సమీక్ష – ఏక్ మినీ కథ

2.75/5

2 Hrs 13 mins   |   Comedy   |   27-05-2021


Cast - Santosh Shoban, Kavya Thapar, Shraddha Das, Brahmaji, Sudharshan, Sapthagiri, Posani Krishna Murali, and others

Director - Karthik Rapolu

Producer - UV Concepts

Banner - UV Concepts

Music - Praveen Lakkaraju

కాన్సెప్ట్ వుంటే చాలు కథ అల్లేయచ్చు అని అనుకోవడం ఈ మధ్య సినిమా జనాలకు బాగా అలవాటైపోయింది. కానీ ఆ కాన్సెప్ట్ చుట్టూ కథ కన్నా కథనం తయారు చేయడం అన్నది మాత్రం కత్తి మీద సాము. పైగా ఆ కాన్సెప్ట్ కాస్త ‘అడల్ట్’ వ్యవహారం అయితే ఇక చెప్పనక్కరలేదు. ఇక్కడ ఇంకో సమస్య కూడా వుంది. అడల్ట్ మూవీని కేవలం ఎ సర్టిఫికెట్ సినిమాగా తీసేయాలి అనుకుంటే సమస్య యేమీ లేదు. అలా కాకుండా ఫ్యామిలీలు కూడా చూడాలి. భళ్లున కొందరు, ముసిముసిగా మరి కొందరు నవ్వుకోవాలి అంటే మాత్రం ఇంకా సమస్యే. ఇన్ని విషయాలను ఒకే సారి డీల్ చేయడం అంత వీజీ కాదు. యువి కాన్సెప్ట్ బ్యానర్ మీద వంశీ, విక్రమ్ నిర్మించిన ‘ఏక్ మినీ కథ’ గురించే ఇదంతా. దర్శకుడు మేర్లపాక గాంధీ తన స్టయిల్ లో తయారు చేసిన స్క్రిప్ట్ ఇది.

ఈ స్క్రిప్ట్ ఎలా వుందీ అంటే గోచీకి పెద్ద..పంచెకు చిన్న అన్నట్లుగా. ఓ కుర్రాడు సంతోష్ (సంతోష్ శోభన్) తన అంగం చిన్నదిగా వుంది అని చిన్నప్పటి నుంచి ఫీలవుతూ వుంటాడు. దాని వల్ల రాబోయే విపరిణామాలు ఎలా వుంటోయో అని చిలవలు పలవలుగా ఊహించుకుని ఫీలైపోతూ వుంటాడు. ఇవన్నీ ఎందుకోచ్చిన తంటాలు అని పెళ్లికి దూరంగా వుందాం అనుకుంటాడు. కానీ అనుకోకుండా ఓ అమ్మాయి (కావ్య థాపర్) ని చూసి మనసు పారేసుకుంటాడు. అప్పుడు పెళ్లి తప్పదు కదా…ఇక ఆల్టర్ నేటివ్ ఏమిటంటే అంగం పెద్దది చేసుకోవడం. ఇక దాని కోసం తిప్పలు పడడం ప్రారంభిస్తాడు. కానీ ఏదీ వర్కవుట్ కాదు. చివరకు ఏం జరిగింది అన్నది మిగిలిన సినిమా.

అంగం..చిన్నది అన్న దగ్గరే బోల్డ్ కంటెంట్ అని ఫిక్స్ అయిపోవచ్చు. దాని లోంచి కామెడీ బోలెడు జుర్రుకోవచ్చు ఒక పక్కా ఏ సర్టిఫికెట్ సినిమా తీయాలి అనుకుంటే. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే ఫ్యామిలీ సినిమాగా మార్చాల్సి రావడం. సినిమా తొలిసగం అంతా దాదాపుగా కుర్రకారు సినిమాగా వుంటుంది కాబట్టి, కాసిన్ని సీన్లు పడి పాసైపోతుంది. ఎందుకంటే అక్కడ ఎలాంటి కట్టుబాట్లు, గీతలు వుండవు.

కానీ పెళ్లి అయిపోయి, సినిమా ఫ్యామిలీలోకి ప్రవేశించాక వస్తుంది అసలు సమస్య. అక్కడ నుంచి సినిమా అక్కడిక్కడే గింగిరాలు తిరుగుతుంది. స్క్రిప్ట్ రైటర్ మేర్లపాక ఇక్కడే ఇబ్బంది పడ్డాడు. నవల వేరు..సినిమా వేరు. నవల్లో మాదిరిగా నాలుగైదు కాన్సెప్ట్ క్యారెక్టర్లు తయారుచేసి, గజిబిజి చేసుకున్నారు. పైగా అక్కడ వున్న యాక్టర్లు రిజిస్టర్ అయ్యే వాళ్లు కాదు. పైగా ఆ క్యారెక్టర్లు చేసే ఓవర్ యాక్షన్ కొంత. ఆ ఓవర్ యాక్షన్ లోంచే కామెడీ పుడుతుంది అనుకున్నాడు మేర్లపాక. కానీ అక్కడే తన్నేసింది వ్యవహారం.

పైగా మేర్లపాక స్క్రిప్ట్ లో వున్న మరో మైనస్ ఏమిటంటే హీరోయిన్ క్యారెక్టర్ డిజైన్ చేయడం. మిగిలిన క్యారెక్టర్లు అన్నీ అంత హుషారుగా వుంటే హీరోయిన్ క్యారెక్టర్ వాటిని మ్యాచ్ చేయలేకపోయింది. హీరో హీరోయిన్ల మధ్య సరైన సీన్లు రాసుకోలేకపోయారు. హీరోకు ఎంత సమస్య వున్నా, టెన్షన్ వున్నా, సినిమా పరంగా హీరో-హీరోయిన్ ట్రాక్ అన్నది పెర్ ఫెక్ట్ గా వుండాలి కదా.

హీరో ఇంట్లోకి శ్రద్ద క్యారెక్టర్ ను ప్రవేశ పెట్టడంతో స్క్రిప్ట్ రైటర్ పని మరీ కష్టం అయిపోయింది. ఆమె ఆటిట్యూడ్, ఆ మందు సైడ్ ఎఫెక్ట్, దాంట్లోంచి కూడా సెంటిమెంట్ కమ్ ఎమోషన్ పండించాలని ప్రయత్నించడం ఇలా ఒకేసారి సవాలక్ష వ్యవహారాలు తలకెక్కించేసుకోవడం వల్ల సినిమా జటిలం అయిపోయింది. దీనివల్ల చాలా సీన్లు ఫోర్స్ డ్ గా మారిపోయాయి.

నిజానికి ఈ సినిమాను ఫ్యామిలీ సినిమా గా కాకుండా, మారుతి స్టయిల్ లో వచ్చిన ఈ రోజుల్లో టైపు యూత్ ఫుల్ అడల్ట్ టచ్ సినిమాగా చేయాలని అనుకున్నా, లేదా చాలా ఏళ్ల కిందట వచ్చిన కన్నడ హీరో కాశీనాధ్ సినిమా టైపులో చేసుకున్నా ఓకె అనిపించేసుకునేది. ఈ ఫ్యామిలీ టచ్ అన్నదే సమస్య అయింది.

ఫ్రాంక్ లీ ఇక్కడ ఇంకో సమస్య కూడా యాడ్ అయింది. హీరో సంతోష్ క్యారెక్టర్ ను ఆద్యంతం ఒకటే మూడ్ లో, డల్ టచ్ లో డిజైన్ చేయడం వల్ల పండాల్సిన సీన్ల కూడా పండలేదు. హీరో కనీసం కొన్ని సీన్లలో అయినా యాక్టివ్ గా వుంటే అది వేరుగా వుండేది. కమెడియన్ సుదర్శన్ చాలా వరకు ఆదుకున్నాడు. కానీ తరువాత సప్తగిరి ఎంటర్ కావడంతో ఆ ఓవర్ కామెడీ జనాలను ఇబ్బంది పెడుతుంది.

మొత్తం మీద ఒక మంచి ప్రయత్నం మంచి విజయంగా మారాల్సింది, దానికి వున్న పరిమితులు తదితర వ్యవహారాల వల్ల యావరేజ్ గా మిగిలిపోయింది.

ప్లస్ పాయింట్లు

ఫస్ట్ హాఫ్

కొన్ని ఫన్ సీన్లు

మైనస్ పాయింట్లు

సెకండాఫ్

ఫోర్స్ డ్ సీన్లు

ఫినిషింగ్ టచ్ : మరీ.. చిన్న…ది

Rating: 2.75/5