సమీక్ష – శ్రీకారం

2.75/5

2 Hrs 20 Min   |   Drama   |   11-03-2021


Cast - Sharwanand, Priyanka Arul Mohan, Rao Ramesh, Sai Kumar

Director - Kishor B

Producer - Ram Achanta, Gopichand Achanta

Banner - 14 Reels Plus

Music - Mickey J. Meyer

రైతుల సమస్యలపై అనేక సినిమాలు గతంలో వచ్చాయి. ప్రతి ఒక్క వృత్తిలో వారసత్వం కనిపిస్తోంది కానీ, రైతు దగ్గరకు వచ్చేసరికి మాత్రం వారసత్వం కనిపించడం లేదు. ఎందుకు? అన్న ఆలోచనలోంచి పుట్టిన కథ శ్రీకారం. కాడి వదిలేసిన రైతులను మళ్లీ కాడి పట్టేలా చేసి వ్యవసాయం లో కూడా ఇబ్బడిముబ్బడిగా లాభాలు చూపించిన ఓ కుర్రాడి కథ కూడా. అయితే కేవలం రైతు సమస్యల చుట్టూ తిప్పితే జనం చూడడం కష్టం కావచ్చు అన్న భయం వుండనే వుంది. అందుకే లాభసాటి వ్యవసాయం అన్నది ఓ థ్రెడ్ గా తీసుకుని, దానికి తండ్రీ కొడుకుల మధ్య ఎమోషన్లు, కొద్దిగా విలనిజం కలిపి ముడేసారు.

కార్తీక్ (శర్వానంద్) సాఫ్ట్ వేర్ ఇంజనీర్. తండ్రి (రావు రమేష్) పల్లెటూరులో రైతు. వ్యవసాయం గిట్టుబాటు కాక రైతులు కాడి వదిలేసి పట్నాలకు వచ్చి కూలీలుగా మారిపోవడం చూసి చలించిపోతాడు. లక్షల ఆదాయం వచ్చే ఉద్యోగాన్ని వదిలి పల్లెకు వ్యవసాయం కోసం వస్తాడు. రైతులను కొత్త ఆలోచనలతో చైతన్య వంతం చేయాలని చూస్తాడు. కానీ ముందుకు రారు. ఆఖరికి వారికి జీతాలు ఇచ్చి వ్యవసాయం ప్రారంభిస్తాడు. ఉమ్మడి వ్యవసాయం అనే కాన్సెప్ట్ ను అమలు చేస్తాడు. ఈ నేపథ్యంలో చిన్న చిన్న మనస్పర్థలు, ఎమోషన్లు. చివరకు ఏమయింది అన్నది మిగిలిన సినిమా.

శ్రీకారం సినిమా బలమైన సినిమాగా రూపొందడానికి వున్న అవకాశం ఏమిటంటే ఇటు రైతు సమస్యలు. అటు తండ్రీ కొడుకుల కాన్ ఫ్లిక్ట్. ఈ రెండు అంశాల నేపథ్యంలో వీలయినంత ఎమోషనల్ సీన్లు రాసుకుని, తీసుకునే అవకాశం వుంది. ఆ అవకాశాన్ని బాగా వాడుకున్నారు. కొత్త దర్శకుడు కిషోర్. మాటల రచయిత సాయిమాధవ్. ఓ కొత్త దర్శకుడు భావోద్వేగ సన్నివేశాలను తూకం వేసినట్లు పండించడం అంత సులువు కాదు. ఆ ఫీట్ ను సక్సెస్ ఫుల్ గా చేసాడు కిషోర్.

స్క్రిప్ట్ పరంగా చూసుకుంటే మరీ గొప్ప స్క్రిప్ట్ కాదు. ఎందుకంటే సినిమాకు కావాల్సిన ఎత్తుపల్లాలు, మలుపులు ఇందులో లేవు. స్క్రిప్ట్ చాలా సాదా సీదాగా అలా అలా సాగిపోతుంది. ప్రేక్షకుడిని రిలాక్స్ డ్ గా చూసేలా చేస్తుంది తప్ప, మరీ కిందా మీదా చేసేయదు. సినిమా ప్రారంభం లో వచ్చే సాఫ్ట్ వేర్ బ్యాక్ డ్రాప్ సీన్లు, హీరో హీరోయిన్ ట్రాక్ చాలా సాదా సీదాగా వుంటాయి. వన్స్ , పల్లెటూరిలో రాజాలా వుండే రైతు పట్నం వచ్చి కూలిపని చేస్తున్న వైనం హీరోకి తెలిసిన దగ్గర నుంచి ఎమోషనల్ టర్న్ తీసుకుంటుంది. అక్కడి నుంచి చివరి వరకు అవకాశం దొరికినపుడల్లా సరైన మాటల తూటాలు పేలుస్తూనే వచ్చాడు. ఆ మాటలకు తగినట్లు సీన్లు తీస్తూ వెళ్లాడు. సినిమా కాస్త డౌన్ అవుతోంది అన్నపుడల్లా ఇలాంటి మ్యాజిక్ ను ప్లే చేసారు.

సినిమా ప్రథమార్థం కన్నా ద్వితీయార్థం ఆకట్టుకోవడానికి కారణం ఇదే. తొలిసగంలో ఆ ఎమోషన్లకు అంతగా అవకాశం లేదు. సినిమాను నెమ్మదిగా లీడ్ తీసుకుంటూ ద్వితీయార్థంలోకి తీసుకెళ్తాడు దర్శకుడు. అయితే మళ్లీ ద్వితీయార్థంలో కూడా మరీ భారీ భారీ సన్నివేశాలు ఏమీ పెట్టలేదు. సినిమాను అలా అలా పైపైనే టచ్ చేసుకుంటూ వెళ్లిపోయాడు. పంటలు పండించడం, మార్కెట్ చేయడం వంటివి అన్నీ కూడా చకచకా సినిమాటిక్ గా జరిగిపోతాయి. మామూలుగా అయితే ఇలాంటి కథలో ఎక్కడ అవసరం అయితే అక్కడ హెవీ సీన్లు పెట్టడానికి అవకాశం వున్నా, సినిమాను మరీ ఓ సెక్షన్ కు పరిమితం చేయకూడదన్న ఆలోచనతో అలా అలా పైపైనే తీసుకుంటూ వెళ్లిపోయారు. హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్, హీరో చెల్లికి పెళ్లి కుదరడం, విలన్ ట్రాక్ ఇలా ఎక్కడా ఏదోదో చేసేయాలని అనుకొలేదు. అంతా సాఫీగా అలా అలా వెళ్లిపోతుందంతే.

అయితే అదే సమయంలో ఎక్కడ ఎమోషనల్ టచ్ ఇవ్వాలో అక్కడ ఇచ్చుకుంటూ వెళ్లాడు. సినిమాకు క్లయిమాక్స్ అనేది ఒకటి వుంటుంది దాన్ని ఓ రేంజ్ లో ప్లాన్ చేయాలి అని కూడా దర్శకుడు అనుకోలేదు. జస్ట్ తండ్రి భుజం మీద కొడుకు చేయి వేయడం, తీయబోతే..’ఉండనీ..ధైర్యంగా వుంటుంది..’ అనే డైలాగ్ తో సీన్ ను లేపాడు. ఇలాంటి స్టయిల్ వల్ల సినిమా మరీ ఫ్లాట్ గా వుంది అనే చిన్న ఫీల్ ఒకటి వెంటాడుతూనే వుంటుంది. కానీ డైలాగ్ రైటింగ్ స్కిల్స్ ఆడియన్స్ ఎమోషన్ పాయింట్లను టచ్ చేసి, సినిమాను పాస్ చేయించేస్తాయి.

శ్రీకారం సినిమాకు డ్రాబ్యాక్స్ కూడా వున్నాయి. తొలిసగం యూత్ కు కనెక్ట్ అవుతుంది. యూత్ వ్యవసాయంలోకి దిగడం అంటే అది వారి సిన్మానే కదా అని అనుకోవడం వరకు ఓకె. కానీ ఆ తొలిసగం లో యూత్ కు కావాల్సిన ఫన్ కానీ ఎంటర్ టైన్ మెంట్ కానీ అంతగా ఫలించలేదు. హే అబ్బాయి అంటూ హీరోయిన వెంట పడడం కూడా క్లిక్ కాలేదు. అలాగే ముందుగానే చెప్పుకున్నట్లు, మరీ ప్లెయిన్ నెరేషన్ కూడా అందరికీ నచ్చేది కాదు.

ఇలాంటి సినిమాలో శర్వానంద్ హీరోగా సెటిల్డ్ గా నటించాడు. ఎమోషన్ సీన్లు కూడా మరీ ఎక్కువగా మనసుకు తీసేసుకుని, నటించినట్లు కనిపించదు. జస్ట్ ఎంత వరకు కావాలో అంతే. ఆ విషయంలో రావు రమేష్ కు మంచి మార్కులు పడతాయి. హీరోయిన్ గా ప్రియాంక మైనస్ నే. నరేష్, ఆమని లాంటి సీనియర్లు మంచి నటనే ఇచ్చారు. మిక్కీ బ్యాక్ గ్రవుండ్ స్కోర్ బాగుంది. సినిమాకు చాలా పక్కాగా సూటయింది. పాటలు రెండు ఇప్పటకే ప్రూవ్ చేసుకున్నాయి.

టొటల్ గా చూసుకుంటే.. సినిమా అన్నది కమర్షియల్ మాధ్యమం. అన్ని విధాలా ఆడియన్స్ ను పుల్ చేయాల్సిన ఎలిమెంట్స్ వుండాలి. కేవలం ఎమోషన్ ఒక్కదానితో టోటల్ రన్ ను పుల్ చేయడం సాధ్యమా అన్నది ఆలోచించుకోవాల్సి వుంది. ఫ్యామిలీ టికెట్ లు తెగడం బట్టి శ్రీకారం కమర్షియల్ సక్సెస్ ఆధారపడి వుంటుంది.

ప్లస్ పాయింట్లు

ఎమోషన్స్

మాటలు

నేపథ్య సంగీతం

మైనస్ పాయింట్లు

ఫ్లాట్ నెరేషన్

ఫినిషింగ్ టచ్: ‘సాఫ్ట్ కల్చర్’

Rating: 2.75/5

-సూర్య