1.75/5
2 Hr 14 mins | Fun & Thrill | 04-11-2022
Cast - Santosh Shoban, Faria Abdullah, Brahmaji, Sudarshan
Director - Merlapaka Gandhi
Producer - Venkat Boyanapalli
Banner - Aamuktha Creations
Music - Praveen Lakkaraju, Ram Miriyala
దున్నపోతు ఈనందంటే దూడను కట్టేద్దాం అని పాట ఒకటి వుంది. టైటిల్ దొరికింది. లైన్ దొరికింది సినిమా చుట్టేద్దాం అని అనుకుంటే ఈవారం విడుదలైన లైక్..షేర్..సబ్ స్క్రయిబ్ లాంటి సినిమాలు వస్తాయి.
యూ ట్యూబ్ బ్లాగర్ల ను మెయిన్ లీడ్ క్యారెక్టర్లుగా తీసుకుని సినిమా చేస్తే ఎలా వుంటుంది అన్న ఓ ఐడియా. ఇద్దరు వేరు వేరు బ్లాగర్లు..ఒకే చోటకు యూ ట్యూబ్ విడియోలు చేయానికి వచ్చారు. ఇద్దరి మధ్య ప్రేమ సెట్ చేసాం. హీరోకి తోడుగా ఓ కమెడియన్ ను పెడదాం. అనుకోకుండా ఈ బృందం ఓ ఆపదలో చిక్కుకుంది. దాని నుంచి ఎలా బయటపడ్డారు. ఇది సరిపోతుంది కదా అనుకుని రంగంలోకి దిగిపోయినట్లుంది దర్శకుడు మేర్లపాక గాంధీ.
ఆ తరువాత హీరో..హీరోయిన్ బృందానికి వచ్చే ఇబ్బంది మామూలుగా వుండకూడదు..అనుకున్నాడేమో..దానికి నక్సలైట్ల శాంతి చర్చల నుంచి ఎన్ కౌంటర్ల మీదుగా, కూంబింగ్ ఆపరేషన్ల వరకు ముడేసారు. తను ఓ అద్భుతమైన కథ అల్లుతున్నాననే భ్రమలో సాగిపోయారు కానీ ఆ కథ అతుకుల బొంత లా మారుతోందని, అస్సలు సెట్ కాని రెండు వేరు వేరు వ్యవహారాలను తాను ముడేస్తున్నానని దర్శకుడు అస్సలు అనుకోలేదు. పైగా ఫన్ కు అతుకు వేయాలనుకున్న సీరియస్ వ్యవహారాన్ని పైపైన టచ్ చేసుకుంటూ వెళ్లాలి అన్న సంగతి మరిచిపోయారు. దాంతో అస్సలు రుచికరంగా రాని కిచిడిలాంటి పదార్థంలా తయారైంది సినిమా.
విప్లవ్ (సంతోష్) ఓ యూ ట్యూబ్ విడియో బ్లాగర్. అలాగే వసుధ (ఫరియా) కూడా డిటో డిటో. ఇద్దరు వేరు వేరుగా అరకు వస్తారు. అక్కడ ఒకరికి ఒకరు పరిచయం అవుతారు. ఇక్కడ ఇంకో పారలల్ స్టోరీ వుంది. నక్సలైట్లను శాంతి చర్చలకు పిలుస్తుంది ప్రభుత్వం. అలా వచ్చిన ముగ్గురు నక్సల్ నేతలు వెనక్కు వెళ్లే క్రమంలో మాయం అవుతారు. దీనికి డిజిపినే కారణం అతగాడిని హత్య చేసే ప్రయత్నాలు మొదలవుతాయి. గమ్మత్తేమిటంటే సదరు డిజిపి కూతురు వసుధ. అలాగే నక్సల్స్ కి ప్రభుత్వానికి మధ్య వారథిలా వుండే రాజు (బెనర్జీ) కొడుకే హీరో విప్లవ్. ఇటు విడియోల మేకింగ్ ఫన్. అటు నక్సల్స్..పోలీసుల మధ్య వ్యవహారాలు. ఈ రెండింటితో అల్లిన కథే సినిమా.
దర్ళకుడు మేర్లపాక గాంధీ ది కామెడీ జానర్. ఆ దిశగా కథ తయారు చేసుకుని వుండాల్సింది. దాని లైట్ గా థ్రిల్లర్ టచ్ ఇచ్చి వుంటే సరిపోయేది. కాడీ తన దైన కామెడీ టైమింగ్ ను చాలా వరకు మిస్ అయ్యారు. సుదర్శన్..బ్రహ్మాజీ లాంటి కామెడీ టైమింగ్ తెలిసిన నటులు కాబట్టి ఆ మాత్రం కామెడీ పండింది. లేదూ అంటే అది కూడా వుండేది కాదు. హీరో కు టైమింగ్..నటన ఓకె. కానీ పాపం, ఆ హీరొయిన్ కు అదీ తక్కువే. దాంతో ఏ ఎక్స్ ప్రెషన్ చూసినా ఆర్టిఫిషియల్ గా వుంటుంది.
సినిమా రెండు విధాల ఫెయిల్ అయింది. ఒకటి రెండు వేరు వేరు జానర్లను మిక్స్ చేయడంలో. రెండు సరైన స్క్రిప్ట్ తయారు చేసుకోవడంలో. సినిమా తొలిసగం చూసేసరికి ఓకె, ఏదో ట్రయ్ చేసాడు. ఫరవాలేదు అనిపిస్తుంది. ఎందుకంటే మేర్లపాక గాంధీ లాంటి డైరక్టర్ లెవెల్ కామెడీ సీన్ అయితే ఒక్కటీ లేదు అన్నది నిజం. ఏదో అక్కడక్కడ నవ్వుల పువ్వులు పూసాయి తప్ప విరబూయడం మాత్రం లేదు. బ్రహ్మాజీ వెనుక వున్న ఫన్ నక్సల్స్ బ్యాచ్ వ్యవహారాలు అన్నీ కొత్తగా ఏమీ వుండవు. అంతా పాత వైనమే. అందువల్ల పెద్దగా నవ్వు రమ్మన్నా రాదు. నవ్వించే బాధ్యత అంతా సుదర్ళన్ మీదే పడింది. హీరో నుంచి కూడా కామెడీ రాలలేదు.
తొలిసగం అత్తెసరు మార్కులతో పాస్ అయిపోయాక మలిసగం మొదలవుతుంది. ఇక అక్కడి నుంచి సినిమా మరో టర్న్ తీసుకుని రోడ్ మూవీ టైపులోకి మారుతుంది. ఇక అక్కడి నుంచి సినిమాలో పాత్రలు అడవిలో అటు ఇటు కదలడమే తప్ప కథ మాత్రం కదలదు. దీంతో ప్రేక్షకుడు తల పట్టుకోవాల్సి వస్తుంది. ఒక దశలో సినిమా ఇక ఎప్పుడు అయిపోతుందా అని అనిపించేస్తుంది.
దర్శకుడు మేర్లపాక ఇలాంటి స్క్రిప్ట్ తో ప్రేక్షకులను థియేటర్లో ఎలా కూర్చో పెట్టగలను అని అనుకున్నాడో ఆయనకే తెలియాలి. సినిమాకు డైరక్టర్ ఎంచుకున్న కాస్టింగ్ కూడా సరిగ్గా లేదు. హీరోయిన్ లో చలాకీ తనం లేదు. ఎక్స్ ప్రెషెన్స్ తక్కువ. హీరోయిన్ తండ్రిది కీలకపాత్ర అని తెలిసాక దానికి తగ్గ నటుడిని తీసుకోవాలి కదా? అక్కడా ఫెయిల్ నే.
ఫన్ సినిమాలో తనకు నచ్చినట్లు ఏవో జానపద గీతాలు పెట్టారు. అవి ఏ మాత్రం క్యాచీగా లేవు. లొకేషన్లు ఓకె కనుక సినిమాటోగ్రఫీ ఓకె. కథకు అడ్డం పడే సీన్లు అనేకం వున్నాయి. అవన్నీ కట్ చేయలేరు. స్క్రిప్ట్ లోనే మిక్స్ చేసేసుకున్నారు. అందువల్ల స్క్రిప్ట్ దే తప్పు.
లైక్ చేయాలన్నా..షేర్ కొట్టాలన్నా, సబ్ స్క్రయిబ్ గంట మోగించాలన్నా ఆ ఛానెల్..అందులో విడియోలు నచ్చాలన్నది కామన్ పాయింట్. అలా నచ్చేలా సినిమా తీయాలన్నది మరింత కామన్ పాయింట్. ఇది వదిలి సినిమా చేసిన మేర్లపాక గాంధీ ని టాలీవుడ్ జనాలు అన్ సబ్ స్క్రయిబ్ చేసేసాలా వున్నారు
ప్లస్ పాయింట్లు
అక్కడక్కడ ఫన్
మైనస్ పాయింట్లు
స్క్రిప్ట్
సెకండాఫ్
ఇంకా..ఇంకా..
ఫినిషింగ్ టచ్: అన్ సబ్ స్క్రయిబ్
Rating: 1.75/5