కబ్జాని మించిపోయేలా మార్టిన్ దెబ్బ

భారీ అంచనాలేం లేవు కానీ ఏదైనా సర్ప్రైజ్ ఇస్తుందేమోనని మార్టిన్ మీద కాసింత నమ్మకం పెట్టుకున్న మూవీ లవర్స్ తెలుగులోనూ లేకపోలేదు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన పొగరు ద్వారా మనకు పరిచయమైన ధృవ సర్జ స్వయానా యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు. కన్నడలో మాస్ హీరోగా చెప్పుకోదగ్గ ఇమేజ్ ఉన్నప్పటికీ ఇతని డబ్బింగులు టాలీవుడ్ కు తక్కువే వచ్చాయి. అయినా సరే ట్రైలర్ చూశాక మార్టిన్ లో ఏదో మ్యాటర్ ఉండొచ్చనే అనుకున్నారు జనాలు. కుక్కను చూసి నక్క వాత పెట్టుకున్న తరహాలో కెజిఎఫ్ ప్రభావంతో కబ్జా ఇచ్చిన షాక్ మర్చిపోకముందే మార్టిన్ వచ్చేశాడు.

కథాపరంగా పెద్ద విశేషం ఏమీ లేదు. పాకిస్థాన్ జైలుకు వెళ్లిన అర్జున్ అనే కస్టమ్స్ ఆఫీసర్ అక్కడ జరిగిన కొన్ని సంఘటనల వల్ల గతాన్ని మర్చిపోతాడు. కారణం ఏంటయ్యా అంటే మార్టిన్ అని తెలుస్తుంది. ఆ తర్వాత మొదలవుతుంది అసలు డ్రామా. లైన్ సంగతి పక్కన పెడితే విపరీతమైన శబ్ద కాలుష్యంతో దర్శకుడు ఏపి అర్జున్ ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకున్నాడో ఎంత బుర్ర గోక్కున్నా అర్థం కాదు. ధృవ సర్జతో పాటు ఆర్టిస్టులందరూ చేసిన ఓవరాక్షన్ తో పోటీ పడుతూ రవి బస్రూర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చెవులకు చిల్లులు పెట్టడంతో మెదడు లోపల కూడా డ్రిల్లింగ్ మెషీన్ తో తూట్లు పొడుస్తుంది.

ఒక్క ఎపిసోడ్ ఎంగేజింగ్ గా లేకుండా ఎప్పుడు అయిపోతుందా అనిపించేలా చేయడంతో అర్జున్ సక్సెసయ్యాడు. అవసరం లేని ఎలివేషన్లు, హద్దులు దాటిన అరుపులు, మితిమీరిన ఫైట్లు, క్రమపద్ధతి లేకుండా వచ్చిపోయే పాత్రలు వాటి తాలూకు సంఘర్షణలు, మణిశర్మ పాటలు ఒకటా రెండా చెప్పుకుంటూ మార్టిన్ మైనస్సుల లిస్టు చాంతాడంత అవుతుంది. కేవలం గ్రాండియర్ ని నమ్ముకుని వివిఎఫెక్స్ మీద శ్రద్ధ వహించకుండా మార్టిన్ ని తీసిన తీరు చివరిదాకా థియేటర్లో కూర్చోవడం కష్టమనించేలా సాగింది. శాండల్ వుడ్ వీలైనంత కెజిఎఫ్ హ్యాంగోవర్ నుంచి బయటపడకపోతే నష్టపోయే నిర్మాతల లిస్టు పెరుగుతుంది.