సమీక్ష – వినరో భాగ్యము విష్ణు కథ

2.5/5

  |   Action   |   18-02-2023


Cast - Kiran Abbavaram, Kashmira Pardeshi, Murali Sharma

Director - Murali Kishor Abburu

Producer - Bunny Vas

Banner - GA2 Pictures

Music - Chaitan Bharadwaj

ఒక్క మంచి హిట్టుతో అమాంతం జాతకం మారిపోయే అరుదైన కుర్ర హీరోలు ఇండస్ట్రీలో చూస్తుంటాం. దానికి టాలెంట్, కష్టం తోడైతే ఆటోమేటిక్ గా బడా సంస్థలు వెంటపడతాయి. కిరణ్ అబ్బవరం ఇప్పుడీ ఊపులోనే ఉన్నాడు. ఎస్ఆర్ కళ్యాణ మండపం ఇచ్చిన సక్సెస్ కిక్ ఈ యూత్ హీరోని వేగంగా సినిమాలు చేసేలా ప్రేరేపించింది. అయితే ఈ స్పీడులోనే గట్టి బ్రేకులు పడ్డాయి. అందుకే చిన్న గ్యాప్ తీసుకుని గీత ఆర్ట్స్ 2 లాంటి పెద్ద బ్యానర్ సపోర్ట్ తో వినరో భాగ్యము విష్ణుకథతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అంచనాలైతే ఉన్నాయి

తిరుపతిలో ఉండే విష్ణు(కిరణ్ అబ్బవరం)ది ఎవరు ఏ సహాయం అడిగినా కాదనకుండా చేసే ఉత్తమపురుష లక్షణం. నైబర్ నెంబర్ కాల్ ద్వారా పరిచయమైన దర్శన(కశ్మీర పరదేశి)తో స్నేహాన్ని ప్రేమగా మార్చుకునే ప్రయత్నంలో ఉంటాడు. వీళ్ళ మధ్య మార్కండేయ శర్మ(మురళి శర్మ)వస్తాడు. అంతా సవ్యంగా ఉందనుకుంటున్న టైంలో ఊహించని షాకింగ్ ఇన్సిడెంట్ వల్ల దర్శన జైలుకు వెళ్లాల్సి వస్తుంది. ఆమెను బయటికి తీసుకొచ్చే బాధ్యత తీసుకున్న విష్ణు ప్రమాదకర వలయంలో చిక్కుంటాడు. ఆ తర్వాత జరిగేదే అసలు కథ

క్రైమ్ చుట్టూ అల్లుకున్న థ్రిల్లర్స్ లో ట్విస్టులు ఎంతగా పండితే ఆడియన్స్ అంతగా మెచ్చుకుంటారు. ఈ అంశంలో ఏ మాత్రం తేడా కొట్టినా అంతే సంగతులు. దర్శకుడు మురళి కృష్ణ అబ్బూరు వెరైటీగా ఉంటుందని మన సెల్ ఫోన్ పక్క నెంబర్ల పరిచయాన్ని నేపథ్యంగా తీసుకున్నాడు. ఇలా ఆలోచించడం మంచిదే. రొటీన్ లవ్ స్టోరీలతో విసిగించడం కన్నా ఇది ఒకరకంగా బెటర్. అయితే కాన్సెప్ట్ అల్లుకున్నంత తేలిగ్గా దాని చుట్టూ కథనాన్ని పూర్తి స్థాయిలో మెప్పించేలా రాసుకోకపోవడం విష్ణుకథలో ప్రధాన మైనస్. ఫస్ట్ హాఫ్ లో ఏదో ఫిల్లింగ్ కోసమన్నట్టు అసలు సబ్జెక్టుకు సంబంధం లేని ఎపిసోడ్లు వస్తుంటాయి పోతుంటాయి. ఏవీ అంతగా రిజిస్టర్ కావు.

ఇంటర్వెల్ మలుపు దగ్గర నుంచే తను చెప్పాలనుకున్నది ఫిక్స్ అవ్వడంతో అప్పటిదాకా జరిగిన ప్రహసనం ఓ మాదిరి టైం పాస్ కూడా చేయించలేక ఇబ్బంది పడుతుంది. హీరో మంచివాడని చెబితే చాలు. పదే పదే ఆ విషయాన్ని రిజిస్టర్ చేయడం కోసం అవసరం లేని సన్నివేశాలను, ఫైట్లను పెట్టాల్సిన అవసరం లేదు. పెన్షన్ ఆఫీస్ దగ్గర ముసలావిడకు సహాయం చేసే పనిలో విష్ణు ఈజీగా గూండాలను చితకబాది ఆమె కొడుకులకు క్లాస్ పీకడం ఎంత బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో బిల్డప్ ఇచ్చినా తేలిపోతుంది. ఏదో మహేష్ బాబో జూనియర్ ఎన్టీఆరో చేస్తే ఒప్పుకుంటారు కానీ ఇప్పుడిప్పుడే పైకొస్తున్న కిరణ్ లాంటి లేత మొహానికి ఇవి అట్టే సూట్ కావు.

లవ్ ట్రాక్ ని ఎంటర్ టైనింగ్ గా రాసుకున్నా పోయేది. అదీ మొక్కుబడిగానే ఉంది. పాజిటివ్ వైబ్రేషన్స్ తెచ్చిన వాసవ సుహాస పాటని హీరో ఇంట్రోకి పెట్టడం కూడా సింక్ అవ్వలేదు. ఇలా మొదటి గంటసేపు అక్కడక్కడే తిరుగుతున్న ఫీలింగ్ వల్ల విష్ణులో ఎలాంటి ప్రత్యేకత కనిపించదు. ఎప్పుడైతే దర్శన కేసులో ఇరుక్కుంటుందో అక్కడి నుంచి స్క్రీన్ ప్లే పరుగులు పెడుతుంది. అది కూడా మొదటి సగంతో పోల్చుకోవడం వల్ల చాలా బెటరనిపిస్తుందే తప్ప వావ్ ఫీలింగ్ డైరెక్టర్ ఇవ్వలేకపోయాడు. అలా అని విసుగూ రాదు. కొన్ని ట్విస్టులు ఊహించేలా సాగితే కొన్ని మాత్రం సాధారణ ప్రేక్షకులు అంత ఈజీగా గెస్ చేసే అవకాశం ఇవ్వలేదు. సో ఇబ్బంది లేదు

హీరో క్యారెక్టరైజేషన్ డెవలప్ చేసే క్రమంలో నిజంగా తనకు ఎలివేషన్లు అవసరమా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అంతే తప్ప స్కోప్ ఉందనో లేదా కిరణ్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారనో పోరాటాలు పెడితే ఎందుకు ఇరికించారనే ఫీలింగ్ కల్గుతుంది. పైగా ఇంత పెద్ద కథలో విలన్ ఉన్నా సరిగా వాడుకోలేకపోవడంతో అతను కాస్తా డమ్మీగా మారిపోయి పక్కనుండే పమ్మి సాయితో లాగించే ప్రయత్నం చేశారు. ప్రతినాయకుడి థ్రెడ్ కృత్రిమంగా మారినప్పుడు హీరో తాలూకు మంచితనం, హీరోయిన్ అనుభవిస్తున్న విషాదం అంతగా ఎక్కవు. విష్ణుకథ ఈ సమస్యను ఎదుర్కొంది. కాకపోతే సీన్లను కాస్త డీసెంట్ గా డిజైన్ చేసుకోవడంతో ఓ మాదిరిగా బండి నడుస్తుంది

లైన్ వినడానికి ఎంత బాగున్నా తెరపై మాత్రం కన్విన్సింగ్ గా లేకపోతే జనం నమ్మరు. సెకండ్ హాఫ్ లో విష్ణు చిక్కుముడులు విప్పే తీరు కొంత మేర ఆసక్తికరంగానే సాగినా లాజిక్స్ ని విస్మరించిన తీరు నమ్మశక్యంగా లేదు. అంతా హీరోకు అనుకూలంగా జరుగుతుందే తప్ప అతని తెలివిని, తెగువని మెచ్చుకునేలా హైప్ ఇచ్చే ట్రాక్స్ మురళి కృష్ణ రాసుకోలేదు. జనతా గ్యారేజ్ టైపు ఫైట్లు పెట్టుకున్నాడు కానీ నాన్నకు ప్రేమతో లాగా ఇంటెలిజెన్స్ తో అబ్బురపరిచే రైటింగ్ ఉంటే విష్ణుకథ నిజంగానే నెక్స్ట్ లెవెల్ లో ఉండేది. సగం భోజనం అయ్యాక సాంబార్ పెరుగు ఎంత రుచిగా ఉన్నా మొదట్లో వడ్డించిన పప్పులో ఉప్పు తగ్గడమే ఎక్కువ హైలైట్ అవుతుంది

కిరణ్ అబ్బవరంకు మంచి ఫ్యూచర్ ఉంది. నటన పరంగా మెల్లగా మెరుగవుతున్నాడు. ఎటొచ్చి తన ఆలోచనా ధోరణే అవసరం లేని మాస్ వైపుకి లాగుతోంది. ఇది తను సీరియస్ గా తీసుకోవాలి. స్టార్ గా ఎదిగాక ఏం చేసినా చెల్లుతుంది కానీ ఏదో ఎస్ఆర్ లో ఎంజాయ్ చేశారు కదాని పదే పదే ఆడియన్స్ వాటినే డిమాండ్ చేస్తున్నారనుకుంటే పొరపాటే. దర్శకులు రాసుకున్నా ఎలివేషన్లకు నో చెప్పాల్సిందే. కశ్మీర పరదేశి జస్ట్ ఓకే. గొప్పగా లేదు చప్పగా లేదు. మురళిశర్మతో కామెడీ చేయించారు కానీ ఓ మాదిరి నవ్వించారు అంతే. ఆర్టిస్టులు ఇంకా ఉన్నారు కానీ తెరమీద ఎక్కువసేపు వీళ్ళు ముగ్గురే కనిపించడంతో మిగిలినవాళ్ళు గుర్తుండరు

చైతన్ భరద్వాజ్ సంగీతం అతని గత చిత్రాల స్థాయిలో లేదు కానీ పాస్ అయ్యింది అంతే. బిజిఎంలో అక్కడక్కడా మోత ఎక్కువయ్యింది. సన్నివేశంలో బలహీనతలను కాపాడే ప్రయత్నం చేశారు కానీ అంతగా నప్పలేదు. డానియల్ విశ్వాస్ ఛాయాగ్రహణం డీసెంట్ గా సాగింది. మార్తాండ్ కె వెంకటేష్ అనుభవం వీలైనంత ల్యాగ్ లేకుండా చూసుకుంది కానీ ఎడిటింగ్ పరంగా ఇంతకన్నా తగ్గించడం కష్టమే. సంభాషణల్లో సందేశాలు ఎక్కువయ్యాయి. నిర్మాణ విలువలు రిస్క్ లేకుండా ఖర్చు పెట్టుకున్నారు

ప్లస్ పాయింట్స్

మెరుగ్గా అనిపించే సెకండాఫ్
కీలక ట్విస్టులు
కథలో కుదిరిన లింకులు

మైనస్ పాయింట్స్

ఫస్ట్ హాఫ్ సాగతీత
హీరో ఎలివేషన్లు
లాజిక్స్ మిస్ చేయడం

ఫినిషింగ్ టచ్ : సగం కథ సగం వ్యథ

రేటింగ్: 2.5/5