సమీక్ష – సార్

2.75/5

2 Hrs 20 Mins   |   Family   |   17-02-2023


Cast - Dhanush, Samyuktha Menon

Director - Venky Atluri

Producer - Naga Vamsi S, Sai Soujanya

Banner - Sithara Entertainments, Fortune Four Cinemas

Music - G. V. Prakash Kumar

సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడిగా కన్నా స్వతహాగా వర్సటైల్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్న ధనుష్ కి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. రఘువరన్ బిటెక్ తర్వాత యూత్ తనకు బాగా కనెక్ట్ అయ్యారు. అయితే తర్వాత వచ్చిన డబ్బింగ్ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో మార్కెట్ తగ్గింది కానీ ఇమేజ్ పరంగా అతనిక్కడ కోల్పోయింది ఏమీ లేదు. అందుకే సార్ కు ముందు రోజు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్లు వేస్తే మంచి అంచనాలతో అన్ని చోట్ల హౌస్ ఫుల్స్ పడ్డాయి. దీన్ని బట్టే క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

బాలగంగాధర్ తిలక్ ఉరఫ్ బాలు(ధనుష్) అందరికీ చదువు అందాలన్న సద్దుదేశం కలవాడు. విద్యను వ్యాపారంగా మార్చుకున్న త్రిపాఠి(సముతిరఖని) నడిపే ప్రైవేట్ కళాశాలలో జూనియర్ లెక్చరర్ గా ఉద్యోగం చేస్తుంటాడు. స్టాఫ్ కొరతతో మూతబడుతున్న ప్రభుత్వ కాలేజీలను స్వార్థ బుద్దితో దత్తత తీసుకున్న త్రిపాఠి సిరిపురంకు బాలుని పంపిస్తాడు. కానీ అక్కడ పిల్లలు ఎప్పుడో చదువు మానేశారని తెలుసుకుని వాళ్ళను మార్చే బాధ్యత తీసుకుంటాడు. అనుకున్నది సాధించే క్రమంలో సవాళ్లు మొదలవుతాయి. అసలైన కథకు పునాది పడేది ఇక్కడే.

ఒక సామజిక సమస్యను తీసుకుని దాన్నో స్టార్ హీరో సహాయంతో కమర్షియలైజ్ చేసి ప్రేక్షకులను మెప్పించవచ్చనేది అర్జున్ జెంటిల్ మెన్ తో శంకర్ పరిచయం చేసిన ఫార్ములా. దాన్ని ఇప్పటిదాకా ఎందరో పాటించారు. విజయాలు సాధించారు. ఫ్లాపులు చూశారు. వెంకీ అట్లూరికి ఆయనే స్ఫూర్తని చెప్పలేం కానీ విసుగొచ్చే విదేశీ లవ్ స్టోరీలతో బోర్ కొట్టించిన ఇతను ఈసారి ఇంతటి బరువైన భావోద్వేగాల సబ్జెక్టుని రాసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. బ్యాక్ డ్రాప్ ని 1999లో జరిగినట్టు చూపించారు కానీ నిజానికి ఇందులో అంశాలు ఇప్పటి పరిస్థితులను సైతం ప్రతిబింబించేలా ఉన్నాయి. సమస్య మూలన్ని చూపించే క్రమం కాలాన్ని బాగా వెనక్కు తీసుకెళ్లారు.

సింపుల్ గా చెప్పాలంటే సర్ సినిమా ఒక మాస్టారు ఒక బ్యాచ్ విద్యార్థులు మధ్య జరిగే ఎమోషనల్ జర్నీ. ఇందులో చాలా సంఘటనలు మనకు దగ్గరగా అనిపిస్తాయి. అరె ఇలాంటి టీచర్ మనకు ఒకరు ఉండేవారు కదాని పది మందిలో ఖచ్చితంగా ఐదుగురనుకుంటారు. అంత రియలిస్టిక్ గా పాత్రలను తీర్చిదిద్దారు. ఉన్నతాశయాలు ఉన్నవాళ్లకు నిజ జీవితంలో ఎలాంటి ప్రతికూలతలు ఎదురవుతాయో రాసుకున్న తీరు బాగుంది. ఇంజనీరింగ్ మెడికల్ తప్ప ఇంకో చదువు వృధా అనేలా విద్యా వ్యవస్థని బిజినెస్ వైపు మలుపు తిప్పిన ఎంసెట్ ని బేస్ గా తీసుకున్న వెంకీ అట్లూరి దానివల్ల మధ్యతరగతి జనాలు ఎలా ఇబ్బంది పడ్డారో చూపించే ప్రయత్నం చేశాడు.

అలా అని ఇది గతంలో ఎన్నడూ చూడనిది కాదు. హృతిక్ రోషన్ సూపర్ 30లో ఇలాంటి పెయిన్ ని జనాలు అనుభూతి చెందారు. దంగల్ లో సగటు పల్లెటూరి మనస్తత్వాలు అమ్మాయిల చదువు పట్ల ఎంత వివక్షగా ఉంటాయో ఆవిష్కరించారు. ఆ కోణంలో చూస్తే వెంకీ అట్లూరి చెప్పిన సార్ స్టోరీలో మరీ వినూత్నంగా చెప్పుకోవడానికి పెద్దగా లేదు. కానీ నిజాయితీ ఉంది. పరిచయమే లేని మనుషుల మధ్య అనుబంధం ఎంత గొప్పగా ఉంటుందో గురు శిష్యుల బాండింగ్ ద్వారా ప్రెజెంట్ చేసిన తీరు కొన్ని సన్నివేశాల్లో హత్తుకునేలా ఉంది. కొంత కంటతడి పెట్టించేలా ఉంది. అయితే ఎంత భావోద్వేగంగా ఉన్నా సార్ అడుగులోనూ తడబాటు జరిగింది.

ఇంటర్వెల్ అయ్యాక బాలుని వెలేశాక జరిగే సంఘటనలను హై డ్రామాతో నడిపించిన వెంకీ ఆ తర్వాత మరో ముప్పాతిక గంటకు సరిపడా బలమైన కంటెంట్ లేకపోవడంతో సిరిపురంలో ఉండే థియేటర్ ను వేదికగా చేసుకుని సినిమాటిక్ లిబర్టీకి కాస్తే ఎక్కువగా వాడేయడంతో అక్కడొచ్చే మలుపుల్లో నాటకీయత కనిపిస్తుంది. ధనుష్ ఎంత సహజ నటుడైనా అతనికి తమిళనాడులో భారీ ఫాలోయింగ్ ఉంది. కమర్షియల్ స్కేల్ లో వాళ్ళను దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి హీరో పాత్ర శారీరకంగా ఎంత బలహీనమైనా సరే ఖచ్చితంగా ఫైట్లు పెట్టాల్సిందే. దాన్ని వెంకీ ఫాలో కాక తప్పలేదు. తప్పూ లేదు. అభిమానుల కోసం ఉద్దేశించినవి కాబట్టి తప్పనలేం

టీచర్ స్టూడెంట్స్ మధ్య ఎమోషన్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టడంతో అవి బాగా పండాయి కానీ కీలకమైన ప్రతినాయకుడి పాత్ర త్రిపాఠి అండర్ ప్లే కావడంతో దాని తాలూకు ఇంపాక్ట్ బలంగా లేకపోయింది. అందుకే అతని చర్యలకు బాలు నుంచి వచ్చే ప్రతిస్పందన జస్ట్ ఓకే అనిపిస్తుందే తప్ప స్పెషల్ గా ఉండదు. బాలుని పిల్లలు విడిచే పరిస్థితి వచ్చినప్పుడు పదే పదే బ్యాక్ గ్రౌండ్ సాంగ్స్ తో నడిపించడం కొంత ల్యాగ్ కు కారణమయ్యింది. హీరోయిన్ తో లవ్ ట్రాక్ పాటలకే తప్ప అంతగా ఉపయోగపడలేదు. సమస్యను చక్కగా చూపించిన వెంకీ దీనికి పరిష్కారం లేదనే పాయింట్ ని కన్విన్సింగ్ గా చెప్పడం వల్ల క్లైమాక్స్ అటు ఇటు ఊగినా ఓకే అనిపిస్తుంది

సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకులు వస్తారు కాబట్టి సార్ లో ఉన్న బరువైన ఎమోషన్ ఎంతవరకు మాస్ కి ఏ మేరకు నచ్చుతుందో చెప్పలేం. ఏదో ఒక దశలో విద్యార్ధిగానో టీచర్ గానో ఆ జీవితం చవిచూసి ఉంటే కనెక్ట్ అవుతుంది కానీ కమర్షియల్ స్కేల్ లో క్లాస్ ఏమో కానీ మాస్ ఎలా రిసీవ్ చేసుకుంటారనే దాన్ని బట్టి బాక్సాఫీస్ ఫలితం ఆధారపడి ఉంటుంది. క్లీన్ గా ఎలాంటి ద్వందార్థాలు, ఆధర చుంబనాలు, మసాలా ఐటెం పాటలు ఇవేవి లేకుండా సీరియస్ ఎంటర్ టైనర్ ఇచ్చే ప్రయత్నం చేసిన వెంకీ అట్లూరికి ప్రశంసలు వస్తాయి. అవే ఆడియన్స్ నుంచి ఆ మెచ్చుకోలు వసూళ్లుగా మారితే ఇది హిట్ క్యాటగిరీలో సులభంగా పడిపోతుంది

ధనుష్ నటన గురించి కొత్తగా చెప్పేదేముంది. తనను వాడుకోవడం దర్శకుల చేతుల్లో ఉంటుంది. అసురన్ లాంటి హైవోల్టేజ్ అయినా మారి లాంటి ఊర మాస్ అయినా ఎప్పుడు బెస్టే వస్తుంది. సార్ లో కూడా చాలా సెటిల్డ్ గా, అవసరం లేని మితిమీరిన ఎక్స్ ప్రెషన్లకు తావివ్వకుండా మెప్పించాడు. సంయుక్త మీనన్ వంకపెట్టడానికి లేదు, అలా అని గొప్పగా చెప్పడానికి లేదు. సముతిరఖనిది అలవాటైన వ్యవహారమే. సాయికుమార్ పర్వాలేదు. హైపర్ ఆదిని కాసేపే వాడుకున్నారు. తనికెళ్ళ భరణి, గుండు రాజేందర్, ఆడుకాలం నరేన్, హరీష్ పేరడీ అందరూ పాత్రలకు తగ్గట్టు ఒదిగిపోయారు. స్కూల్లో పిల్లల సెలక్షన్ భలేగా సెట్ చేసుకున్నారు వెంకీ.

సార్ కు నేపధ్య సంగీతం ప్రాణంగా నిలిచింది. మంచి బీజీఎమ్ స్కోర్ తో సన్నివేశాలను నిలబెట్టారు. పాటలు ఇబ్బంది పెట్టలేదు. అలా అని మళ్ళీ వెంటనే వినాలనిపించేవి కాదు. యువరాజ్ ఛాయాగ్రహణం వంక పెట్టేందుకు అవకాశం ఇవ్వలేదు. పదే పదే రిపీట్ అయ్యే లొకేషన్లలోనే వీలైనంత క్వాలిటీ చూపించేందుకు కష్టపడిన తీరు అవుట్ ఫుట్ కి దోహదపడింది. నవీన్ నూలి ఎడిటింగ్ ఓవరాల్ గా చూసుకుంటే అక్కడక్కడా ల్యాగ్ మీద కొంత ఫోకస్ మిస్ అయ్యింది. ఆర్ట్ వర్క్ లో సహజత్వం ఉంది. సంభాషణలు ఓవర్ గా లేకుండా నీట్ గా తగినంత మోతాదులో ఉన్నాయి. సితార ప్రొడక్షన్ వేల్యూస్ ఎప్పటిలాగే కథకు తగ్గట్టు పెట్టేశారు.

ప్లస్ పాయింట్స్

ధనుష్ నటన
టీచర్ స్టూడెంట్ ఎమోషన్స్
నేపధ్య సంగీతం

మైనస్ పాయింట్స్

సెకండ్ హాఫ్ ల్యాగ్
జీరో ఎంటర్ టైన్మెంట్
విలన్ పాత్ర

ఫినిషింగ్ టచ్ : పరవాలేదు మాస్టారూ

రేటింగ్ : 2.75 / 5