తమిళ సినిమాలను తమిళ టైటిళ్లతోనే తెలుగులో రిలీజ్ చేస్తుండడం మీద తాజాగా సామాజిక మాధ్యమాల్లో చర్చ ఊపందుకుంది. గతంలో ‘వలిమై’ సినిమాను అదే టైటిల్‌తో తెలుగులో రిలీజ్ చేశారు. ఆ మధ్య ‘జిగర్ తండ డబులెక్స్’ సినిమాను అదే పేరుతో విడుదల చేశారు. ఇటీవల ‘రాయన్’ మూవీ అదే టైటిల్‌తో తెలుగులోకి వచ్చింది.
లేటెస్ట్‌గా సూపర్ స్టార్ రజినీకాంత్ చిత్రం ‘వేట్టయాన్’ను కూడా అదే పేరుతో విడుదల చేస్తుండడం ప్రేక్షకులకు ఆగ్రహం తెప్పించింది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్న అగ్ర నిర్మాతలు సురేష్ బాబు, దిల్ రాజు ఓ ప్రెస్ మీట్ పెట్టి దీని వెనుక కారణం వెల్లడించారు. ‘వేట్టయాన్’కు తెలుగులో ‘వేటగాడు’ అని పేరు పెడదామనుకున్నప్పటికీ.. ఆ టైటిల్ వేరే వాళ్ల దగ్గర ఉండడం, ఇది పాన్ ఇండియా మూవీ కావడంతో వేరే ఆప్షన్ లేక తమిళ టైటిల్‌తోనే రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా ‘గేమ్ చేంజర్’ టైటిల్ విషయంలో తాము పడ్డ ఇబ్బందిని కూడా నిర్మాత దిల్ రాజు బయటపెట్టారు. రామ్ చరణ్‌తో సినిమాకు ‘గేమ్ చేంజర్’ అనే టైటిల్ పెడదామని శంకర్ ఫిక్స్ అయ్యాక అది పాన్ ఇండియా సినిమా కావడంతో కామన్‌గా ఇదే ఉండాలని భావించారని.. కానీ కొన్ని భాషల వరకు ఇబ్బంది లేకపోయినా.. ఒక లాంగ్వేజ్‌లో ఆ టైటిల్ దొరకలేదన్నారు.
ఆ పేరు మీద వేరే వాళ్లకు హక్కులు ఉండడంతో వాళ్లతో మాట్లాడి సెటిల్మెంట్ చేసి టైటిల్ తీసుకోవడం చాలా ఇబ్బంది అయిందని దిల్ రాజు తెలిపాడు. పాన్ ఇండియా సినిమాలు తీసేటపుడు ఈ ఇబ్బంది ఎక్కువ ఉంటోందని.. అందరికీ నప్పే కామన్ టైటిల్ పెట్టడంలో సమస్య తప్పట్లేదని దిల్ రాజు వివరించారు. ‘వేట్టయాన్’కు ఇదే సమస్య తలెత్తి.. తెలుగులో దీనికి సమానమైన టైటిల్ అందుబాటులో లేక ‘వేట్టయాన్’ అనే పేరుతోనే రిలీజ్ చేయాల్సి వస్తోందని రాజు తెలిపారు.