సమీక్ష – జాంబిరెడ్డి

2/5

  |   Horror Comedy   |   05-02-2021


Cast - Teja Sajja, Anandhi, Daksha Nagarkar, Raghu Babu, Prudhvi Raj, Getup Srinu, Harshavardhan, Hemanth, Kireeti, Hari Teja.

Director - Prasanth Varma

Producer - Raj Shekar Varma

Banner - Apple Tree Studios

Music - Mark K Robin

రామానాయుడు రానా కాగా లేనిది, ఎమ్ ఓబుల్ రెడ్డి మారియో కాకూడదా అనే లాజిక్ తీస్తాడు జాంబీ రెడ్డి సినిమాలో హీరో. ఈ సినిమా కూడా అలాంటిదే జాంబి అనే భయం పుట్టించే జోనర్ ను కాస్త నవ్వుకునేలా, కాస్త చూడగలిగేలా తీసే ప్రయత్నం. దర్శకుడు ప్రశాంత్ వర్మకు కాస్తో, కూస్తో టాలెంట్ వుంది. కానీ టాలెంట్ వుంటే సరిపోదు, ఆ టాలెంట్ ను పూర్తిస్థాయిలో వాడగలిగేందుకు వీలయిన సబ్జెక్ట్ కావాలి. జాంబిరెడ్డితో అదే సమస్య. సినిమాలోకి లీడ్ చేసేందుకు దోహదం చేసే సీన్లు అన్నీ జస్ట్ రెగ్యులర్ గా వుంటాయి. మెయిన్ ప్లాట్ లోకి వెళ్లిన తరువాత దర్శకుడు చేయడానికి పెద్దగా ఏమీ వుండదు. జాంబియాల గోల తప్ప.

నిజానికి దీన్నే పక్కా కామెడీ సినిమాగా చేస్తే ఏమో కానీ హర్రర్ థ్రిల్లర్ గా చేయాలనుకున్నాడు దర్శకుడు. దానికి అక్కడక్కడ కామెడీ టచ్ ఇచ్చే ప్రయత్నం చేసాడు. అంతే కాదు మళ్లీ ఒకటి రెండు సెంటిమెంట్ సీన్లు అద్దకం చేసాడు. దీంతో సినిమా రకరకాల మిక్స్ డ్ జోనర్ లోకి జారుకుంది.

ఇంతకీ జాంబిరెడ్డి కథేంటీ అంటే మిత్రుడి (మిర్చి హేమంత్) పెళ్లి కోసం కర్నూలు వెళ్తాడు హీరో మారియో (తేజ). అక్కడ అసలే ఫ్యాక్షనిస్టుల గొడవ. అలాంటి బ్యాక్ డ్రాప్ లో జాంబియా రోగం తగులుకుంటుంది జనాలకు. క్షణాల్లో హీరో హీరోయిన్, ఇద్దరు మిత్రులు మినహా జనాలంతా జాంబియాల్లా మారిపోయి, మనుషల్ని కొరికేసి జాంబియాలను చేసేయడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. వాళ్ల నుంచి ఈ మిత్ర బృందం ఎలా తప్పించుకున్నారు? ఈ జాంబియా రోగానికి విరుగుడు ఏమిటి అన్నది మిగిలిన కథ.

సినిమా టేకింగ్ మాంచి థ్రిల్లర్ గా ప్రారంభమవుతుంది. ఆపై రెగ్యులర్ తండ్రీ కొడుకులు, స్నేహబృందం, అలాగే ఫ్యాక్షనిస్ట్ వ్యవహారాల్లోకి జారుకుంటుంది. ఈ సీన్లు అన్నీ ఎంత సీరియస్ గా తీసినా, ఎంత ఇంటెన్సివ్ గా తీయాలని ప్రయత్నించినా కొత్త లుక్ రాదు. ఎందుకంటే ఇప్పటికే ఇలాంటివి సవాలక్ష చూసేసాం కాబట్టి. వన్స్ జాంబియాల గోల స్టార్ట్ అయ్యాక, ఇక రన్నింగ్ రేస్ మినహా ఏమీ వుండదు. ఎవెంజర్స్ కు రెప్లికాల మాదిరిగా హీరో, హీరోయిన్, ఇద్దరు మిత్రులు, వారి ఆయుధాలు వగైరా. ఎలాగూ సినిమా కథ లాజిక్ కు దూరమే. అందుకే సినిమా ముగింపు కూడా అలాగే వుంటుంది. అందువల్ల పెద్దగా ఎగ్జయిటింగ్ గా అనిపించదు సినిమా. కేవలం జస్ట్ ఓ కాలక్షేపం బటానీ అనుకుని చూసేయడం తప్ప.

కానీ సినిమాలో ఇటు ఫోటోగ్రఫీ కావచ్చు, బిజిఎమ్ కావచ్చు. లైటింగ్ వర్క్, లోకేషన్లు అన్నీ కలిసి ఓ సీరియస్ ఎటెంప్ట్ అన్న ఫీల్ ను కలిగిస్తాయి. ప్రశాంత్ వర్మ మాంచి థ్రిల్లర్ తీస్తే బాగుండును అని అనిపిస్తుంది. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి చివరి వరకు చాలా చోట్ల మంచి కేమేరా పనితనం కనిపిస్తుంది. అలాగే నేపథ్యసంగీతం కూడా. కానీ ఇవన్నీ ఓ లెవెల్ లో వుండి, అసలు కీలకమైన సబ్జెక్ట్ మాత్రం వాటికి తగిన స్థాయిలో లేకపోవడం అన్నది మైనస్ అయింది.

జబర్దస్త్ గెటప్ శీనుకు తొలిసారి మంచి పాత్ర దొరికింది. బాగా చేసాడు. అలాగే మిర్చి హేమంత్ కు కూడా. కమెడియన్ గా మారడానికి వీలయిన పాత్ర. హీరో హీరోయిన్లు ఇద్దరికీ నిడివి వుంది తప్ప స్కోప్ వున్న పాత్రలు కావు. హీరోయిన్ ఆనంది ఆ పాత్రకు ఓకె. సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ కు చోటు తక్కువ. వున్నంతలో బెటర్ అవుట్ ఇవ్వడానికి దర్శకుడు ట్రయ్ చేసాడు. అతని ప్రయత్న లోపం లేదు స్క్రిప్ట్ కు అనుకున్న బేసిక్ లైన్ లో తప్ప.

మొత్తం మీద చూసుకుంటే సరదా వుంటే ఓసారి లుక్కేయచ్చు. లేదంటే డిజిటల్ రిలీజ్ వరకు వెయిట్ చేయొచ్చు.

ఫినిషింగ్ టచ్….విషయం తక్కువ-ప్యాడింగ్ ఎక్కువ

-సూర్య

Click Here for Recommended Movies on OTT (List Updates Daily)