2.25/5
2 Hrs | Comedy | 11-03-2021
Cast - Rajendra Prasad, Sree Vishnu, Lovely Singh, Tanikella Bharani, Sathya
Director - Anish
Producer - S Krishna, Sahu Garapati, Harish Peddi
Banner - Shine Screens & Image Spark
Music - Achu Rajamani
పెద్ద బ్యానర్లు చిన్న సినిమా తీయడం, పెద్ద దర్శకులు చిన్న సినిమాలకు చేయూత ఇవ్వడం అన్నది టాలీవుడ్ లేటెస్ట్ ట్రెండ్. తన మిత్రుడు సాయి అందంచిన కథకు తను మాటలు, దర్శకత్వ పర్యవేక్షణ అందించారు అనిల్ రావిపూడి. కచ్చితంగా ఇది గాలి సంపత్ సినిమా గురించి మాట్లాడుకోవడానికి దారి తీసింది. రాజేంద్ర ప్రసాద్, శ్రీవిష్ణుల మీదనే సినిమా మొత్తం రన్ అవుతుందని, పైగా రాజేంద్ర ప్రసాద్ కు మాటలు వుండవని, గాలి మాత్రమే సౌండ్ గా వస్తుందని, అలాంటి వాడు ఓ బావి గోతలో పడిపోతే ఎలా బయపడ్డాడు..అంటూ ఇలా కథ మొత్తాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి ముందే రివీల్ చేసేసారు. ప్రేక్షకులను ఓ విభిన్న తరహా కథ, కథనాలకు దర్శకుడు ప్రిపేర్ చేస్తున్నాడు అని అర్థం అయింది. అందువల్ల గాలి సంపత్ సినిమా మీద మరింత ఆసక్తి పెరిగింది.
ఇలా అన్ని విధాలా ఆసక్తి పెంచుకున్న గాలిసంపత్ సినిమా, ఆ రేంజ్ ఆసక్తికరంగా తయారు కాలేకపోయింది. ఆ స్థాయి ఆసక్తిని నిలెబెట్టలేకపోయింది. అనిల్ రావిపూడి లాంటి మాస్ ఎంటర్ టైనర్లు అందించే దర్శకుడు గాలిసంపత్ లాంటి సినిమాను అసలు ఎందుకు టేకప్ చేసారా? ఎందుకు ఇలా డీల్ చేసారు అనే రెండు గట్టి అనుమానాలు సినిమా పూర్తయ్యేసరికి అందరికీ తలెత్తుతాయి.
గాలిసంపత్ స్క్రిప్ట్ నే వీక్ గా వుంది. ప్రమాదవసాత్తూ మాటలు కోల్పోయిన సంపత్ (రాజేంద్ర ఫ్రసాద్) నోటి వెంట్ ప..ప్ఫ..లాంటి ప గుణింతం సౌండ్ మాత్రమే వస్తుంది. దానికి పక్కన ఓ దుబాసి మాదిరిగా సత్య వుండి చెబుతూ వుంటాడు. అంటే ప్రతీ డైలాగు ప్రేక్షకుడు ముందు ఫ గుణింతంలోనూ, ఆ తరువాత మామూలుగానూ వినాలన్నమాట. ఈ ఐడియానే అసలు థియేటర్లో జనాలను కూర్చోపెట్టేది కాదు. స్క్రిప్ట్ లో వున్న మరో వీక్ అన్నది హీరో ట్రాక్. దానికి అనుబంధమైన హీరోయిన్ ట్రాక్. చాలా పూర్ రైటింగ్ స్కిల్ కనిపిస్తుందిు హీరో ట్రాక్ లో. ఏనాటి నుంచో అరిగిపోయిన సీన్లే ఆ ట్రాక్ నిండా చోటు చేసుకుంటాయి.
తొలి సగంలో అనిల్ రావిపూడి తన మార్కు ఫన్ సీన్లు కొన్ని రాసుకున్నారు. రఘుబాబు నాటకాల కంపెనీ వ్యవహారాలు, రాజేంద్ర ఫ్రసాద్ సీన్లు కొన్ని, హీరో ట్రక్ డ్రయివింగ్ వంటి సీన్లు వాటిల్లో వున్నాయి. కానీ ఎందుకనో ఇవన్నీ కూడా ప్రేక్షకుడి పెదవులను కాస్తయినా కదిపి నవ్వించలేకపోయాయి. ఇవన్నీ కూడా ఎక్కడా కొత్తగా అనిపించకపోవడమే ప్రధాన కారణం కావచ్చు.
ఫన్ పండని నేపథ్యంలో రాజేంద్ర ప్రసాద్ ఫ..గుణింతం సంభాషణలు, వాటి లౌడ్ నెస్, వాటికి మళ్లీ తర్జుమా అన్నీ కలిసి ప్రేక్షకుడిని తలపట్టుకునేలా చేసాయి. విశ్రాంతి టైమ్ కు బోరు బావిలో పడిపోవడంతో బ్యాంగ్ వేసాం అనిపించారు. ద్వితీయార్థం ప్రారంభమయ్యాక, కొద్ది సేపు రాజేంద్ర ప్రసాద్ మీద సింపతీ జనరేట్ చేసే ప్రయత్నం చేసారు. కానీ అంతలోనే ఆ పని పక్కన పెట్టి, అతనికి కావాల్సిన వన్నీ బయటనుంచి ఏదో విధంగా అందినట్లు చేయడంతో, ప్రేక్షకుడికి టెన్షన్ లేకుండా పోయింది.
అదే సమయంలో శ్రీవిష్ణు పాత్రకు తండ్రి మీద సింపతీ, ఎఫెక్షన్ పెరిగేలా చేయడానికి, అసలు సంగతులు రివీల్ చేయడానికి షూట్ చేసిన ఒకటి రెండు సంఘటనలు కూడా బాగా తేలిపోయాయి. ఇలాంటివి చాలా అంటే చాలా సినిమాల్లో చూసినవే కావడంతో, ప్రేక్షకుడు అక్కడ కూడా కనెక్ట్ కాలేకపోయాడు.
గాలి సంపత్ ఏ వర్షాన్ని అయితే ద్వేషించాడో అదే వర్షం వల్ల బతికి బట్టకట్టినట్లు చూపించే లింక్ బాగుంది. కామెడీ ట్రాక్ కోసం రాసుకున్న బ్యాంకు మేనేజర్ (శ్రీకాంత్ అయ్యంగార్) ట్రాక్ కూడా అస్సలు క్లిక్ కాలేదు. పైగా శ్రీకాంత్ అయ్యంగార్ లౌడ్ గా సంభాషణలు చెబుతూ ట్రయ్ చేసిన కామెడీ ఇరిటేటింగ్ గా అనిపిస్తుంది. ఇదే కాదు రక్తంతో ప్రేమలేఖ రాసే ట్రాక్ కూడా అంతే. టోటల్ గా కామెడీ ట్రాక్ లు అన్నీ చూసుకుంటే అనిల్ రావిపూడినే ఇవన్నీ రాసారా? అన్న అనుమానం కచ్చితంగా కలుగుతుంది.
హీరోయిన్ ట్రాక్ కూడా గొప్పగా లేదు. ఇంట్రడక్షన్ సీన్ బాగుంది అనుకునేలోగానే ఆ ఆనందం ఆవిరి అయిపోతుంది. అక్కడ నుంచి చివరి వరకు ఆమె మీద ఒక్క మంచి సీన్ పడలేదు. హీరో శ్రీవిష్ణు పాత్రనే సరిగ్గా డిజైన్ చేయలేదు. రాజేంద్ర ప్రసాద్ మీద దృష్టి పెట్టడంతో ఈ పాత్ర పక్కదారి పట్టి ఉడికీ ఉడకనట్లు తయారైంది.
ఇలా మొత్తం పండని కామెడీ సీన్లు, ఆసక్తి కలిగించన స్క్రిప్ట్, సరిగ్గా డిజైన్ కాని హీరో, హీరోయిన్ ట్రాక్, రాజేంద్ర ప్రసాద్ లౌండ్ ఫ..ఫ..గుణింతం అన్నీ కలిసి సినిమాను ఓ విఫలయత్నంగా మార్చేసాయి.
ప్లస్ పాయింట్లు
ఫిఫి..ఫీ..ఫిఫి..ఫీ పాట
రాజేంద్ర ప్రసాద్
మైనస్ పాయింట్లు
వీక్ స్క్రిప్ట్
కామెడీ ట్రాక్
ఫినిషింగ్ టచ్: ఫ్ఫ..ఫ్ఫ..ఫ్ఫ…ఫ్ఫాఫ్ఫేఫ్ఫు
— సూర్య