కర్ణుడిగా సూర్య.. అప్డేట్ వచ్చింది

ఇటీవలే ‘కల్కి’ సినిమాలో కాసేపు ప్రభాస్ కర్ణుడిగా కనిపిస్తే.. ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వచ్చిందో తెలిసిందే. మహాభారతంలో ఎన్నో గొప్ప పాత్రలు ఉన్నా.. కర్ణుడి పట్ల జనాలకు ఉన్న ఆపేక్ష ప్రత్యేకమైంది. కర్ణుడి పుట్టుక నుంచి ప్రతిదీ భిన్నంగా ఉంటుంది. గొప్ప వీరుడిగా కర్ణుడి గాథ జనాల దృష్టిని బాగా ఆకర్షిస్తుంది.

మహాభారత నేపథ్యంలో వచ్చే అనేక సినిమాల్లో కర్ణుడి పాత్ర హైలైట్ అయింది. ఐతే ఇంత ఆకర్షణీయ పాత్ర మీద సోలోగా ఓ సినిమా తీయాలని ఫిలిం మేకర్స్ ప్రయత్నిస్తున్నారు కానీ.. కార్యరూపం దాల్చట్లేదు.

విక్రమ్ హీరోగా ఓ మలయాళ దర్శకుడు భారీ సినిమా తీయడానికి సన్నాహాలు జరిగాయి కానీ.. ఆ ప్రాజెక్టు కొన్ని కారణాల వల్ల ముందుకు కదల్లేదు. తర్వాత సూర్య హీరోగా బాలీవుడ్ దర్శకుడు రాకేశ్ ఓం ప్రకాష్ మెహ్రా కర్ణుడి కథతో సినిమా తీస్తాడని వార్తలు వచ్చాయి. కానీ దీని గురించి కూడా తర్వాత ఊసులేమీ లేవు.

ఐతే తాజాగా రాకేశ్ మెహ్రా.. సూర్యతో కర్ణుడి సినిమా గురించి స్పందించారు. తమ కలయికలో ఈ సినిమా రాబోతున్నట్లుగా వస్తున్న వార్తలు నిజమేనని.. ఇది రూమర్ కాదని మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం ఆ సినిమా కోసం ప్రి ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు వెల్లడించారు.

దీంతో ఈ మెగా మూవీ పక్కాగా ఉంటుందని స్పష్టమైంది. ఏకంగా రూ.500 కోట్ల బడ్జెట్లో ఈ సినిమాను రూపొందించేందుకు రాకేశ్ అండ్ కో సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం స్క్రిప్టుతో పాటు ఇతర పూర్వ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

కర్ణుడి లాంటి క్యారెక్టర్ని సూర్య లాంటి మేటి నటుడు, సూపర్ స్టార్ పోషిస్తే ఆ పాత్రకు వచ్చే వెయిటే వేరుగా ఉంటుంది. సరిగ్గా సినిమా తీయాలే కానీ.. ఇండియన్ ఫిలిం హిస్టరీలో ఒక ఎపిక్ మూవీగా నిలిచే అవకాశముంది. వచ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్ మీదకి వెళ్లొచ్చని భావిస్తున్నారు.