2.25/5
| Action | 01-07-2022
Cast - Gopichand, Raashi Khanna, Sathya Raj, Rao Ramesh and others
Director - Maruthi
Producer - Bunny Vas
Banner - UV Creations, GA2 Pictures
Music - Jakes Bejoy
దర్శకుడు మారుతి నిర్మాతలు అల్లు అరవింద్..బన్నీ వాస్..యువి వంశీ ఇక హీరో హీరోయిన్లు…గోపీచంద్..రాశీఖన్నా…ఈ ప్రొఫైల్ అంతా జనాలను థియేటర్ కు రప్పించే మూడ్ క్రియేట్ చేయడానికి అని అనుకోవడం లో తప్పు లేదు. కానీ అవి మాత్రమే చాలదు అని కూడా అనుకోవాల్సి వుంటుంది. దర్శకుడు మారుతికి చిన్న లైన్ చాలు, ఫన్ తో చెడుగుడు ఆడేసి, జనాలను థియేటర్లో కూర్చోపెట్టే విద్య దేవుడిచ్చాడు అని నిర్మాత అరవింద్ అనుకుంటే అనుకుని వుండొచ్చు. కానీ దర్శకుడు మారుతి మాత్రం అలా అనేసుకుని ఊరుకోకూడదు. ఎందుకంటే మెగా సినిమాకైనా మామూలు సినిమాకైనా కథ కథనాలు కీలకం. వాటిని వదిలేసి భలే రాసాం కదా..భలే తీసాం కదా అని మురిసిపోతే ఆ సినిమాను ఎవ్వరూ కాపాడలేరు. ఇదంతా ఈవారం విడుదలయిన పక్కా కమర్షియల్ సినిమా ముచ్చటే.
టైటిల్..కాంబినేషన్..మారుతి మీద వున్న మినిమమ్ హోప్ అన్నీ కలిసి థియేటర్లో కూర్చోపెడితే, అయ్యో అనుకోవడం తప్పించి మరో మాట వుండదు. ఆ కథేంటో? ఆ వ్యవహారం ఏంటో? ఆ అతుకుల స్క్రీన్ ప్లే ఏంటో? థర్డ్ గ్రేడ్ కామెడీ డైలాగులు ఏంటో? రావు రమేష్, రాశీఖన్నాల ఓవర్ యాక్షన్ ఏంటో? అన్నీ చూసి తలపట్టుకోవాల్సిందే.
పక్కా కమర్షియల్ సినిమా చాలా సీరియస్ నోట్ తో ప్రారంభం అవుతుంది. సాక్ష్యాలు లేకపోవడంతో, ఓ నేరస్థుడిని (రావు రమేష్) వదిలేయాల్సి వస్తుంది న్యాయమూర్తి సూర్యనారాయణ (సత్యరాజ్)కు. దాంతో ఓ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటుంది. మనస్థాపానికి గురైన న్యాయమూర్తి ఉద్యోగం వదిలేసి కిరాణా కొట్టు పెట్టుకుంటాడు. కొడుకు లక్కీ (గోపీచంద్) న్యాయవాది అవుతాడు. కానీ అడ్డదారిలో డబ్బు సంపాదిస్తుంటాడు. క్రిమినల్స్ కు సాయం చేస్తుంటాడు. ఇదంతా తండ్రికి తెలియకుండా జాగ్రత్త పడుతుంటాడు. సీరియల్స్ నటించే ఝాన్సీ (రాశీఖన్నా) అతగాడి జూనియర్. అమెదంతా అదో వ్యవహారం. ఇలాంటి నేపథ్యంలో విలన్ వివేక్ (రావు రమేష్) తో చేతులు కలుపుతాడు లక్కీ. తండ్రికి అది నచ్చక, కొడుకునే కోర్టుకు లాగుతాడు. అప్పుడేం జరిగింది అన్నది మిగిలిన కథ.
నిజానికి మారుతి లాంటి డైరక్టర్ కు ఈ మాత్రం కథ చాలు. ఫన్ పుట్టించడానికి. అసలు స్క్రిప్ట్ నే గాడి తన్నేసింది. ప్రాపర్ గా కథను తయారు చేసుకోలేకపోయారు. హీరో క్యారెక్టర్ కు బ్యాక్ గ్రవుండ్ లో రివెంజ్ ఫార్ములాను మిక్స్ చేయడం వరకు ఓకె. కానీ అన్ని పాత్రలు కలిపి రాసుకునే సీన్లను సరిగ్గా సింక్ చేయలేకపోయారు. పైగా లౌడ్ కామెడీని నమ్ముకున్నారు. రాశీఖన్నా-సప్తగిరి-హర్షల ఫన్ టూ లౌడ్ సాగడమే కాదు, మెయిన్ లైన్ లో మిక్స్ కాలేదు. రాశీఖన్నా పాత్ర ఫన్ జనరేట్ చేస్తుంది అనుకుంటే అది కాస్తా ఇరిటేట్ చేసింది. అసలు ఆ పాత్ర ఏమిటో? ఎటు వెళ్తుందో? తెలియదు. రావు రమేష్ ను అజయ్ ఘోష్ ను కలిపి ఫన్ చేయించాలని చూసారు కానీ అది అక్కడక్కడ వర్కవుట్ అయింది. అది కూడా సి క్లాస్ ఫన్ టెస్ట్ వున్నవారికే.
తొలిసగం కాస్త భరించగలిగితే ఓకె చల్తా అనిపిస్తుంది. ఇంట్రర్వెల్ బ్యాంగ్ విషయం తక్కువ, ఎలివేషన్ ఎక్కువ అన్నట్లు వుంటుంది. తండ్రీ కొడుకుల మధ్య సంవాదం సరిగ్గా పండలేదు. విశ్రాంతి తరువాత బండి బాగా గాడి తప్పేసింది. సత్యరాజ్ మీద పాట మరీ దారుణం. రావు రమేష్ మీద ఎపిసోడ్ చుట్టూ కథ తిరగడం ప్రారంభించాక కాస్త కుదుటపడినట్లు అనిపించినా, మళ్లీ ప్రీ క్లయిమాక్స్, క్లయిమాక్స్, కొనసాగింపు క్లయిమాక్స్ ల్లో ఏదోదో కళ్ల ముందు జరిగిపోయి సినిమా అయిపోయింది అనిపించేసింది.
దర్శకుడు మారుతి తీసిన భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, ప్రతి రోజూ పండగే సినిమాలు గుర్తుకు వస్తే ఈ సినిమా చూసాక అయ్యో అనిపిస్తుంది. ఇంకా ఈ రోజుల్లో, బస్టాప్ కాలం నాటి డబుల్ మీనింగ్ డైలాగులు వదలలేదా అనిపిస్తుంది. ప్రభాస్, చిరంజీవి లను డైరెక్ట్ చేసే లెవెల్ కు వెళ్లినా, లోపల ఒరిజినల్ అలాగే వుందా అనిపిస్తుంది. ‘వంగోపెట్టి…’ ‘టీలో మించిన బిస్కట్’ ‘ఎన్ని క్రేన్ లు పెట్టినా లేవదు’..’నేను ఏ గేదెను ఎక్కితే దాన్నే ఎక్కేవాడు’ ఇలాంటి బూతు ముత్యాలు చాలా వున్నాయి. పోనీ వీటితో బి సి సెంటర్లలో గట్టెక్కేస్తారా? అనుకుంటే కథ, కథనాలు దానికి అడ్డం పడతాయి.
అసలు గోపీచంద్ పాత్రకు కానీ, రాశీఖన్నా పాత్రకు కానీ ఓ లైనూ లెంగ్తూ వుండవు. గోపీచంద్ కనీసం ఓకె అనిపించుకుంటాడు కానీ రాశీఖన్నా పాత్ర వచ్చినపుడల్లా జనం బుర్ర పట్టుకోవాల్సిందే. గోపీచంద్ ను కావాలని స్టయిల్ గా చూపించాలని, స్టయిల్ గా ఫైట్లు చేయించాలని చూసారు కానీ అది కూడా ఆర్టిఫిషియల్ గానే వుంది. కోర్టులో సప్తగిరి చేసిన అరాచకం ఇంతా అంతా కాదు. లౌడ్ కామెడీ కొన్ని సినిమాల్లో వర్కవుట్ అయింది అంటే డైలాగ్ ఫన్ కూడా జోడయింది. ఇక్కడ గోల తప్ప మరేం లేదు. సత్యరాజ్ క్యారెక్టర్ కు డెప్త్ ఇవ్వడం అన్నది ఫోర్స్ డ్ గా వుంది. సినిమా నిండా ఎక్కడిక్కడ తనపై తాను సెటైర్లు వేసుకోవడం చిత్రంగా వుంది. ‘మనం ఎంత ఎలివేషన్ ఇచ్చినా వాళ్లు ‘పోసుకునే దగ్గర’ మాట్లాడుకునేది మాట్లాడుకుంటారు.
సరైన మారుతి మార్కు డైలాగులు లేవు. పాటల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచింది. సినిమా రంగంలో హత్యలు వుండవు. ఆత్మహత్యలే తప్ప. ఈ సినిమా విషయంలో మారుతిదే తప్పిదం అంతా. ఏదో లైన్ దొరికింది. దాన్ని పట్టుకుని నాలుగైదు పాత్రలను తయారు చేసి, సినిమా చుట్టేసాను అనుకుంటే సరిపోదు. పూర్తిగా సోల్ వచ్చేవరకు కథ, కథనాలను ఫైన్ ట్యూన్ చేయాల్సి వుంది. అదే జరగలేదు. అందువల్ల ఈ సినిమా ఫలితం మారుతి స్వయంకృతాపరాధం తప్ప వేరు కాదు.
ప్లస్ పాయింట్లు
అక్కడక్కడ సి క్లాస్ ఫన్
మైనస్ పాయింట్లు
వీక్ స్ఖ్రిప్ట్
చీప్ డైలాగులు
సాంగ్స్
ఫినిషింగ్ టచ్: పక్కా ఫెయిల్యూర్
Rating: 2.25/5