పుష్ప 2 రచ్చకు రంగం సిద్ధమవుతోంది  

ముందు ప్రకటించినట్టు డిసెంబర్ 6 కాకుండా ఒక రోజు ముందు డిసెంబర్ 5 పుష్ప పార్ట్ టూ ది రూల్ విడుదల కావడం దాదాపు ఖరారైనట్టే. అధికారిక ప్రకటన మరికొద్ది రోజుల్లో ఇస్తారని తెలిసింది. డిస్ట్రిబ్యూటర్లకు ఈ మేరకు సమాచారం అందిందని ట్రేడ్ టాక్. దేవరకు ప్లాన్ చేసినట్టునే భారీ ఎత్తున అర్ధరాత్రి ఒంటి గంటకు ప్రీమియర్లు మొదలుపెట్టడంలో ఎలాంటి డౌట్ లేదు. జూనియర్ ఎన్టీఆర్ చేసిన రచ్చకు రెట్టింపు స్థాయిలో అల్లు అర్జున్ ర్యాంపేజ్ చూపించేందుకు బన్నీ ఫ్యాన్స్ సమాయత్తమవుతున్నారు. ఏపీ, తెలంగాణ, కేరళలో అత్యధిక థియేటర్లలో స్పెషల్ షోలు ప్లాన్ చేయబోతున్నట్టు వినికిడి.

ఇంతే కాదు పుష్ప 2 మీదున్న క్రేజ్ దృష్టిలో పెట్టుకుని ఉత్తరాది రాష్ట్రాల్లో డిసెంబర్ 4 రాత్రి తొమ్మిది గంటల నుంచి షోలు వేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో మైత్రి మేకర్స్ ఉన్నారట. అయితే అంత త్వరగా వేయడం వల్ల త్వరగా  టాక్ రావడంతో పాటు థియేటర్లో షూట్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో బయటికి వస్తాయి కాబట్టి నిర్ధారణగా ఇంకా నిర్ణయం తీసుకోలేదట. ఒకవేళ ఓకే అనుకున్నా పదకొండు గంటల నుంచి ఉండొచ్చట. మొత్తానికి డిస్ట్రిబ్యూటర్లు కనివిని ఎరుగని స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దేవర కన్నా కనీసం ముప్పై శాతం ఎక్కువగా అదనపు షోలు పడే సూచనలున్నాయి.

ఇక టికెట్ రేట్ల పెంపుకు సంబంధించి ఎలాంటి టెన్షన్ లేదు. తెలంగాణలో గరిష్టంగా పర్మిషన్ వచ్చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ సూచనల మేరకు పెద్ద బడ్జెట్ ప్యాన్ ఇండియా మూవీస్ కి అడిగినంత హైక్ ఇస్తున్నారు కాబట్టి మైత్రికి ఎలాంటి టెన్షన్ లేదు. పైగా పోటీ కూడా పెద్దగా లేదు. నవంబర్ చివరి వారం, డిసెంబర్ ఫస్ట్ వీక్ లో పుష్ప 2కి జడిసి ఎవరూ క్లాష్ కి సిద్ధపడటం లేదు. విక్కీ కౌశల్ చావా ఒకటే సవాల్ విసురుతోంది. చివరి నిమిషంలో ఏమైనా డ్రాప్ అయితే చెప్పలేం. వెయ్యి కోట్ల గ్రాస్ ని టార్గెట్ గా పెట్టుకున్న పుష్ప 2 ది రూల్ కి యునానిమస్ టాక్ వస్తే మాత్రం టార్గెట్ ఈజీనే.