సినిమాను ఏ విధంగా చూడాలి..లేదా సమీక్షించాలి…అనే మీమాంస ఎప్పుడూ సమీక్షకులను వెన్నాడుతూనే వుంటుంది. కమర్షియల్ మీటర్లు, కొలమానాలు పట్టుకుని, తూనికలు, కొలతలు వేయాలా? లేక తీసిన సినిమా అవుట్ పుట్ బాగుందా లేదా? మంచి సినిమాగా మారిందా? లేదా? అన్న అనుమానం కూడా భుజం తడుతూనే వుంటుంది. ఎందుకంటే జనం నచ్చి, మంచి సినిమాగా పేరు తెచ్చుకున్నవి కొన్నే వుంటాయి. మంచి సినిమాలు అనుకున్నా జనం పక్కన పెట్టినవి, జనం చూసినా మంచి సినిమా అనిపించుకోనివి వుండనే వుంటాయి. ఇప్పుడు ఈ మీమాంస అంతా ఎందుకు అంటెే విరాటపర్వం సినిమా విడుదలయింది. నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో ఓ యదార్థ సంఘటన ఆధారంగా తీసిన సినిమా ఇది.
ముందుగా ఈ సినిమాను అవుట్ పుట్ ఆధారంగా ఓ లుక్ వేద్దాం. సినిమా ఓ మంచి కవిత్వం మాదిరిగా వుంటుంది. కవిత్వానికి ఎగుడు దిగుడులు, ట్విస్ట్ లు, రంగుల అద్దకాలూ వుండవు. విరాటపర్వం కూడా అలాంటిదే. వెన్నెల అనే అమ్మాయి స్వచ్ఛమైన ప్రేమ కథ. పిచ్చిగా ప్రేమించిన కథ. ఓ విప్లవ కవి కవిత్వం విని, వెదుక్కుంటూ అడవుల్లోకి వెళ్లి, అతని కోసం అతను నమ్మిన మార్గాన్నే తన మార్గంగా చేసుకుని, అనుకోని సంఘటనతో అసువులు బాసిన అమ్మాయి కథ. ఇలా జరుగుతుందా అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే రచయితలను ఆరాధించి ఇళ్లలోంచి వచ్చిన వారు, సంచలనాలు సృష్టించిన సంఘనటలు వుండనే వున్నాయి. సినిమాలో వెన్నెల నోట చెప్పించినట్లే..ప్రేమ ఎందుకు పుడుతుందో ఎవరూ చెప్పగలరు. దీన్నే త్రివిక్రమ్ కూడా గతంలో ఓ సినిమాలో ఇంకోలా చెప్పాడు. ‘ప్రేమ ఫలానా టైమ్ కు పుడుతుంది అని తెలిస్తే ఆ టైమ్ కు అమ్మాయి గడప దాటకుండా వుండెచ్చేమో’ అనేలా. సో..అందువల్ల కథ ఇలా ఎందుకు రాసుకున్నారు అని అడగడానికి లేదు. ఇక మిగిలింది అవుట్ పుట్ ఎలా వచ్చింది అన్నది చూడడమే.
దర్శకుడు వేణు ఉడుగుల తెలివిగా స్క్రీన్ ప్లే రాసుకున్నారు. సాయిపల్లవి హీరోయిన్ కనుక ఫ్యామిలీలు, మహిళా ఆడియన్స్ రావాలి అంటే భయంకరమైన పోలీస్ హింస వైపు, ఆ కోణం వైపు తొంగి చూడకూడదని డిసైడ్ అయ్యాడు. నామమాత్రంగానే పోలీస్ హింసను చూపించాడు. బహుశా సెన్సారు ను కూడా దృష్టిలో పెట్టుకుని వుండొచ్చు. అదే సమయంలో ఈ జనరేషన్ కు నచ్చే విధంగా యాక్షన్ సీన్లు డిజైన్ చేసుకున్నారు. పోలీసులకు..నక్సలైట్లకు మధ్య కాల్పులే కావచ్చు. ఏమైనా యాక్షన్ అంటే చాలా ఈ జనరేషన్ కు నచ్చుతాయన్న ఆలోచన కావచ్చు.
అయితే దర్శకుడు వెన్నెల పుట్టుక దగ్గర నుంచి చావు వరకు ఓ కవిత్వం మాదిరిగా కథను స్క్రీన్ మీద ఆవిష్కరించాలని అనుకోవడం వరకు ఓకె. కానీ ముగింపు ను దృష్టిలో వుంచుకుని, మారుతున్న, మారిపోయిన ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో వుంచుకుని రివర్స్ స్క్రీన్ ప్లే వాడి వుంటే అది వేరుగా వుండేది. ఎందుకంటే వెన్నెల మంచి పిల్ల అనే విషయాన్ని మొదటి రీల్ నుంచీ డెవలప్ చేసుకుంటూ వచ్చిన తరువాత ప్రేక్షకుడికి ఆమె మీద అనుమానం రాదు. కానీ దర్శకుడు స్క్రీన్ ప్లేలో రవన్న..వెన్నెల కలిసినపుడల్లా పోలీస్ లు ఎంట్రీ ఇచ్చేలా స్క్రీన్ ప్లే రాసుకున్నదే ఆమె మీద అనుమానం బిల్డప్ కావడానికి. రవన్న బృందం ఇది డిస్కస్ చేస్తుంటే ప్రేక్షకుడిలో అయితే అదే అనుమానం బలపడాలి లేదా వెన్నెల మీద సింపతీ రావాలి. ఇక్కడ రెండూ రాలేదు. దానివల్ల సినిమా ముగింపు వున్నట్లుండి ఊడిపడినట్లు కూడా అనిపిస్తుంది. నిజానికి సినిమాకు ఈ తరహా స్క్రీన్ ప్లేనే మైనస్ అనిపిస్తుంది. అలాగే సినిమాలో విషయం కన్నా వివరణే ఎక్కువగా వుంటుంది.
పైగా ఓ కాగితం ముక్క మీద నాలుగు వాక్యాలు చూసి అనుమానించి ప్రాణం తీసేయడం, మళ్లీ అలాంటిదే మరో కాగితం ముక్క చూసి అయ్యో అనుకోవడం, వెన్నెల రాసుకున్న డైరీ నీళ్లలో పడిపోవడం వంటి సినిమాటిక్ సంగతులు ఇలాంటి పొయిటిక్ నెరేషన్ లో ఇమడవు. ఈ ఒక్క విషయం తప్పిస్తే దర్శకుడి పనికి వంక పెట్టడానికి లేదు. సినిమా ప్రారంభంలో కొంత వరకు సున్నితంగా సినిమాను చెక్కే ప్రయత్నం చేసినా, తరువాత వేగంగానే నడిపించాడు. అక్కడక్కడ నక్సలిజం మూల సిద్దాంతాలను ప్రశ్నించే ధైర్యం చేసాడు. నక్సలిజం నేపథ్యంలో మీరాబాయి లాంటి అమలిన ప్రేమ కథను చెప్పడం కాస్త వైవిధ్యమైన ఆలోచనే.
దర్శకుడు ఇటు సంగీత దర్శకుడు (సురేష్ బొబ్బిలి) నుంచి అటు సినిమాటోగ్రాఫర్ డానీ నుంచి రాబట్టి అవుట్ పుట్ చాలా బాగుంది. సినిమాను సంగీత దర్శకుడే ఎక్కువ నిలబెట్టాడు. లోకెేషన్లు…వాటిని కెమేరా ఒడిసిపట్టిన తీరు కూడా ప్రశంసనీయమే.
నటీనటులుగా రానా, సాయిపల్లవి బాగా చేసారు అని చెప్పి ఊరుకుంటే తప్పే. సాయి పల్లవి తనలోకి వెన్నెలను ఆవాహన చేసుకుంది. ఆమె చూపులతోనే నటించేసింది. ఓ సన్నివేశంలో మొహం చూపించకుండా భుజాలు ఛాతీ అదరడం వంటి చిన్న చిన్న గమకాలతో రానా అద్భుతమైన నటన ప్రదర్శించాడు. ప్రతి పాత్రలో నటుడూ ఆ పాత్రకు ఫిట్ అన్నట్లు చేసారు.
ఇక ఇప్పుడు సినిమాకు అసలు పరమార్థమైన కమర్షియాలిటీ యాంగిల్ లో చూస్తే… సాయిపల్లవి అంటే పాటలు..డ్యాన్స్ లు…అల్లరి..అభినయం. కానీ ఈ సినిమాలో అభినయానికి తప్ప మరి దేనికీ చోటు లేదు. ఎంత హార్డ్ కోర్ అభిమానులైనా సాయిపల్లవి కోసం రావాలనుకుంటే ఈ మైనస్ లు మూడూ అడ్డం పడతాయి. నక్సలిజం బ్యాక్ డ్రాప్ అన్నది ఇప్పుడు ముఫై లు, నలభైల్లో వున్నవారికి పట్టుకునేది కాదు. అదో సమస్య. వెన్నెలకు రాసుకున్న డైలాగులు పూర్తిగా పొయిటిక్ టచ్ నే. ‘అట్లుంటది మనతోని..’ అనే ఆటిట్యూడ్ డైలాగులు విని ఎంజాయ్ చేసే వారికి..’నా ఆత్మ శరీరాన్ని వీడిపోతోందని తెలుస్తోంది. నా ఊపిరిని తిరిగి తెచ్చుకోవాలని వుంది..’ లాంటి డైలాగులు పడతాయా? అన్నది మరో అనుమానం. తండ్రి నోట పద్యం వింటూ అడవి బాట పట్టే అమ్మాయి ని చూస్తూ, ఆ పద్యం అర్థం, దాన్ని అక్కడ వాడడానికి కారణం ఎవరికి పడుతుంది?
అసలు అన్నింటికీ మించి ‘అమలిన శృంగారం’ అనేది ఎలా అర్థం అవుతుంది? అందువల్ల సినిమా కమర్షియల్ సక్సెస్ అన్నది విడుదలైన తరువాత ప్రేక్షకుల నుంచి వచ్చే రసస్పందన బట్టి వుంటుంది. రసికుడు కానివాడికి కవిత్వం వినిపించే పరిస్థితులున్నాయి ఇప్పుడు. అందువల్ల విరాటపర్వం గొప్పగా ఆడకపోయినా ఆశ్చర్యం లేదు. ఆడితే మాత్రం అద్భుతమే
ప్లస్ పాయింట్లు
సాయి పల్లవి
రానా
బ్యాక్ గ్రవుండ్ స్కోర్
సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్లు
కథా నేపథ్యం
పొయిటిక్ నెరేషన్
ఫినిషింగ్ టచ్: అడవి కాచిన ‘వెన్నెల’
Rating: 2.75/5
This post was last modified on June 17, 2022 10:49 am
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…