సమీక్ష – ఏజెంట్

2/5

2 Hr 36 Mins   |   Action   |   28-04-2023


Cast - Akhil, Sakshi Vaidya, Mammooty, Murali Sharma, Dino Morea and others

Director - Surender Reddy

Producer - Anil Sunkara

Banner - AK Entertainments

Music - Hiphop Tamizha

ఇండస్ట్రీకి వచ్చి ఏళ్ళు గడుస్తున్నా భారీ బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న అఖిల్ ఏజెంట్ మీద అభిమానుల నమ్మకం అంతా ఇంతా కాదు. నిర్మాణంలో విపరీతమైన జాప్యం జరిగినప్పటికీ కుర్రాడికి హిట్టు పడాలనే అందరూ కోరుకున్నారు. దానికి తోడు ప్రమోషన్లు విపరీతంగా చేయడం, ట్రైలర్ డేట్ చెప్పడం కోసం పబ్లిక్ గా సాహసాలు చేయడం క్రమంగా దీని మీద అంచనాలు పెంచుతూ వెళ్లాయి. ఇంకా స్టార్ స్టేటస్ కి చేరుకోని అఖిల్ మీద అనిల్ సుంకర కోట్లు కుమ్మరించేశారు. మరి ఏజెంట్ లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదా

కథ

రామకృష్ణ అలియాస్ రికీ(అఖిల్) చిన్నప్పటి నుంచే స్పై అవ్వాలని టార్గెట్ గా పెట్టుకుంటాడు. రా చీఫ్ మహదేవ్(మమ్ముట్టి)ని స్ఫూర్తిగా తీసుకుని ఇంటర్వ్యూలకు వెళ్లి తిరస్కారానికి గురవుతూ ఉంటాడు. చేష్టలు విపరీతంగా ఉన్నా రికీలోని చలాకితనం, హ్యకింగ్ తెలివితేటలు గమనించిన మహాదేవ్ అతన్ని ప్రమాకరమైన అంతర్జాతీయ తీవ్రవాది డెవిల్(డినో మోరియా)ని పట్టుకునే బాధ్యతను అప్పజెబుతాడు. ఉత్సాహంగా ఒప్పుకున్న రికీ ఈ మిషన్ వల్ల ప్రమాదకరమైన వలయంలో చిక్కుకుంటాడు. తర్వాత జరిగేదే స్టోరీ  

విశ్లేషణ

గూఢచారి నేపథ్యంలో సినిమాలు టాలీవుడ్ కు కొత్తేమి కాదు. సూపర్ స్టార్ కృష్ణతో మొదలుపెట్టి అడవి శేష్ దాకా ఎందరో చేస్తూనే ఉన్నారు. వాటిలో అధిక శాతం విజయవంతమైనవే. మెయిన్ పాయింట్ దాదాపు  అన్నిటిలోనూ ఒకటే ఉంటుంది. టేకింగ్, స్క్రీన్ ప్లే, ట్విస్టుల్లో వైవిధ్యం చూపడం ద్వారా ఆయా దర్శకులు సక్సెస్ సాధించారు. రచయిత వక్కంతం వంశీ కూడా ఇదే లైన్ ని ఫాలో అవుతూ కొత్తగా ఏదో రాద్దామనే తాపత్రయంలో మళ్ళీ వాటినే తిరగరాసుకుని దర్శకుడు సురేందర్ రెడ్డికి ఇచ్చేశారు. ఆయనా పూర్తిగా చెక్ చేసుకోకుండా ఫైట్లు, విదేశాల్లో యాక్షన్ ఎపిసోడ్లు పెట్టడానికి స్కోప్ ఉందా లేదాని చూసుకుని జై ప్యాన్ ఇండియా అనేశారు.

ఏజెంట్ చూశాక ఎవరికైనా కలిగే సందేహం ఇదే. భారతదేశ రక్షణ కోసం అత్యంత వ్యూహాత్మకంగా పనిచేసే రా డిపార్ట్ మెంట్ అంటే తమాషా కాదు. ఇష్టం వచ్చినట్టు లాజిక్కులన్నీ గాలికి వదిలేసి సినిమాటిక్ ఫ్రీడమ్ పేరుతో తోచిందల్లా తీసుకుంటూ పోతే ఆ శాఖ పనితనం గురించి అవగాహన లేని వాళ్ళు సైతం నవ్వుకుంటారు. ప్రాథమికంగా రికీ పాత్ర ఎస్టాబ్లిష్ మెంట్ లోనే బోలెడు లోపాలతో మొదలుపెట్టారు సూరి. గూఢచారి కావాలనే గోల్ పెట్టుకోవడం వరకు బాగానే ఉంది కానీ మరీ అంత ఇమ్మెచ్యూర్డ్ గా తన ప్రవర్తనను డిజైన్ చేయడం సిల్లీగా మార్చేసింది. రాలో చేరాలనుకునే కుర్రాడు అందులో పనిచేసే వాళ్ళ గురించి కనీసం తెలుసుకోడా

సరే క్యారెక్టరైజేషన్లు ఎలా ఉన్నా కనీసం పాత్రల చిత్రణ వాటి మధ్య సంబంధాలు ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఉండాలి. ఒక సీన్ లో ఎల్కేజి పిల్లాడిలా ప్రవర్తించే రికీ కొద్దీ నిమిషాల్లోనే మినిస్టర్ ఇంటికి వెళ్లి బోయపాటి హీరో రేంజ్ లో వార్నింగ్ ఇచ్చి దుమ్ము దులుపుతాడు. నేషనల్ లెవెల్ ఆఫీసర్ డేటాని హ్యాక్ చేసే తెలివితేటలున్న రికీ గురువుగా భావించే మహాదేవ్ దగ్గరకు ఎలా వెళ్లాలో ఒక పద్ధతిలో ప్లాన్ చేసుకోడు. తనకు కన్వీనియంట్ గా స్క్రీన్ ప్లే సాగుతుంది తప్పించి ఎక్కడా తర్కానికి అనుగుణంగా కథా కథనాలు నడవకపోవడం దురదృష్టం. గ్రిప్పింగ్ గా ఉందని చెప్పే అవకాశం సురేందర్ రెడ్డి ఎక్కడా ఇవ్వలేదు. అంత ఫ్లాట్ గా నడుస్తుంది

ఇలాంటి స్పై డ్రామాల్లో విలన్ పవర్ ఫుల్ గా ఉండాలి. విజయ్ తుపాకీ చూసే నాటికి విద్యుత్ జమాల్ మనకు తెలియదు. కానీ మురుగదాస్ అతన్ని చూపించిన వైనం ఆడియన్స్ మైండ్ లో టెర్రరిస్టనే ముద్ర వేసింది. మణిరత్నం రోజాలో పంకజ్ కపూర్, ఇటీవలే వచ్చిన పఠాన్ లో జాన్ అబ్రాహం ఇంకో రెండు ఉదాహరణలు. వీళ్ళందరూ బలమైన ప్రతినాయకులుగా ఆ పాత్రలను గొప్పగా పండించారు కాబట్టే హీరోలవైపున్న బలహీనతలు కవరైపోయాయి.  కానీ ఏజెంట్ లో డినో మోరియాని తీసుకోవడమే పెద్ద బ్లండర్. విగ్రహం నిండుగా ఉంది కానీ క్రూరత్వం మాట అటుంచి కనీసం బేసిక్ ఎక్స్ ప్రెషన్లు ఇవ్వడంలోనూ అతని బలహీతన పుష్కలం  

ఇలా క్యాస్టింగ్ దగ్గరి నుంచే సురేందర్ రెడ్డి తడబాటు స్పష్టంగా కనిపిస్తుంది. ఇంటర్వెల్ దాకా ఏదో ఎగుడు దిగుడుగా సాగినా కనీసం రెండో సగంలో అయినా వేగం పెరిగి థ్రిల్స్ ఇస్తాడేమో అనుకుంటే అక్కడి నుంచి ఓపికకు అసలు పరీక్ష మొదలవుతుంది. విపరీతమైన మెషీన్ గన్ సౌండ్లతో చెవులు హోరెత్తిపోతాయి. ఎవరు ఎందుకు కాలుస్తున్నారు, ఎందుకు దాడి జరుగుతుంది ఇవన్నీ అర్థం చేసుకునే లోపే ఇంకో ఫైట్ వచ్చేస్తుంది. సామాన్య ప్రేక్షకుల సంగతి కాసేపు పక్కనపెడితే కనీసం ఫ్యాన్స్ కైనా ఇవి గూస్ బంప్స్ ఇవ్వాలి. అదీ జరగలేదు. అఖిల్ ఎంత కష్టపడుతున్నా వట్టిపోయిన సముద్రంలో షిప్పుని ఎంతసేపని లాగిస్తాడు ఇందులో అదే జరిగింది  

టాలీవుడ్ అతి పెద్ద స్టార్ హీరోలతో పనిచేసిన అనుభవమున్న సురేందర్ రెడ్డి నుంచి ఆశించిన అవుట్ ఫుట్ అయితే ఇది కాదు. రెండేళ్లు కష్టపడింది కేవలం విజువల్స్ కోసమా లేక జనాన్ని మెప్పించే కంటెంట్ కోసమా అనే ప్రశ్న వేసుకుంటే మొదటి సమాధానమే రైట్ అనిపిస్తుంది. స్పై బ్యాక్ డ్రాప్ కథలు ఎప్పుడు కమర్షియల్ సూత్రాలకు లొంగిపోకూడదు. ఇది చాలా డేంజర్. హీరోయిన్ తో లవ్ ట్రాక్, రెండు పాటలు, క్లైమాక్స్ కు ముందో ఐటెం సాంగ్, లోకల్ విలన్ ని బెదిరించే సన్నివేశం ఇలా ఫార్ములా ప్రకారం రాసుకుంటే అసలు ఉద్దేశం పక్కదారి పెట్టి ఏదేదో చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ధృవని రేస్ గుర్రంని మిక్స్ చేయబోయిన సూరి మరో కిక్ 2 ఇచ్చారు

నటీనటులు

అఖిల్ తనవంతుగా నూటికి రెండు వందల శాతం కష్టపడ్డాడు. నెరేషన్ లో ఎంత ఎగ్జైట్ అయ్యాడో కానీ సిక్స్ ప్యాక్ చేయడం దగ్గరి నుంచి ఛాలెంజ్ అనిపించే సీన్లు ఛేజులు చేయడం దాకా ప్రతి విషయంలోనూ బెస్ట్ ఇచ్చాడు. హీరోయిన్ సాక్షి రెగులర్ పాట్రన్ లో ఉంది. తనకు పెట్టిన తెలంగాణ స్లాంగ్ కృత్రిమంగా ఉంది. మమ్ముట్టి డెబ్భై దాటిన వయసులోనూ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. గంభీరంగా డైలాగులు చెప్పడం తప్ప యాక్టింగ్ పరంగా పెద్దగా టాస్క్ లేదు. డినో మోరియా బ్యాడ్ ఛాయస్. వరలక్ష్మి శరత్ కుమార్ కి ఇంత మొక్కుబడి పాత్ర బహుశా ఇదే మొదటిసారి. పోసాని, మురళీశర్మ, సత్య లిస్టు పెద్దదే ఉంది దాదాపు అందరూ నామ్ కే వాస్తే బాపతే

సాంకేతిక వర్గం

టెక్నికల్ గా చూసుకుంటే ఏజెంట్ కున్న అతి పెద్ద మైనస్ సంగీతం. ఇటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అటు పాటలు రెండింటిలోనూ హిప్ హాప్ తమిళ తీవ్రంగా నిరాశపరిచాడు. కొన్ని సన్నివేశాలు బీజీఎమ్ వల్ల మైనస్ అయ్యాయి. ధృవకి టెర్రిఫిక్ స్కోర్ ఇచ్చింది ఇతనేనా అనే అనుమానం కల్గుతుంది. రసూల్ ఎల్లోర్ ఛాయాగ్రహణంలో అనుభవం తొణికిసలాడింది. భారీతనాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు. నవీన్ నూలి ఎడిటింగ్ కొంచెం ద్వితీయార్థం మీద ఫోకస్ పెట్టి ఉంటే బాగుండేది. విజయ్ మాస్టర్ – స్టన్ శివ పోరాటాలు బాగానే ఉన్నా వృథా అయ్యాయి. ప్రొడక్షన్ లో అనిల్ సుంకర ఎక్కడా రాజీ పడలేదు. అడిగినమేరకు ఫారిన్ కు తీసుకెళ్లి మరీ ఖర్చు పెట్టారు.

ప్లస్ పాయింట్స్

అఖిల్ నటన  
ప్రొడక్షన్ వేల్యూస్

మైనస్ పాయింట్స్

అరిగిపోయిన కథాకథనాలు
విలన్ పాత్ర
సంగీతం
విసిగించే యాక్షన్ ఎపిసోడ్స్

ఫినిషింగ్ టచ్ : వీక్ ఏజెంట్

రేటింగ్ : 2/5