సమీక్ష – విమానం

2.5/5

  |   Family   |   09-06-2023


Cast - Samuthirakani, Rahul Ramakrishna, Anasuya Bharadwaj, Master Dhruvan, Meera Jasmine, Dhanraj and others

Director - Siva Prasad Yanala

Producer - Kiran Korrapati & Zee Studios

Banner - Zee Studios, Kiran Korrapati Create Works

Music - Charan Arjun

స్టార్ క్యాస్టింగ్ లేకుండా చిన్న సినిమాలను మార్కెట్ చేసుకోవడం చాలా కష్టం. అందులోనూ సముతిరఖని లాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయితే కంటెంట్ చాలా బలంగా ఉండాలి. విమానం మీద ఆసక్తి కలిగేలా చేయడంతో టీమ్ చేసిన ప్రమోషన్లు బాగానే ఉపయోగపడ్డాయి. ఎమోషన్లనే ప్రధానాంశంగా తీసుకుని శివ ప్రసాద్ దర్శకత్వంలో జీ స్టూడియోస్-కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మించాయి. అన్నీ బడ్జెట్ మూవీసే రిలీజైన ఈ శుక్రవారంలో విమాన ప్రయాణం కుదుపులకు లోనైందా సాఫీగా జరిగిందా

కథ

అంగవైకల్యం ఉన్నా కుటుంబం నమ్ముకుంటూ వచ్చిన సులభ్ కాంప్లెక్స్ మీద జీవిస్తుంటాడు వీరయ్య(సముతిరఖని). ఒక్కగానొక్క కొడుకు రాజు(మాస్టర్ ధృవన్)ని స్కూల్లో చదివిస్తూ గొప్పవాడిని చేయాలని కలలు కంటుంటాడు. రాజుకి విమానం అంటే పిచ్చి. ఒక్కసారైనా ఎక్కాలని కోరుకుంటాడు. మొదట్లో తేలికగా తీసుకున్న వీరయ్య ఓ అనూహ్య సంఘటన తర్వాత ఎలాగైనా సరే వాడి కలను నెరవేర్చాలని నిర్ణయించుకుంటాడు. ఈలోగా జీవనోపాధి పోతుంది. సవాళ్లు చుట్టుముట్టిన ఈ యుద్ధంలో వీరయ్య ఎలా గెలిచాడు

విశ్లేషణ

ఫీడ్ గుడ్ మూవీస్ ఈ మధ్య బాగా తగ్గిపోయాయి. శేఖర్ కమ్ముల లాంటి సెన్సిబుల్ దర్శకులు రెండు మూడేళ్ళకో చిత్రం తీస్తున్న నేపథ్యంలో భావోద్వేగాల మీద కథలు రాస్తున్న రచయితలు కరువయ్యారు. బహుశా ఈ గ్యాప్ ని గుర్తించే శివప్రసాద్ యానాల ఈ విమానంని సిద్ధం చేసినట్టు కనిపిస్తుంది. కొడుకు లక్ష్యం కోసం తండ్రి దేనికైనా సిద్ధపడటం అనేది మంచి థ్రెడ్. నాని జెర్సీ సక్సెస్ అయ్యింది ఈ పాయింట్ ని హృదయాలను తాకేలా ప్రెజెంట్ చేయడం వల్లే. లైన్ పరంగా పోలిక లేకపోయినా చివరి లక్ష్యం రెండు కథల్లో ఒకటే. కాకపోతే అక్కడ విక్రమ్ మిడిల్ క్లాస్ అయితే ఇక్కడ వీరయ్య మరీ తీవ్రమైన పేదరికంలో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు.

మొదలుపెట్టిన క్రమం నీట్ గానే ఉన్నప్పటికీ పాత్రలను రిజిస్టర్ చేసే తతంగం ఎక్కువసేపు జరగడంతో రాజు పదే పదే విమానం గురించి గోల చేయడం తప్పించి కథనం ముందుకు వెళ్ళదు. చుట్టుపక్కల ఉండే ఆటో డ్రైవర్, చెప్పులు కొట్టేవాడు, వెయ్యి రూపాయలకు ఒళ్లముకునే వేశ్య ఇలా వీళ్ళ నేపధ్యాలను పరిచయం చేయడానికి ఎక్కువ సమయం తీసుకోవడంతో అసలైన విషాదం తాలూకు ట్విస్ట్ లేట్ గా చెబుతారు. నిజానికి ఇది రెండు గంటల నిడివికి సరిపడా మెటీరియల్ కాదు. అయినా సరే ఎమోషన్లను నమ్ముకున్నప్పుడు కొంత నెమ్మదితనాన్ని ప్రేక్షకులు క్షమిస్తారనే నమ్మకంతో శివప్రసాద్ యానాల స్లో ప్యాట్రన్ ఫాలో అయ్యారు

సెకండ్ హాఫ్ మొదలయ్యాక గుండెని కొంత తడి చేసే సన్నివేశాల పర్వం మొదలవుతుంది. ఫ్లైట్ టికెట్ డబ్బుల కోసం వీరయ్య పడే పాట్లు, అవమానాలు, సంఘటనలు అన్నీ మంచి నాటకీయతతో సాగుతాయి. కాకపొతే మెలోడ్రామా డోస్ కాస్త మోతాదు దాటిపోవడంతో ఒకదశలో ఇంత కష్టాలు చూపించాలా అనిపిస్తుంది. అయిదు లక్షలు విలువ చేసే ఇంటిని కేవలం పది వేలకు అమ్మడం లాంటివి అంత కన్విన్సింగ్ గా అనిపించవు. దొంగతనం నేరం మోపడం లాంటివి పాత స్టైల్. కాకపోతే ఆ ఎపిసోడ్ అయ్యాక పోలీస్ తో వీరయ్య అనే మాటలు, పరాయి సొమ్ము గురించి చెప్పే డైలాగులు బాగా పేలి కొన్ని బలహీనతలను కవర్ చేసుకుంటూ వచ్చాయి.

ఇదంతా బాగానే ఉన్నప్పటికీ నాణేనికి మరో వైపు అన్నట్టు ఉపకథలను సరిగా రాసుకోలేకపోవడం శివప్రసాద్ బలహీనత. రాహుల్ రామకృష్ణ సుమతి పాత్రలకు సెట్ చేసిన బ్యాక్ డ్రాప్ బాగానే ఉన్నప్పటికీ చివరికి వచ్చేసరికి వాళ్ళ ద్వారా పండాల్సిన ఎమోషన్స్ అంత హై అనిపించకపోవడానికి కారణం ఇదే. పైగా వీరయ్య మరీ చేతిలో పైసా లేదనే రీతితో పదే పదే చూపించడం ఎంత మాస్ ఆడియన్స్ కైనా అంత సబబుగా అనిపించదు. ఇది స్ట్రాంగ్ గా కనెక్ట్ అవ్వాలనే ఉద్దేశంతోనే పాడుబడిన పబ్లిక్ టాయిలెట్స్ ని వీరయ్య ఉద్యోగంగా చూపించారు కానీ సగటు మధ్యతరగతి జనాలకైనా సరే ఈ థీమ్ అంత సులభంగా కనెక్ట్ అవ్వదు.

విమానం నుంచి కేవలం బరువుగా అనిపించే లైట్ ఎమోషన్లను మాత్రమే ఆశిస్తే ఎలాంటి నిరాశ కలగదు. అలా కాకుండా బలగం లాగా కామెడీ, పాటలు, భావోద్వేగాలు, ప్రేమకథ, సరదాలు అన్నీ కావాలంటే మాత్రం ఇది అందరూ ఎక్కే విమానం అనిపించుకోదు. క్లైమాక్స్ ని ముగించిన తీరు విమానంకు ఆయువుపట్టుగా నిలిచింది. నిడివి రెండు గంటల రెండు నిమిషాలకు పరిమితం చేయడం కొంత ప్లస్ అయ్యింది. కమర్షియల్ కొలతల్లో ఇది అద్భుతం చేస్తుందా లేదా అనేది తేలడానికి ఓ రెండు మూడు రోజులు పట్టొచ్చు. పైన చెప్పినట్టు థియేటర్ నుంచి బయటికి వచ్చే ప్రేక్షకుడు గుండెల నిండా బరువు ఫీలైతే సక్సెసే. కానీ ఆ శాతం ఎంత ఉంటుందన్నది కీలకం

నటీనటులు

సముతిరఖని వీరయ్యగా పరకాయప్రవేశం చేశారు. హావభావాలు, నటన బాగా వచ్చాయి. స్వంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం కొంత ప్రభావాన్ని తగ్గించినట్టు అనిపించినా అదేమీ సీరియస్ ఇష్యూ కాలేదు. కథ మొత్తం తన మీదే నడిచే పాత్రలో మాస్టర్ ధృవన్ చాలా న్యాచురల్ గా ఉన్నాడు. ధన్ రాజ్ కు అలవాటైన పాత్రే. రాహుల్ రామకృష్ణకు ఇంకొంచెం స్కోప్ దక్కి ఉంటే చెలరేగిపోయేవాడు కానీ సరిగా వాడుకోలేదు. అనసూయ పర్ఫెక్ట్ ఛాయస్. గుండు రాజేందర్ జోకులు పండలేదు. బాగా సన్నబడిన మీరా జాస్మిన్ చివరి ఘట్టంలో స్పెషల్ సర్ప్రైజ్. చిన్నా చితక ఆర్టిస్టులు ఇంకా ఉన్నారు కానీ ఇంకెవరి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించే అవసరం పడలేదు

సాంకేతిక వర్గం

చరణ్ అర్జున్ నేపధ్య సంగీతం బాగా కుదిరింది. వీక్ గా ఉన్న సన్నివేశాలను సైతం బాగానే కవర్ చేశారు. ఎక్కువ పాటలు లేకపోయినా ఉన్నవి మళ్ళీ వినాలనిపించేలా లేవు. వివేక్ కాలెపు ఛాయాగ్రహణం చక్కగా సాగింది. ఛాలెంజింగ్ అనిపించేంత గ్రాండియర్ కాదు కనక తన పనిని లోటు లేకుండా నెరవేర్చారు. హను రావూరి సంభాషణలు కొన్ని చోట్ల బాగా పేలాయి. సీన్లోని ఎమోషన్ ని ఎలివేట్ చేశాయి. మార్తాండ్ కె వెంకటేష్ వీలైనంత క్రిస్పీ గా ఉంచేందుకు చేసిన ప్రయత్నం తెరమీద కనిపిస్తుంది. నిర్మాణ విలువలు పెద్ద బడ్జెట్ ని డిమాండ్ చేయకపోవడంతో ఉన్నంతలో రిస్క్ లేకుండా ఖర్చు పెట్టారు

ప్లస్ పాయింట్స్

సముతిరఖని-ధృవన్
రెండో సగం ఎమోషన్స్
చివరి ఘట్టం

మైనస్ పాయింట్స్

నెమ్మదిగా సాగే ఫస్ట్ హాఫ్
మలుపులు రొటీనే
సీరియల్ టైపు కష్టాలు
అనసూయ రాహుల్ ఎపిసోడ్

ఫినిషింగ్ టచ్ : ఎమోషన్ల విమానం

రేటింగ్ : 2.5/5