సమీక్ష – చెక్

2.75/5

2Hrs 20 Min   |   Action, Thriller   |   26 Feb 2021


Cast - Nithin, Priya Prakash Warrier, Rakul Preet Singh, Posani, Murali Sharma

Director - Chandra Sekhar Yeleti

Producer - Anand Prasad V

Banner - Bhavya Creations

Music - Kalyani Malik

తెలుగులో ఓ సామెత వుంది. పెట్టనమ్మ ఎలాగూ పెట్టదు..పెట్టే అమ్మకు ఏమయింది? అని. చెక్ సినిమా చూసాక ఈ సామెత కచ్చితంగా గుర్తు వస్తుంది. రొటీన్ లాజిక్ లెస్ కమర్షియల్ సినిమాలు తీసేవాళ్లు ఎలాగూ అలాగే తీస్తారు. కాస్త వైవిధ్యమైన సినిమాలను జయాపజయాలతో సంబంధం లేకుండా తీస్తూ, ఇంటలెక్చ్యువల్ డైరక్టర్ అనిపించుకున్న చంద్రశేఖర్ యేలిటి కూడా అలాంటి దారిన పట్టడం ఏమిటి అన్నదే ఆలోచన. చెస్ నేపథ్యంలో సినిమా తీస్తున్నారు, ఉరిశిక్ష పడిన హీరో, మూడు వంతులు సినిమా జైల్లోనే జరుగుతుంది అనే పాయింట్లు బయటకు వచ్చాక యేలేటి తీసే సినిమా మీద కచ్చితంగా ఆసక్తి పెరిగింది. ఆ ఆసక్తితోనే థియేటర్లోకి అడుగుపెట్టిన వారికి తొలిసగం కచ్చితంగా ఆ ఆసక్తిని పెంచకపోయినా, నిలబెడుతుంది. కానీ అదే సినిమా మలిసగంలోకి వచ్చేసరికి, పైగా క్లయిమాక్స్ చూసిన తరువాత అయ్యో, పరాజయం అన్నది ఎలాంటి డైరక్టర్ ను ఎలా మార్చేసింది అనిపిస్తుంది.

ప్రేమ వల్ల మోసపోయి, తీవ్రవాది ముద్ర వేయించుకుని, ఉరిశిక్ష పడిన ఖైదీ ఆదిత్య (నితిన్). అతని జీవితంలోకి యాత్ర (ప్రియా వారియర్) వచ్చిన ఫలితం అది. క్షమాభిక్ష కోసం లాయర్ కావాలన్నపుడు ఆ కేసు రకుల్ ప్రీత్ సింగ్ దగ్గరకు వస్తుంది. ఇది ఇలా వుండగా జైలులో ఆదిత్య ఆసక్తి చెస్ క్రీడ వైపు మళ్లుతుంది. జైలులో వున్న శ్రీమన్నారాయణ (సాయిచంద్) దగ్గర చెస్ నేర్చుకుంటాడు. దాంట్లో గ్రాండ్ మాస్టర్ తెలివితేటలు ప్రదర్శిస్తాడు. దాంతో కథ అటు మళ్లుతుంది. ఉరిశిక్ష తేదీ దగ్గర పడుతుంది. అదే సమయంలో కామన్వెల్త్ కు ఆదిత్య క్లాలిఫై అవుతాడు. ఇలాంటి కథ ఎలా ముగిసింది అన్నది మిగిలిన సినిమా.

చెక్ సినిమా తొలిసగం రేసీ గా సాగిపోతుంది. కథ జైలులో నడుస్తున్న ఫీలింగ్ ను కలుగనివ్వదు. ఎందుకంటే దర్శకుడు ఒకటి కాదు రెండు కాదు చాలా లిబర్టీ తీసుకున్నాడు. హీరో డ్రెస్ కోసం ఖైదీల యూనిఫారమ్ నే మార్చేసాడు. ఒకటి రెండు సీన్లు మినహా జైలుతో సమస్య అని అనిపించకుండా తీసుకుంటూ వెళ్లిపోయాడు. సరే, అదంతా వదలిస్తే టోటల్ గా ఫస్ట్ హాఫ్ బాగానే వుంది. చంద్రశేఖర్ యేలేటి తన స్టయిల్ తాను నిలెబెట్టుకున్నాడు అని అనిపిస్తుంది.

అదే హొప్ తో సెకండాఫ్ చూడ్డం మొదలుపెట్టిన తరువాత సినిమా దాని ఇష్టం వచ్చినట్లు మెలికలు తిరుగుతుంది. దాని వల్ల సినిమా డ్రాగ్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. కానీ హీరో తాపత్రయం, అతను చెస్ లో కామన్వెల్త్ వరకు వెళ్తున్న వైనం చూసి, జనం కథ ముగింపు వేరే విధంగా వుంటుందని ఊహించుకుంటూ చూస్తుంటారు. కానీ అక్కడే దర్శకుడు కథకు ఊహించని మలుపు, ముగింపు ఇచ్చాడు.

సినిమాకు క్లయిమాక్స్ మాంచి ట్విస్ట్ తో వుండడం అన్నది కొత్త విషయం కాదు. కానీ ఆ క్లయిమాక్స్ అన్నది కథకు నప్పేలా వుండాలి. సినిమా ఆరంభమైన కాస్సేపటి నుంచి హీరోను చదరంగం వైపు తిప్పి, మొత్తం సినిమా అంతా దాని చుట్టూనే నడిపి, చివర్న అలా ముగించడం అన్నది అస్సలు నప్పదు. హీరో అన్న విషయం పక్కన పెట్టేసారు. జైలులో అంత కష్డపడింది, టెన్షన్ పడింది. ప్రేక్షకులను రెండు గంటల పాటు చదరంగం చుట్టూ తిప్పుతూ కూర్చోపెట్టింది మరిచిపోయి, ఇలా సింపుల్ గా క్లయిమాక్స్ టర్న్ తీసుకోవడం అన్నది అస్సలు కథకు, యేలేటి స్టయిల్ కు నప్పేది కాదు. అలాగే సెకెండ్ హీరోయిన్ రకుల్ పాత్రను మరీ డమ్మీ చేసేసారు. లాయర్ గా ఓ కీలకమైన నటిని తీసుకున్నపుడు, ఆ పాత్ర స్టామినాను పెంచాల్సి వుంటుంది. ఆ ఔచిత్యాన్ని దర్శకుడు వదిలేసి, ఆ మధ్యన వచ్చిన దుల్కర్ సల్మాన్ ‘కనులు కనులను దోచాయంటే’ సినిమా చూసి ప్రభావితం అయినట్లు కనిపిస్తోంది. పైగా క్లయిమాక్స్ లో లాజిక్ మిస్ అయింది అనుకుంటారని, ఓ రెండు మూడు నిమషాల సోది వివరణ, దానికి కొన్ని ఫుటేజ్ లు యాడ్ చేసి, ఇంటికెళ్లిపోయే మూడ్ లో వున్న ప్రేక్షకులను మరింత తొందరపెట్టాడు.

ఇంత మాత్రం క్లయిమాక్స్ కు హీరో జైల్లో అంతకాలం వుండడం ఎందుకు? ఈ చెస్, గేమ్స్, బోలెడు షాట్లు ఎందుకు? కేవలం హీరోను తప్పించే స్పాట్ కు రప్పించడం కోసమా? మరే దర్శకుడు అయినా ఇలా సినిమా తీసి వుంటే జనం ఏమనేవారో కానీ, యేలేటి ఇలా తీయడంతో జనం బాగా డిస్పపాయింట్ అవుతారు.

సినిమాను ఓ పాయింట్ దగ్గర లాక్ చేయడం అనే పరీక్షలో చాలా మంది డైరక్టర్లు పాస్ అయిపోతారు. కానీ ముడి విప్పడమే అసలు టాస్క్. ఈ టాస్క్ లో చాలా మంది ఫెయిల్ అయ్యారు. గతంలో ఎన్నడూ తన సినిమాల్లో ఈ టాస్క్ విషయంలో చంద్రశేఖర్ యేలేటి ఫెయిల్ కాలేదు. అందుకే ఆయన సినిమాలకు డబ్బులు రాకపోయినా, ప్రశంసలు దక్కాయి. కానీ ఈసారి ఆయన కూడా ఈ ముడివిప్పే టాస్క్ లో ఫెయిల్ అయ్యారు. అందుకే ఈసారి ఆయనకు ప్రశంసలు కూడా దక్కకపోవచ్చు.

ఇలాంటి సినిమాలో నితిన్ సెటిల్డ్ గా బాగానే నటించాడు. యాక్షన్ సీన్లు మామూలే. పెద్దగా ఎమోషనల్ సీన్లకు సినిమాలో చోటివ్వలేదు. కళ్యాణ్ మాలిక్ నేపథ్యసంగీతం థ్రిల్లర్ టచ్ లో సాగింది. సినిమాలో వున్న ఒక్క పాటలో బీట్, రిథమ్ బాగున్నాయి. రకుల్ నార్మల్ గా చేసకుంటూ పోయింది. అంతకన్నా ఆమె కు అవకాశం కూడా లేదు. ప్రియా వారియర్ జస్ట్ కొన్ని సీన్లు, ఓ పాట కోసం మాత్రమే.

టోటల్ గా ఓ డిఫరెంట్ సినిమా చూద్దాం అనుకునేవారికి కొంత వరకు సంతృప్తినిస్తుంది. చంద్రశేఖర్ యేలేటి సినిమా చూద్దాం అనుకునేవారిని చాలా వరకు డిస్సపాయింట్ చేస్తుంది.

పంచ్ లైన్.. చెక్ మేట్ చెప్పలేకపోయాడు.

సూర్య