సమీక్ష – అన్నీ మంచి శకునములే

2.5/5

2 Hr 34 Mins   |   Family   |   18 - 05 - 2024


Cast - Santosh Shobhan, Malavika Nair, Rajendra Prasad, Vennela Kishore , others

Director - Nandini Reddy

Producer - Swapna Dutt, Priyanka Dutt

Banner - Vyjayanthi Movies

Music - Mickey J Meyer

ఒక పెద్ద బ్యానర్ చిన్న సినిమా తీయడం అరుదు. అలాంటిది దాన్ని భారీ స్థాయిలో ప్రమోట్ చేసుకోవడం గుర్తించాల్సిన విషయం. టైటిల్ కు తగ్గట్టే అన్నీ మంచి శకునములేకు గత నెల రోజులుగా పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపించాయి. ఓ బేబీ తర్వాత నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన మూవీ కావడం, సీతారామం లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాక స్వప్న బ్యానర్ టేకప్ చేసిన ప్రాజెక్ట్ లాంటి కారణాల వల్ల అంచనాలైతే నెలకొన్నాయి. అసలే బాక్సాఫీస్ డల్లుగా ఉన్న టైంలో వచ్చిన ఈ ఎంటర్ టైనర్ నిజంగా టైటిల్ అంత మంచిగా ఉందా

కథ

చుట్టూ కాఫీ తోటలుండే విక్టోరియాపురంలో ఒక టీ ఎస్టేట్ కు సంబంధించిన కోర్టు కేసు వల్ల దివాకర్(రావు రమేష్) ప్రసాద్(రాజేంద్రప్రసాద్) కుటుంబాలకు మాటలుండవు. అయితే ఇద్దరి పిల్లలు రిషి(సంతోష్ శోభన్) ఆర్య(మాళవిక నాయర్)ల మధ్య స్నేహం ఉంటుంది. ఫుడ్ వీడియోలతో పాపులరయ్యే ప్లాన్ లో ఉన్న రిషి, స్వంతంగా బిజినెస్ తో ఎదగాలని చూస్తున్న ఆర్య ఒక పని మీద కలిసి ఇటలీ వెళ్తారు. వీళ్లిద్దరికీ సంబందించిన ఒక షాకింగ్ నిజం కొన్ని సంఘటనల తర్వాత బయటపడుతుంది.

విశ్లేషణ

దర్శకురాలు నందిని రెడ్డిలో మంచి కామిక్ సెన్స్ తో పాటు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ బాగుంటుంది. అలా మొదలైందితో మొదలుపెట్టి ఓ బేబీ దాకా ఇవే ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర చేశాయి. ఈసారి రిస్క్ చేయకుండా అలాంటి ప్రయత్నమే చేయబోయారు. ఒకరంటే ఒకరికి పడని రెండు కుటుంబాల తరఫున హీరో హీరోయిన్లు రావడం, వాళ్ళ మధ్య ఒక బంధం ఏర్పడటం చాలాసార్లు చూసిందే. ఇలా అయితే రొటీన్ అనిపించే ఛాన్స్ ఉంది కాబట్టి అల వైకుంఠపురములో టైపు ట్విస్టు పెట్టి ఏదో కొత్తగా చెప్పాలనుకున్నారు నందిని రెడ్డి. దానికి సరిపడా సీనియర్ ఆర్టిస్టులు చాలానే దొరికారు. ఇంకేముంది వాళ్ళు కాచుకుంటారనే ధైర్యంతో ముందుకెళ్లిపోయారు

లైన్ పరంగా అన్నీ మంచి శకునములేలో విషయమున్నప్పటికీ దాన్ని రెండున్నర గంటలు ఎంగేజ్ అయ్యే మెటీరియల్ గా రాసుకోవడంలో నందినిరెడ్డి బృందం తడబడింది. అసలు చైల్డ్ ఎపిసోడ్ పావు గంట సాగడమే మొదటి మైనస్. మొదటి అయిదు నిమిషాల్లో అసలు మలుపు చూపించేశాక వెంటనే వర్తమానానికి వచ్చేయాలి. కానీ రిషి ఆర్యల మధ్య బాండింగ్ లో రిజిస్టర్ చేసే క్రమంలో ఎక్కువ సన్నివేశాలు పేర్చడంతో ల్యాగ్ తొలి గంటలోనే మొదలయ్యింది. దీని వల్ల మధ్యలో వచ్చే కొన్ని మంచి సీన్స్, నవ్వించే మాటలు ఆ స్కోప్ ఇవ్వకుండా ఫ్లోలో కలిసిపోయి ఏదో మాములు కంటెంట్ ని చూస్తున్న ఫీలింగ్ ని కలిగిస్తాయి.

సహజత్వం పేరుతో నందిని రెడ్డి అవసరానికి మించిన నాటకీయత జొప్పించడం వల్ల చాలా భాగం సీరియల్ చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. రిషి ఆర్యల మధ్య రిలేషన్ ని సెన్సిటివ్ గా డీల్ చేయాలనుకున్నప్పుడు వీలైనంత ఎక్కువ ఫోకస్ ఫన్ మీద పెట్టాలి. కానీ అది జరగలేదు. ఇటలీకి వెళ్లడం, అక్కడ కాఫీ మేకర్ ని కలుసుకోవడం, తర్వాత జరిగే ఇన్సిడెంట్ చప్పగా సాగుతాయి. దీంతో మంచి బ్రేక్ అనిపించాల్సిన ఇంటర్వెల్ బ్లాక్ చక్కర లేని కాఫీలా మారిపోయింది. దీంతో సెకండ్ హాఫ్ మీద పెద్దగా ఆశలు కలగవు. రెండేళ్ల తర్వాత రిషి హఠాత్తుగా పది మిలియన్లున్న యుట్యూబ్ బ్లాగర్ గా మారిపోయే క్రమం కూడా ఫాస్ట్ షాట్స్ లో మమ అనిపించేశారు

ద్వితీయార్థంలో ఏదైనా అద్భుతం జరుగుతుందేమో అనుకుంటే అది పూర్తిగా నెరవేరదు. అంత పెద్ద పెళ్లికి ప్లాన్ చేసుకుని రెండు రోజుల ముందు వంటవాళ్ళ గురించి ఎంక్వయిరీలు చేసుకోవడం అంత నమ్మశక్యం లేదు. పైగా వంట మనమే చేసుకుందామని ఆడవాళ్ళందరూ నడుం బిగించడం వినడానికి బాగానే ఉంది కానీ ప్రాక్టికల్ గా సాధ్యమయ్యే అవకాశం లేనప్పుడు మహిళా ప్రేక్షకులకైనా అది ఎలా కనెక్ట్ అవుతుంది. పైగా పెళ్లి పుస్తకం టైపులో తిండి పదార్థాల పాట, పెళ్లి విడిదిలో పాత పాటల డాన్సులు ఇవన్నీ ఫోర్స్డ్ గా అనిపిస్తాయి. నెరేషన్ మరీ స్లో పేస్ లో వెళ్లడం సహనానికి పరీక్ష పెట్టింది. ఒకదశలో స్క్రిప్ట్ ఏ కాలంలోదో అనిపిస్తుంది.

చెప్పాలనుకున్న విషయంలో నిజాయితీ ఉంటే సరిపోదు. ఓ ఇంటర్వ్యూలో నందిని రెడ్డి హం ఆప్కే హై కౌన్ ఉదాహరణ చెప్పారు. నిజానికి అది ఈ జనరేషన్ కి ఎక్కదు. 1995లో అప్పటి ఆవకాయ రుచుల టేస్ట్ కి చెల్లింది. కానీ పిజ్జాల తరంలో సాగదీసిన పెళ్లి వీడియో సిడిలు ప్లే చేస్తే ఒప్పుకోవడం కష్టం. రిషి-ఆర్యల ట్రాక్, దివాకర్ భాస్కర్ ఫ్యామిలీస్ మధ్య భావోద్వేగాలు క్లైమాక్స్ లో ఎంతగా పండినా అంతకు ముందు వరకు జరిగింది ఎలాంటి ఎగ్జైట్ మెంట్ ఇవ్వకపోవడంతో చివరి ఘట్టం బాగానే ఉన్నా అప్పటికే జరిగిపోయిన డ్యామేజ్ ఫీల్ గుడ్ మూవీ స్టాంప్ పడకుండా అడ్డుపడింది. ఫ్యామిలీసే టార్గెట్ అన్నారు కాబట్టి వాళ్ళ చేతిలోనే ఫలితముంది

నటీనటులు

సంతోష్ శోభన్ ఎప్పటిలాగే చలాకీగా చేసుకుంటూ పోయాడు. క్యారెక్టరైజేషన్ లో కొంత కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ తనవరకు ఎంత బెస్ట్ ఇవ్వాలో అంతా ఇచ్చాడు. మాళవిక నాయర్ మంచి పెరఫార్మరే కానీ ఎందుకో తన లుక్స్ అంత ఆకట్టుకునేలా లేవు. నటన పరంగా ఓకే. రాజేంద్ర ప్రసాద్, నరేష్, రావు రమేష్ లు ఎప్పటిలాగే తమ అనుభవంతో నెట్టుకొచ్చారు. కాకపోతే వాళ్ళ క్యాలిబర్ ని పూర్తిగా వాడుకునే బలం ఇందులో లేదు. ఊర్వశి, గౌతమి, తొలిప్రేమ వాసుకి తెరనిండా కనిపించారు కానీ గుర్తుండిపోయేలా లేరు. తాగుబోతు రమేష్, ఝాన్సీ రెండు సీన్లకు పరిమితం. ఈ వయసులోనూ షావుకారు జానకి గారి చలాకీతనం బాగుంది. చిన్న ఆర్టిస్టుల కౌంట్ పెద్దదే

సాంకేతిక వర్గం

మిక్కీ జె మేయర్ కు తన అభిరుచికి, సిగ్నేచర్ కి తగ్గ సబ్జెక్టు దొరికినా సంగీతం విషయంలో నిరాశపరిచారు. ఏ పాటా మళ్ళీ ఇంకోసారి విందామానో చూద్దామనో అనిపించదు. నేపధ్య సంగీతమూ సోసోనే. సన్నీ కొర్రపాటి – రిచర్డ్ ప్రసాద్ ఛాయాగ్రహణంలో క్వాలిటీ పరంగా ఎలాంటి లోపాలు లేవు. జునైద్ సిద్ధికి ఎడిటింగ్ లెన్త్ మీద సీరియస్ గా ఫోకస్ పెట్టాల్సింది. అవసరం లేని సీన్లు చాలా పడ్డాయి. స్క్రీన్ ప్లే సమకూర్చిన దావూద్, మాటలు రాసిన లక్ష్మి భూపాల సీన్స్ మీద ఇంకొంత సీరియస్ గా వర్క్ చేయాల్సింది. నిర్మాణ పరంగా స్వప్న దత్, ప్రియాంక దత్ లు వేలెత్తి చూపించే ఛాన్స్ ఇవ్వలేదు.లోకల్ నుంచి ఫారిన్ దాకా అన్ని లొకేషన్లు సమకూర్చిపెట్టారు

ప్లస్ పాయింట్స్

తారాగణం
కొన్ని భావోద్వేగాలు
నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్

నెమ్మదిగా సాగే కథనం
సంగీతం
ఫస్ట్ హాఫ్
ఎమోషనల్ ల్యాగ్

ఫినిషింగ్ టచ్ : నెమ్మదిగా నడిచే శకునములు

రేటింగ్ : 2.5/5