సమీక్ష – మైఖేల్

2.25/5

  |   Action   |   03-02-2023


Cast - Sundeep Kishan, Divyansha Kaushik, Vijay Sethupathi, Varalaxmi Sarathkumar, Varun Sandesh, Anasuya and others

Director - Ranjit Jeyakodi

Producer - Bharath Chowdary, Puskur Ram Mohan Rao

Banner - Karan C Productions. SV Cinemas

Music - Sam CS

ఏళ్ళు గడుస్తున్నా విజయం అందని ద్రాక్షపండులా ఊరిస్తుంటే పట్టువదలని విక్రమార్కుడిలా సందీప్ కిషన్ పడుతున్న కష్టం చూస్తుంటే ఎవరికైనా అతనికో హిట్టు వస్తే బాగుంటుందనిపిస్తుంది. అయితే కాలం తనతో ఆటలాడుతూనే వచ్చింది. ఇన్నేళ్లకు ట్రైలర్ తోనే ఒకరమైన పాజిటివ్ ఇచ్చిన మూవీగా మైఖేల్ కు మంచి ప్రచారమే దక్కింది. పోస్టర్లు, ప్రమోషన్లతో పాటు గ్రాండ్ గా కనిపిస్తున్న క్యాస్టింగ్ వల్ల అంచనాలు మెల్లగా పెరుగుతూ వెళ్లాయి. పోటీలో ఉన్న వాటిలో రైటర్ పద్మభూషణ్ ఫ్యామిలీస్ ని టార్గెట్ చేయగా మైఖేల్ యూత్ అండ్ మాస్ ని లక్ష్యంగా పెట్టుకున్నాడు. పెద్ద బ్యానర్లు, మంచి టెక్నికల్ టీమ్ వెరసి ఈ ప్యాన్ ఇండియా మూవీ ఎలా ఉందో

ఇది 90 దశకంలో జరిగే కథ. చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్న మైఖేల్(సందీప్ కిషన్) ముంబైని వణికిస్తున్న అండర్ వరల్డ్ డాన్ గురునాధ్ (గౌతమ్ వాసుదేవ్ మీనన్) పంచన చేరతాడు. అతని స్వంత కొడుకు అమర్ నాధ్(వరుణ్ సందేశ్)కంటే ఎక్కువ నమ్మకాన్ని సంపాదించుకుంటాడు. ఓసారి గురునాధ్ మీద దాడి చేసిన వాళ్లలో ఒకడు ఢిల్లీలో ఉన్నాడని తెలుసుకున్న మైఖేల్ కి అక్కడ తీరా (దివ్యంషా కౌశిక్) పరిచయమవుతుంది. ఆ తర్వాత ఇద్దరూ ప్రమాదంలో పడతారు. ఆపై జరిగేది తెరమీద చూడాల్సిందే

యాక్షన్ థ్రిల్లర్స్ బాగా ఆడుతున్న ట్రెండ్ ఇది. కాదనలేం. దాన్ని ఫాలో అవ్వాల్సిందే. ఆలా అని గుడ్డిగా కథా కథనాల విషయంలో తగినంత కసరత్తు చేయకపోతే తెర మీద తేడాలొచ్చేస్తాయి. దర్శకుడు రంజిత్ జెకోడి మీద మాఫియా క్లాసిక్స్ ప్రభావం చాలా తీవ్రంగా ఉన్న విషయం మొదటి ఫ్రేమ్ నుంచే అర్థమవుతుంది. ప్రతి సీన్ గతంలో చూసిన ఫీలింగే కలిగిస్తుంది. అసలు సినిమా ప్రారంభమే అయ్యప్ప పి శర్మతో హీరో క్యారెక్టర్ ని గొప్పగా వర్ణించడంతో స్టార్ట్ చేస్తారు. దీంతో సహజంగానే కెజిఎఫ్ లో అనంత్ నాగ్, ప్రకాష్ రాజ్ లు రాఖీ భాయ్ గురించి ఎలా అయితే చెప్పారో అదే స్థాయిలో ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేసి దానికి తగ్గట్టే ప్రిపేర్ అవుతాం

కానీ ఆ ఆనందం కొంతసేపే. స్టయిలిష్ టేకింగ్ తో మొదలుపెట్టిన రంజిత్ మైఖేల్ కథను అన్ని మిక్స్ చేసిన ఫ్రూట్ జ్యూస్ తరహాలో రాసుకున్నాడు. మణిరత్నం నాయకుడులో కమల్ హాసన్ కు ప్రమాదం జరిగాక మంచం మీద కూర్చున్న ఫ్రేమ్, కొడుకు చనిపోయి అంత్యక్రియలు పూర్తయ్యాక కారుకి దూరంగా లాంగ్ షాట్ లో నిలుచున్న సీన్లు యధాతథంగా గౌతమ్ మీనన్ మీద వాడేశాడు. ఆ బ్లాక్ బస్టర్ చూడని ఇప్పటి జనేరేషన్ కు నచ్చుతుందని అలా చేశాడేమో కానీ ఇంపాక్ట్ మాత్రం అందులో పావు వంతు కూడా రాలేదు. అసలు అంత పెద్ద నగరాన్ని వణికించిన క్రూయల్ డాన్ గా గౌతమ్ మీననే సరైన ఛాయస్ కానప్పుడు ఇంక ప్రభావాన్ని ఎలా ఆశిస్తాం

ప్రతి పది నిమిషాలకోసారి సాంకేతిక బృందాన్ని మెచ్చుకోవాలనిపించే సీన్ వస్తూనే ఉంటుంది. కానీ వాటిలో సరైన జీవమే ఉండదు. సినిమాటోగ్రాఫర్ ఎంత గొప్ప పనితనం చూపించినా దాన్ని మిన్నగా వాడుకునే స్థాయిలో జయంత్ రాత లేకపోయింది. అసలు మైఖేల్ అంత రూత్ లెస్ క్రిమినల్ అయినప్పుడు ఏదో పోగొట్టుకున్నవాడిలా దాదాపు గంట దాకా సరైన డైలాగు ఎందుకు పెట్టలేదో అర్థం కాదు. పైగా సందీప్ కిషన్ లాంటి యూత్ హీరోతో ఇంత హై ప్రొఫైల్ నేరస్థుడి బయోపిక్ ని తెరకెక్కిస్తున్నప్పుడు కేవలం సంభాషణలతో ఎలివేషన్లు ఇస్తే సరిపోదు. దాని తగ్గ విజువల్ కన్విక్షన్ బలంగా ఉండాలి. జయంత్ ఈ విషయంలో బాగా తడబడ్డాడు.

ఒకరకంగా చెప్పాలంటే పంజా, మున్నా, ప్రస్థానం, విక్రమ్, కెజిఎఫ్ ల కలబోతగా ఈ మైఖేల్ అనిపిస్తే అది న్యాయమే. మైఖేల్ కి మదర్ సెంటిమెంట్ పెట్టడం ఓకే కానీ కనీసం దాన్ని ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా కొంచెం డిఫరెంట్ రాసుకుని ఉంటే బాగుండేది. కానీ దీనికి రెగ్యులర్ టెంప్లేట్ ఫాలో కావడంతో క్లైమాక్స్ లో ఇచ్చే ట్విస్టు కూడా ఏమంత కిక్ ఇవ్వదు. పాత్రలన్నీ పేలవంగా ప్రవర్తిస్తుంటే ఎంత బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో నిలబెట్టాలని చూసినా పూర్తి స్థాయిలో సఫలీకృతం కాలేకపోయారు. పైగా అవసరం లేని చోట కూడా హీరోని విపరీతంగా పొగిడేస్తూ ఎందుకు అంత బిల్డప్ ఇస్తూ పోయారో అర్థం కాదు. దీంతో అక్కర్లేని లాజిక్స్ సైతం హైలైట్ అయ్యాయి

రంజిత్ జెకోడిలో టేకింగ్ పరంగా మంచి కంటెంట్ ఉంది. కానీ తనను తాను అప్డేట్ చేసుకోలేకపోయాడో లేక ఇటీవలే సక్సెస్ అయినవాటిని కలబోతగా వండేస్తే ఏ విక్రమ్ లాగో బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్మకమో కానీ మొత్తానికి యావరేజ్ మైలురాయికి సైతం అడుగు దూరంలో నిలిచిపోయింది. విజయ్ సేతుపతి ఎపిసోడ్ సరిగా సింక్ అవ్వలేదు. చివర్లో అన్ని క్యారెక్టర్లకు మధ్య కనెక్షన్ ని స్పష్టంగా చూపించారు కానీ అప్పటికే ఆవహించిన నీరసం వాటి మీద ఆసక్తి తగ్గించేలా చేసింది. ప్రతి మలుపు ఊహించేలా సాగడం ఒక మైనస్ అయితే దానికి ల్యాగ్ తోడవ్వడం లెన్త్ ని పెంచేసింది. ఫైనల్ గా కొత్తగా ఏముందన్న ప్రశ్నకు మైఖేల్ దగ్గర బదులు లేదు

సందీప్ కిషన్ ఎంత ఎఫర్ట్ పెట్టినా కానీ మైఖేల్ తన స్థాయికి మించిన చాలా పెద్ద పాత్ర. బరువును మోయలేకపోయాడు. దానికి తోడు ఎలివేషన్లు ఓవరై తను వీక్ గా కనిపించాడు. విక్రమ్ లో కమల్ రేంజ్ హంగామా చేశారు కానీ అందులో ఫహద్ ఫాసిల్ అంత స్కోప్ కూడా దక్కలేదు. దివ్యంషా కౌశిక్ లుక్స్ ఓకే కానీ యాక్టింగ్ వీకే. విజయ్ సేతుపతి, వరలక్ష్మి శరత్ కుమార్, అనసూయలను సరిగా వాడుకోలేదు. వరుణ్ సందేశ్ ని ఎవరు రికమండ్ చేసారో వాళ్లకు వీరతాళ్ళు వేయాలి. గౌతమ్ మీనన్ బాగానే చేసినా తనకన్నా మొహంలో ఇంటెన్సిటీ బలంగా చూపించే యాక్టర్ అయితే గురునాధ్ ప్రభావం బలంగా ఉండేది. మ్యాటర్ వీక్ ఉన్నప్పుడు వీళ్ళని ఏమనలేం

సామ్ సిఎస్ నేపధ్య సంగీతంలో అక్కడక్కడా సౌండ్ బాగుంది. పాటలు అనవసరంగా పడ్డాయి. తీసేసినా నష్టం లేదు. కిరణ్ కౌశిక్ ఛాయాగ్రహణం ఇది అతని డెబ్యూలా అనిపించలేదు. చాలా హోమ్ వర్క్ చేసి మంచి ఫ్రేమ్స్ ఇచ్చి దర్శకుడి ఆలోచనల కంటే ఒక మెట్టు పైనే అవుట్ ఫుట్ ఇచ్చాడు. సత్యనారాయణన్ ఎడిటింగ్ ఎందుకు మొహమాటపడిందో అంతు చిక్కదు. డబ్బింగ్ సంభాషణల్లో గ్రాంథికం టచ్ ఎక్కువైపోయి మాస్ కి సరిగా అర్థం కానట్టు సాగాయి. పోరాట దృశ్యాలు బాగానే వచ్చాయి. ఈ మాత్రం సెటప్ కి 1990 బ్యాక్ డ్రాప్ అవసరమే లేదు. అయినా నిర్మాతలు వెనుకాడకుండా ఉన్నంతలో ఆ వాతావరణం కోసం బాగా ఖర్చు పెట్టారు

ప్లస్ పాయింట్స్

సాంకేతిక వర్గం
కెమెరా వర్క్
కొంత యాక్షన్ పార్ట్

మైనస్ పాయింట్స్

రాంగ్ క్యాస్టింగ్
ఎన్నోసార్లు చూసిన కథే
నిడివి
క్యారెక్టరైజేషన్ లోపాలు

ఫినిషింగ్ టచ్ – సారీ మైఖేల్

రేటింగ్ : 2.25 / 5