చియాన్ విక్రమ్ నటించిన తంగలాన్ థియేటర్లలో విడుదలై నెలలు గడిచిపోతున్నా ఇప్పటిదాకా ఓటిటిలో రాలేదు. విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ కమర్షియల్ గా ఈ సినిమా పెద్ద విజయం సాదించలేదన్నది వాస్తవం. తెలుగులో మొదటి వారం డీసెంట్ వసూళ్లు దక్కడం కొంత ఊరట కలిగించే విషయం కాగా తమిళంలో యావరేజ్ దగ్గరే ఆగిపోయింది.
హిందీలో డిజాస్టర్ పదం చిన్నదే. కర్ణాటక, కేరళలో పట్టించుకోలేదు. సరే ఇలాంటి సినిమాలకు స్పందనల సంగతి ఎలా ఉన్నా ఓటిటిలో మాత్రం ఎగబడి చూస్తారు. గత నెల 20నే డిజిటల్ లో వస్తుందనే ప్రచారం జరిగింది కానీ తీరా చూస్తే రాలేదు.
ఎందుకయ్యా అంటే డీల్ కు సంబంధించిన వ్యవహారం చిక్కుల్లో పడటం వల్లనట. చెన్నై టాక్ ప్రకారం ముందు అగ్రిమెంట్ చేసుకున్న ఓటిటి సంస్థ ఇస్తామని చెప్పిన మొత్తానికి, రిలీజయ్యాక ఇప్పుడు ఆఫర్ చేస్తున్న ధరకు మధ్య సుమారు ఇరవై కోట్ల దాకా వ్యత్యాసం ఉండటం వల్లే తంగలాన్ డిజిటల్ త్రిశంకు స్వర్గంలో ఊగుతోందని అంటున్నారు.
ఒప్పందంలో రాసుకున్న ఒక క్లాజ్ ప్రకారం ఒకవేళ సినిమా కనక బాగా ఆడక, రివ్యూలు, పబ్లిక్ టాక్ నెగటివ్ గా ఉన్న పక్షంలో ధరను సవరించుకునే వెసులుబాటు ఉందట. దాన్ని చూపించే ఆ ఓటిటి సంస్థ మెలిక పెట్టి ఓటిటి స్ట్రీమింగ్ ఆలస్యం చేస్తోందని అంటున్నారు.
ఒకవేళ ముందు మాట్లాడుకున్న కంపెనీ కనక వద్దనుకుంటే వేరే సంస్థతో మాట్లాడేందుకు తంగలాన్ నిర్మాతలు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. విక్రమ్ లాంటి స్టార్ హీరో, వందల కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ప్యాన్ ఇండియా మూవీకి ఇలాంటి పరిస్థితి అంటే విచిత్రమే.
పా రంజిత్ దర్శకత్వం వహించిన ఈ పీరియాడిక్ విలేజ్ డ్రామాని రెండో భాగం తీయాలని ప్లాన్ చేసుకున్నారు కానీ అంతర్గత సమాచారం ప్రకారం అదేమీ ఉండకపోవచ్చట. కెజిఎఫ్, బాహుబలి రేంజులో కనక తంగలాన్ కనక ఆడి ఉంటే ఇప్పుడీ డిస్కషన్ ఉండేది కానీ ఫ్లాప్ టాక్ రావడం వల్లే ఇన్ని తంటాలు పడాల్సి వచ్చింది. సెటిలవ్వడానికి టైం పట్టేలా ఉంది.