సమీక్ష – బంగార్రాజు

2.75/5

2 Hrs 40 Mins   |   Action   |   14-01-2022


Cast - Akkineni Nagarjuna, Naga Chaitanya, Ramya Krishna, Kriti Shetty

Director - Kalyan Krishna Kurasala

Producer - Akkineni Nagarjuna

Banner - Annapurna Studios

Music - Anup Rubens

పెళ్లికి ముస్తాబై వెళ్లాలని తహ తహ వుంటే సరిపోదు. ఆ ముస్తాబు సరిగ్గా వుండేలా చూసుకోవాలి. అలాగే సీక్వెల్ చేసేయాలని కిందా మీదా అయిపోతే సరిపోదు. దానికి సరిపడా సరుకు, సత్తా వుండేలా చూసుకోవాలి. నాగార్జున వున్నారు..చైతన్య కూడా వున్నారు. కృతిశెట్టి హీరోయిన్ గా దొరికింది. సీనియర్ ఆడియన్స్ కోసం రమ్యకృష్ణ వుండనే వుంది, ఇక కావాల్సింది నాలుగు ఫైట్లు, ఆరు పాటలు అని అనేసుకుని మూడు నెలల్లో రీళ్లు చుట్టేస్తే, చూసేయడానికి ఆడియన్స్ అమాయకులు కారు. మహా దేశముదర్లు. వాళ్లకు ఈ సరుకులు అన్నింటితో పాటు సరైన స్క్రిప్ట్ ను కూడా రుచి చూపించాలి. అప్పుడే సూపరెహె అంటారు. లేదూ అంటే, అబ్బే అని పెదవి విరిచేస్తారు.

సోగ్గాడే చిన్ని నాయనా పూల్ ప్రూఫ్ స్క్రిప్ట్ కాదు. కానీ అందులో ఎంటర్ టైన్ మెంట్ పక్కాగా సెట్ అయింది. సీనియర్ పెయిర్ నడుమ రొమాన్స్. యంగ్ పెయర్ అమాయకత్వం, వీటన్నింటితో పుట్టే ఫన్. ఇవన్నీ కలిపి ఆ సినిమాను పెద్ద హిట్ చేసాయి. సీక్వెల్ కోసం పెయిర్ లు, సెటప్ లు అన్నీ చూసుకున్నారు కానీ స్క్రిప్ట్, ఫన్ ను మాత్రం తెచ్చుకోలేకపోయారు.

సోగ్గాడే చిన్ని నాయనా సినిమా ముగింపు దగ్గర బంగార్రాజు ప్రారంభం అవుతుంది. సీత (లావణ్య త్రిపాఠీ) కొడుకును కనేసి, చనిపోతుంది. దాంతో రాము (నాగార్జున) కొడుకును తల్లి (రమ్యకృష్ణ) చేతిలో పెట్టి అమెరికా వెళ్లిపోతాడు. అలా పెరిగిన చిన బంగార్రాజు (చైతన్య) అచ్చం తాతలా తయారవుతాడు. అమ్మాయిల వెంట పడడం, ఖాళీగా వుంటే పేకాట ఆడుకోవడం ఇదీ కార్యక్రమం. అదే ఊరులో సర్పంచ్ నాగలక్ష్మి (కృతి శెట్టి). ఈ ఇద్దరికి పెళ్లి చేయాలన్నది నానమ్మ (రమ్యకృష్ణ) కోరిక. కానీ ఆ ఇద్దరికి ఉప్పునిప్పులా వుంటుంది. దీంతో స్వర్గంలో వున్న నానమ్మ..బంగార్రాజును పోరు పెట్టి భూమ్మీదకు పంపిస్తుంది. ఇదిలా వుంటే ఊరి గర్భగుడిలో వున్న నిధిని కాజేయాలని విలన్ల పన్నాగం.అందుకోసం చిన బంగార్రాజును చంపించేయాలని కుట్ర. ఇంతకీ చినబంగార్రాజు-నాగలక్ష్మిల పెళ్లి ఏమయింది? విలన్ల కుట్ర ఏమయింది? అన్నది అసలు సినిమా.

సొ మెనీ కుక్స్ స్పయిల్ ది సూప్ అనే కాదు. సో మెనీ ప్లాట్స్ స్పాయిల్ ది స్క్రిప్ట్ అని కూడా చెప్పుకోవాలి. బంగార్రాజ సీక్వెల్ కోసం కథను ఎంతలా కిట్టించాలో అంతలా కిట్టించారు. అందుకోసం ఏదేదో చేసారు. తమ కన్వీనియెంట్ గా ఎక్కడికక్కడ కథను జరిపేస్తూ వచ్చారు. బంగార్రాజు ఆత్మకు ప్రమోషన్ వచ్చి నరకం నుంచి స్వర్గానికి వెళ్లడం, అక్కడ రంభ..ఊర్వశి..మేనకలతో సరసాలు, ఆట పాటలు. ఇంతలో భార్య సత్య (రమ్యకృష్ణ) ఆత్మ కూడా నరకానికి పోకుండా నేరుగా స్వర్గానికి వచ్చేయడం. ఆమె కోరిక మేరకు భూమ్మీదకు బంగార్రాజు వచ్చేయడం. మనవడిలో దూరి నానా చిందులు చేసేయడం. ఇదంతా ఓ ట్రాక్. గుడి గురించి ప్రేక్షకుడికి అర్థం కాని ఏవేవో మాటలు యమ ధర్మరాజు మాట్లాడడం, దేవుళ్ల వల్ల కానిది ఓ ఆత్మవల్ల అవుతుందని బంగార్రాజును భూమ్మీదకు పంపేయడం. ఇదంతా మరో ట్రాక్.

చినబంగార్రాజు ఇంట్లో కామెడీ బ్యాచ్, డబ్బులు తినేయడం, అతగాడిని పెడతోవ పట్టించడం ఇదంతా ఇంకో ట్రాక్. గుడి, నిధి, వజ్రాలు, విలన్లు అదంతా మరోటి. నాగలక్ష్మి సర్పంచ్ పిచ్చి, సోషల్ మీడియా హడవుడి వుండనే వుంది. వీటన్నింటిని పదమూడు ముక్కలు పద్దతిగా పేర్చి గేమ్ చూపించినట్లు కాకుండా ఎత్తిన ముక్క ఎత్తినట్లు పట్టుకుని కూర్చన్న చందంగా చేసారు.

ప్రేక్షకుడు ఎక్కడా భళ్లున నవ్వే సీన్ కానీ, ఎక్కడా టచ్ చేసినట్లు అనిపించే ఎమోషన్ కానీ సినిమాలో అస్సలు కనిపించదు. పోనీ సోగ్గాడు మాదిరిగా కాస్త నాటు శృంగారం అయినా వుంటుందా అంటే అదీ లేదు. వయసైపోయిన నాయిక నాయకులు డ్యూయట్ లు పాడుతుంటే చూసేదెవరు? రమ్యకృష్ణ మీద క్లాస్ డ్యూయట్ పెట్టాలని ఐడియా వచ్చిన మహానుభావులకు వందనాలు. నాగ్ చైతన్య స్క్రిప్ట్ లోకి నాగార్జున వచ్చారా? లేదా నాగార్జున స్క్రిప్ట్ లోకి చైతన్యను తెచ్చారా? అన్నది పక్కన పెడితే ఈ కాంబినేషన్ నే స్క్రిప్ట్ ను చెడగొట్టింది.

నాగార్జునను వదలడానికి లేదు. ఆయన గారి అందాలు, ఆయనగారి ఎలివేషన్లు, ఆయనగారి సింహభాగం స్క్రీన్ టైమ్ అలా వుండాల్సిందే. చైతన్య పాత్ర అందులోనే ఇమిడి వుండాలి. చైతన్య యంగ్ హీరో. ఫైట్లు పుష్కలంగా చేయగలడు. దానికి కూడా ఆత్మను తీసుకురావాలా? చిన బంగార్రాజు అంటూ ఒకటి రెండు ఉదాహరణలు చూపించారు. పైపైన. అంతే వదిలేసారు. శృంగారం అంటే పెద బంగార్రాజే అని యూనిట్ మొత్తం ఫిక్స్ అయిపోయింది. అదే జనాలకు వెగటుగా వుంది.

యంగ్ పెయిర్ లైన్ రాసుకోవడం దగ్గరే సినిమా స్క్రిప్ట్ గాడి తన్నేసింది. హీరోకి పెళ్లి నచ్చదు. ప్లే బాయ్ టైపు. హీరోయిన్ అతగాడిని ఇషపడుతుంది ఇద్దరి నడుమ గిల్లి కజ్జాలు ఇలా వుంటే ఎలా వుంటుంది. ఇద్దరూ సదా చిర్రుబుర్రులు ఆడుతూ, వాట్సాప్ ల్లో ఫార్వార్డ్ కు కూడా పనికిరాని పిచ్చి డైలాగులు వేసుకుంటూ ఫన్ అనుకుంటే ఎలా వుంటుంది?

సినిమా తొలిసగం అలా అలా కాలక్షేపం చేసేసి మలిసగంలోకి వస్తారు. ఇక అక్కడ నుంచి యూనిట్ కన్వీనియెన్స్ ప్రకారం కథ ఎలా కావాలంటే అలా సాగుతుంది. ద్వితీయార్థం మొదలయ్యాక, కథ కాస్త ట్రాక్ లో పడుతోంది అనుకునే సరికి, మధ్య మధ్యలో కథకు సంబంధం లేకుండా హీరోయిన్ ఇంప్రెస్ కావడం అన్నప్రాతిపదిక మీద రకరకాల సీన్లు వచ్చి పోతుంటాయి. ఏవో హోమాలు అంటుంటారు. భారీ సీన్లు చూపిస్తుంటారు. విలనిజం టాప్ లెవెల్ లో కనిపిస్తుంది. కానీ అది కూడా ఆత్మ ముందు చేతులెత్తేసి, మంత్రాలు, పసుపు కుంకుమలను నమ్ముకుంటుంది.

చివర్న ఆత్మ చేతులెత్తేస్తే దేవుడి పాము చటుక్కున వచ్చి రంగంలోకి దిగుతుంది. కానీ అలాంటి దేవుడి పాము ను కూడా మాంత్రికుడు వానపామును తీసేసినట్లు తీసేస్తాడు. అది చెట్టు ఎక్కేస్తుంటే ఏం చేస్తుందా అనుకుంటాం. చెట్టుమీద నుంచి సరాసరి అమెరికా నుంచి వచ్చే రాము కారు మీద దూకుతుంది. దాంతో సినిమాటిక్ గా రాము లోకి ఆత్మ ఎంటర్ అయిపోతుంది. కథను కంచికి చేర్చేస్తుంది.

ఓ సీక్వెల్ కథను అల్లుకోవడానికి ఇన్ని పుర్రాకులు పడాలా? కథను ఇంత అష్టవంకర్లు తిప్పాలా? ఆత్మలు, దేవుళ్లు, యుముడు, ఇంద్రుడు, ఇలా అందరూ సినిమా కథకు అనుగుణంగా ప్రవర్తిస్తూ పోవాలా? ఇంత చేసీ చైతన్య-కృతిశెట్టి లాంటి మాంచి పెయిర్ నడుమ ఓ మాంచి లవ్, రొమాంటిక్ ట్రాక్ రాసుకోలేకపోయారా?

ఇలాంటి సినిమాను ఆరంభంలో లడ్డుండ…చివరిలో వాసివాడి తస్సాదియ్యా పాటలు కాస్త కాపాడతాయి. సినిమా నిండా పదుల సంఖ్యలో మహిళలు కనిపించి ఫ్రేమ్ ను అందంగా మార్చారు. ఆరంభం నుంచి చివరి వరకు ఇండియన్ డ్రెస్ ల్లోనే అమ్మాయిలు కనిపించి కనువిందు చేసారు. అందుకే దీన్ని పండగ సినిమా పండగ సినిమా అంటూ కలవరిస్తున్నారేమో?

కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ ఓకె..స్క్రిప్ట్ కాదు. అనూప్ రూబెన్స్ సినిమాకు ప్లస్. మాటలు సినిమాకు మైనస్. ఓవరాల్ గా హడావుడి చేసినంత సినిమా అయితే కాదు.

ప్లస్ పాయింట్లు
కలర్ ఫుల్ చిత్రీకరణ
పాటలు

మైనస్ పాయింట్లు
వీక్ స్క్రిప్ట్
కామెడీ

ఫినిషింగ్ టచ్: మెరవని ‘బంగారం’

Rating: 2.75/5