2/5
2h 40m | Action & Drama | 11 August 2023
Cast - Chiranjeevi, Keerthi Suresh, Tamannaah, Sushanth and Others
Director - Meher Ramesh
Producer - Anil Sunkara
Banner - AK Entertainments
Music - Mahathi Swara Sagar
మెగాస్టార్ చిరంజీవి సినిమా వస్తోందంటే కనిపించే సందడి పూర్తిగా లేకపోయినా టీమ్ చెప్పిన మాటలు చూశాక భోళా శంకర్ మీద నమ్మకం కలిగిన మాట వాస్తవం. నిన్న రజినీకాంత్ జైలర్ తో పెద్ద హిట్టు కొట్టాడని సంబరపడుతున్న టైంలో ఇక్కడా అలాంటి రిజల్ట్ దక్కుతుందేమోనని ఫ్యాన్స్ ఎదురు చూశారు. చెల్లిగా కీర్తి సురేష్, హీరోయిన్ గా తమన్నా, ఏకె ఎంటర్ టైన్మెంట్స్ భారీ నిర్మాణ విలువలు ఇలా కొన్ని అంశాలు పాజిటివ్ గా కనిపించాయి. మరి ప్రతికూలతను తట్టుకుని భోళా శంకర్ నిజంగానే మెప్పించేలా ఉన్నాడా లేదా
కథ
చెల్లెలు మహాలక్ష్మి(కీర్తి సురేష్) చదువు కోసం కోల్కతా వస్తాడు శంకర్(చిరంజీవి). టాక్సీ డ్రైవర్ గా ఉద్యోగం చేస్తూ నగరంలో అమ్మాయిల కిడ్నాప్ ముఠాల అంతు తేల్చే పనిలో ఉంటాడు. దుబాయ్ నుంచి వచ్చిన శ్రీకర్(సుశాంత్) మహాని తొలిచూపులోనే ప్రేమిస్తాడు. ఇతని చెల్లి లాయర్ లాస్య (తమన్నా) తో శంకర్ కు పరిచయం ఉంటుంది. కొన్ని అనూహ్య సంఘటనల తర్వాత ఈ మాఫియాకు లీడర్ అలెగ్జాండర్(తరుణ్ అరోరా)ని ఇండియా వచ్చేలా చేస్తాడు. వీళ్లిద్దరి మధ్య శత్రుత్వానికి మూలం గతంలో ఉంటుంది.
విశ్లేషణ
పాతికేళ్లనాడు ఏమో కానీ రీమేకులిప్పుడు రిస్కయిపోయాయి. అందుకే ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన వేదాళంని చిరుతో తీస్తారని ప్రకటించినప్పుడే ఒకరకమైన నిరాసక్తి అప్పుడే మొదలైంది. దానికి తోడు దర్శకుడు మెహర్ రమేష్ అనగానే అంచనాలు మరింత కిందకు వెళ్లిపోయాయి. అయినా సరే సుదీర్ఘమైన గ్యాప్ తర్వాత తనకు వచ్చిన అవకాశాన్ని బ్రహ్మాండంగా వాడుకుంటాడని ఆశించడం తప్పేమీ కాదు. కానీ దురదృష్టవశాత్తు రమేష్ అలా చేయలేదు. కమర్షియల్ సినిమాలకు ఒక టెంప్లేట్ ఉంటుంది నిజమే. కానీ అది ఫోర్స్డ్ గా అనిపించకూడదు. ఎప్పుడైతే ఆ ఫీలింగ్ కలుగుతుందో ఆడియన్స్ కి కనెక్ట్ కాకపోవడం మొదటి సీన్ నుంచే మొదలవుతుంది.
శంకర్ ని కోల్కతాలో దింపాక చూడాలని ఉంది రేంజ్ లో ఇంట్రోని ప్లాన్ చేసిన రమేష్ దాన్ని చప్పగా తేల్చేయడం దగ్గర నుంచే నీరసం స్టార్టవుతుంది. అన్నాచెల్లి ఇల్లు అద్దెకు తీసుకోవడం, హీరోయిన్ సరదా పరిచయం ఆపై గొడవ, నెక్స్ట్ ఒక పండగ పాట ఇలా రెగ్యులర్ ఫార్ములా నుంచి ఏ మాత్రం పక్కకు వెళ్లకుండా మరీ ముతకదారిలో శంకర్ ని తీసుకెళ్లారు. ఏదో ప్లాన్ తోనే ఇద్దరూ సిటీకి వచ్చారని ప్రేక్షకులకు ముందే అర్థమైనప్పుడు ఆసక్తి కలిగేలా అదనంగా ఉపకథలు సెట్ చేసుకోవాలి. కానీ రైటింగ్ టీమ్ ఈ విషయంలో కనీస జాగ్రత్తలు తీసుకోలేదు. స్క్రిప్ట్ సూపర్ వైజ్ చేసిన సత్యానంద్ గారు ఎప్పుడో కిరాయి కోటిగాడునాటి టిప్సే ఇచ్చినట్టున్నారు.
విలన్లని రివీల్ చేసే క్రమం, మహాలక్ష్మి శ్రీకర్ లకు పెళ్లి కుదిరించే ఘట్టం వగైరాల్లో ఎక్కడా ఏ కోశానా నవ్యత కనిపించదు. హైదరాబాద్ లో శంకర్ ఫ్లాష్ బ్యాక్ మొదలయ్యాక జబర్దస్త్ టీమ్ ని పక్కనపెట్టుకుని చిరు చేసిన కామెడీ అవుట్ డేటెడ్. యూట్యూబ్ లో ఉచితంగా ఇంతకన్నా మంచి జోకులు దొరుకుతున్నప్పుడు అవి చేయడానికి చిరంజీవే అవసరం లేదు. అయినా సరే ఆయన టైమింగ్, చలాకీతనం కొంతలో కొంత వాటిని వరస్ట్ అనే భావన నుంచి కొంతయినా తప్పించాయి. పవన్ కళ్యాణ్ ఇమిటేట్ చేస్తే థియేటర్లు షేక్ అయిపోతాయనే ఆలోచన మెహర్ రమేష్ కు ఎలా వచ్చిందో కానీ అది రివర్స్ బూమారాంగ్ తో మౌనానికి దారి తీసింది.
మాస్ ని మెప్పించాలంటే ప్రాథమికంగా గుర్తుపెట్టుకోవాల్సింది హీరో వైపు నుంచి ఇస్తున్న ఎలివేషన్లు, ఎమోషన్లు ఏ స్థాయిలో పండుతున్నాయనేది. అఖండ, విక్రమ్, జైలర్ లో ఇవి సరిగా కుదరడం వల్లే గొప్ప కథలు కాకపోయినా గొప్పగా ఆడాయి. ఎవరిదో ఎందుకు. వాల్తేరు వీరయ్య వంద కోట్లను ఎలా లాగింది. కెజిఎఫ్ లో తల్లి సెంటిమెంట్ కి ఆడియన్స్ ఎందుకు కదిలిపోయారు. భోళా శంకర్ లో చిరంజీవి, కీర్తి సురేష్ ల మధ్య అలాంటి ఎస్టాబ్లిష్ మెంట్ కి చోటు ఉన్నప్పటికీ దానికి సెట్ చేసుకున్న బ్యాక్ డ్రాప్ మరీ ఆషామాషీగా ఉండటంతో వాళ్ళ బాండింగ్ ని వ్యక్తిగతంగా అనుభూతి చెందలేం. అలాంటప్పుడు ఆ పాత్రలతో ప్రయాణించలేం
చాలా మార్పులు చేశానని చెప్పిన మెహర్ రమేష్ చిరుకి ఇబ్బంది అనిపించేవి మాత్రమే ఛేంజ్ చేసి మిగిలిదంతా యథాతథంగా తీసేందుకే ప్రాధాన్యం ఇచ్చాడు. వేదాళం ఇంటర్వెల్ బ్లాక్ లో కీలకంగా నిలిచిన అజిత్ అపరిచితుడు సీన్ ఇందులో అతి మాములుగా పెట్టేసి టెంపో తగ్గించాడు. పైగా చిరంజీవి కత్తితో అవతలోడి తలని కనీసం ఒక్కసారైనా గాల్లోకి ఎగరేయకపోతే ఫ్యాన్స్ ఫీలవుతారని రిపీట్ చేయడం కృతకంగా ఉంది. ఈ బ్లాక్ చాలాసార్లు చూసినట్టే అనిపించడం వల్ల అక్కడ ఎంత మంచి ఫైట్ కంపోజింగ్ జరిగినా కిక్ ఇవ్వలేకపోయింది. పైగా విలన్లుగా నటించిన ఆర్టిస్టులు, వాళ్ళ డెన్ సెటప్, హెలికాఫ్టర్ బిల్డప్పులు అన్నీ కాలం చెల్లిన తరహావే.
అరవై ఎనిమిదేళ్ల వయసులో తాను ఎలా కనిపించాలన్న ఆలోచన చిరంజీవికి ఉండటం కన్నా ఆయన్ను ఎలా ప్రెజెంట్ చేస్తే చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ చూస్తారనే కోణంలో దర్శక రచయితలు కథలు రాసి ఒప్పించాలి. ఇది రౌడీ అల్లుడు జమానా కాదు. దొంగ మొగుడు టైం కాదు. కాలం చెల్లిన హాస్యాన్ని డబ్బులిచ్చి చూసేందుకు ఆడియన్స్ సిద్ధంగా లేరు. భోళా శంకర్ లో కమర్షియల్ వర్కౌట్ చేసుకోవడానికి తగినంత స్కోప్ ఉన్నా బద్దకించిన రాతల వల్ల ఎటూ కాకుండా పోయింది. తెరనిండా తారాగణం ఉండగానే సరిపోదు, ప్రేక్షకుల మెదడు నిండా అల్లుకుపోయే ఎంగేజింగ్ కంటెంట్ మీద దృష్టి పెడితేనే భోళా శంకర్లు భలే భలే అనిపించుకుంటాయి
నటీనటులు
చిరంజీవి ఇంత వయసులోనూ మంచి ఎనర్జీతో ఫైట్లు, డాన్సులు చేయడం అభినందనీయం. ముఖకవళికలతో సమానంగా కళ్ళతో భావాలు పలికించే చిరు ఇందులోనూ అలాంటి మెరుపులు చూపించారు. కానీ ఇవన్నీ ఒలికిపోయిన గంగా జలమే అయ్యాయి. కీర్తి సురేష్ మరీ స్పెషల్ గా అనిపించలేదు కానీ రైట్ ఛాయసే. తమన్నా పాటలకు, ఓ మూడు సీన్లకు మాత్రమే పరిమితం. డబ్బింగ్ ఆర్టిస్టుల నైపుణ్యంతో నెట్టుకొచ్చే తరుణ్ అరోరా ఇందులోనూ కేకలకు పరిమితమయ్యాడు. వెన్నెల కిషోర్ పర్వాలేదు. హైపర్ ఆది, వైవా హర్ష, రఘుబాబు, సురేఖావాణి, వేణు యెల్దండి, లోబో, సత్య, గెటప్ శీను, శ్రీముఖి తదితరులు నవ్వించడానికి చాలా కష్టపడ్డారు.
సాంకేతిక వర్గం
తనకొచ్చిన లైఫ్ టైం అవకాశాన్ని మహతి స్వర సాగర్ సద్వినియోగపరుచుకోలేదు. పాటలు ఆల్రెడీ యావరేజ్ స్టాంప్ తో జనాలకు పెద్దగా ఎక్కలేదు. నేపధ్య సంగీతం మరీ అన్యాయంగా ఉంది. ఇలా అయితే తండ్రి వారసత్వాన్ని నిలబెట్టడం కష్టం. డడ్లీ ఛాయాగ్రహణంలో చిరు అందంగా కనిపించారు. విజువల్స్ బాగా ప్రెజెంట్ చేశారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ ఇంకో పావు గంట కోత వేసి ఉంటే కొన్ని ఫిర్యాదులు తగ్గేవి. నైజామ్ బాష డైలాగులు సరిగా కుదరలేదు. రామ్ లక్ష్మణ్ పోరాటాలు మాస్ వరకు ఓకే. ఏకె ఎంటర్ టైన్మెంట్స్ అనిల్ సుంకర ప్రొడక్షన్ పరంగా కామెంట్ చేయనివ్వలేదు. ఎలాంటి లోటు లేకుండా చాలా ఖర్చు పెట్టారు.
ప్లస్ పాయింట్స్
చిరంజీవి ఎనర్జీ
యాక్షన్ బ్లాక్స్
మైనస్ పాయింట్స్
సంగీతం
రొటీన్ కంటెంట్
పండని ఎలివేషన్లు
పేలని కామెడీ
ఫినిషింగ్ టచ్ : ట్యాక్సీ పంచర్
రేటింగ్ : 2 / 5