యాక్
విలన్ పాత్ర డిజైన్
పాటలు

ఫినిషింగ్ టచ్ : కొత్త క్వాలిటీతో పాత బిర్యాని

రేటింగ్ : 2.75/5