ఇండస్ట్రీలో ఒక తరం దర్శకులు మెల్లగా కనుమరుగైపోయే పరిస్థితి వచ్చింది. లేటెస్ట్ ట్రెండును పట్టుకోలేక, పాత పద్ధతిని వదులుకోలేక సతమతమవుతున్న సీనియర్ల లెక్క రోజురోజుకు ఎక్కువవుతోంది. ఎంత రాజమౌళి ఉన్నా కూడా పూరి డైలాగ్స్, వినాయక్ మాస్ ఎలిమెంట్స్, కృష్ణవంశీ ఫ్యామిలీ ఎమోషన్స్, శ్రీనువైట్ల కామెడీ డ్రామాలు.. ఆడియెన్స్ మిస్సవుతున్నారనే చెప్పాలి.
దాదాపు ఈ నలుగురు దర్శకుల కెరీర్ ఒకే టైమ్ లోనే స్టార్ట్ అయ్యింది. టాలీవుడ్ లో 10 ఏళ్ళ క్రితం వీరి హవానే ఎక్కువగా నడిచింది. ఒకరికొకరు సంబంధం లేకుండా డిఫరెంట్ స్టైల్ లో పవర్ఫుల్ ట్రెండ్ అయితే సెట్ చేశారు. దాదాపు ప్రతీ హీరో కూడా వీరితో ఒక్క సినిమా అయినా చేస్తే చాలు అనుకునే దశను చూశారు.
ఇటీవల శ్రీనువైట్ల విశ్వంతో మళ్ళీ ట్రాక్ లోకి వస్తాడు అనుకుంటే అసలు మినిమమ్ ఇంపాక్ట్ చూపించలేకపోయారు. డీ, వెంకీ, రెడీ, దూకుడు లాంటి కామెడీ సినిమాలతో బిగ్ హిట్స్ అందుకున్న ఆయన గత పదేళ్ళలో ఒక్క హిట్ కూడా చూడలేదు. ఆగడు సినిమాతో వైట్ల సక్సెస్ ఫుల్ కెరీర్ అక్కడే ఆగిపోయింది.
ఇక పూరి జగన్నాథ్ అంటేనే పవర్ఫుల్ డైలాగ్స్ గుర్తొస్తాయి. దానికి తోడు హీరో క్యారెక్టర్ తోనే సినిమాకు సగం ఊపు తెస్తారు. అలాంటిది టెంపర్ తరువాత అంతగా ఇంపాక్ట్ చూపలేదు. మధ్యలో ఇస్మార్ట్ శంకర్ కు కలెక్షన్లు బాగానే వచ్చినా అది పూరి స్థాయి సినిమా కాదనేది కొందరి మాట. అనంతరం లైగర్ – డబుల్ ఇస్మార్ట్ లతో పూరి ఊహించని డిజాస్టర్స్ ఎదుర్కొన్నారు.
ఇక వివి.వినాయక్ – కృష్ణవంశీ ఇద్దరు కూడా ఫామ్ కోల్పోయక సినిమాలపై మళ్ళీ ఫోకస్ చేసినట్లు అనిపించడం లేదు. ఈమధ్య రీ రిలీజ్ ట్రెండులోనే చెన్నకేశవ రెడ్డి, మురారి సినిమాలతో ఈ ఇద్దరి పేర్లు గట్టిగానే వినిపించాయి. మళ్ళీ న్యూ ప్రాజెక్టులతో బౌన్స్ బ్యాక్ అవుతామని పలు ఇంటర్వ్యూలలో అయితే చెప్పారు. ఇక దాదాపు వీరి తరహాలోనే తేజ, గుణశేఖర్ లాంటి దర్శకులు కూడా ఫామ్ కోల్పోయారు. కానీ చిన్న చిన్న ప్రాజెక్టులతో ఏదో ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏదేమైనా ఈ దర్శకులు ఫామ్ లోకి రావాలని చాలామంది ఆడియెన్స్ కోరుకుంటున్నారు.