చ‌ర‌ణ్‌, తార‌క్ ఫ్రెండ్షిప్.. చిరు ఖుషీ

Chiranjeevi NTR and Ram Charan
Chiranjeevi NTR and Ram Charan

మెగా, నంద‌మూరి కుటుంబాల మ‌ధ్య ఉన్న అంత‌రం.. అభిమానుల మ‌ధ్య శ‌త్రుత్వం గురించి కొత్త‌గా చెప్పాల్సిన ప‌ని లేదు. ఇది ద‌శాబ్దాల నుంచి న‌డుస్తున్న చ‌రిత్రే. అలాంటిది ఈ రెండు కుటుంబాల‌కు చెందిన ఇద్ద‌రు అగ్ర క‌థానాయ‌కులు క‌లిసి సినిమా చేస్తార‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు.

కానీ రామ్ చ‌ర‌ణ్‌, జూనియ‌ర్ ఎన్టీఆర్ క‌లిసి ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ఇద్ద‌రూ క‌లిసి ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నారు. వీళ్లిద్దరూ ఆఫ్ ద సెట్స్ కూడా చాలా స్నేహంగా ఉంటున్న సంగ‌తి ప‌లు సంద‌ర్భాల్లో రుజువైంది. సంబంధిత ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. అభిమానులు వీరి స్నేహం విష‌యంలో ఎలా ఫీల‌వుతున్నారో కానీ.. చ‌ర‌ణ్ తండ్రి చిరంజీవికి మాత్రం వీరి స్నేహం ముచ్చ‌ట‌గొలుపుతోంద‌ట‌.

ఇండ‌స్ట్రీలో అగ్ర క‌థానాయ‌కులు వ్య‌క్తిగ‌తంగా స్నేహంగా మెల‌గ‌డం వ‌ల్ల ఎంతో మేలు జ‌రుగుతుంద‌ని.. త‌న వ‌ర‌కు అంద‌రితో స్నేహంగా ఉండ‌టానికి ఎంతో త‌పించేవాడిన‌ని చిరు ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇద్ద‌రు స్టార్ హీరోలు అన్న‌ద‌మ్ముల్లా మెలిగితే వాళ్ల‌ అభిమానుల మ‌ధ్య కూడా అలాంటి వాతావ‌ర‌ణ‌మే ఉంటుంద‌ని.. అందుకే ఈ విష‌యంలో తానెంత త‌ప‌న ప‌డేవాడినో ఇండ‌స్ట్రీ జ‌నాలంద‌రికీ తెలుస‌ని చిరు అన్నాడు.

తోటి హీరోలతో స‌ఖ్య‌త‌తో మెలిగే విష‌యంలో చ‌ర‌ణ్ త‌న‌ను అనుస‌రిస్తున్నాడ‌ని.. తార‌క్‌తో అత‌డికి వ్య‌క్తిగ‌తంగా మంచి స్నేహం ఉంద‌ని చిరు చెప్పాడు. వీరి స్నేహం త‌న‌కు ముచ్చ‌ట‌గొలుపుతుంద‌న్న చిరు.. ప్ర‌స్తుతం స్టార్ హీరోలంద‌రూ కూడా బ‌య‌ట స్నేహితుల్లా మెల‌గ‌డం మంచి ప‌రిణామం అన్నాడు.