విడుదలకు ముందు హైదరాబాద్ లో జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ విపరీతమైన రద్దీ వల్ల రద్దు కావడం జూనియర్ ఎన్టీఆర్ తో పాటు అతని అభిమానులనూ విపరీతంగా కలవరపరిచింది. నోవాటెల్ ప్రాంగణంలో మహా అయితే ఎనిమిది వేల మందికే అనుమతి సాధ్యం కాగా ఏకంగా దానికి నాలుగింతలు ఎక్కువ ఫ్యాన్స్ రావడంతో కంట్రోల్ చేయలేక పోలీసులు వేడుకను క్యాన్సిల్ చేశారు.
ఆ అసంతృప్తిని తొలగిస్తూ దేవర బ్లాక్ బస్టర్ అయ్యింది. రెండో వారంలో అడుగు పెట్టే సమయానికి 396 కోట్ల గ్రాస్ సాధించి దసరా సెలవులను వాడుకునే దిశగా అడుగులు వేయడం మొదలుపెట్టింది.
ఈ నేపథ్యంలో ఇప్పుడైనా ఒక గ్రాండ్ సక్సెస్ మీట్ జరపాలని ఫ్యాన్స్ కోరుకున్నారు. దానికి అనుగుణంగానే గుంటూరు, మంగళగిరి ప్రాంతంలో నిర్వహించేందుకు ప్లాన్ కూడా చేసుకున్నారు.
అయితే దసరా నవరాత్రుల సందర్భంగా వివిధ ప్రాంతాల్లో పోలీస్ శాఖ బిజీగా ఉండటంతో పాటు రాజకీయ నాయకుల పర్యటనలకు సరిపడా సిబ్బంది సరిపోకపోవడంతో దేవర ఈవెంట్ కి వచ్చే పరిస్థితిలో లేరు.
తెలంగాణలోనూ ఇదే సిచువేషన్ ఉండటంతో మరోసారి దేవర ప్రేమికులకు నిరాశ కలిగిస్తూ నో వేడుకని ప్రకటించాల్సి వచ్చింది. డిస్ట్రిబ్యూటర్ నాగవంశీ స్వయంగా అనౌన్స్ మెంట్ ఇచ్చారు.
తమ హీరోని ప్రత్యక్షంగా కలుసుకుని విజయాన్ని పంచుకోవాలని ఎదురు చూసిన అభిమానులకు ఇది ఎంత మాత్రం రుచించే వార్త కాకపోయినా ఇంతకన్నా వేరే మార్గం లేదు. ప్రస్తుతానికి దేవర మంచి స్పీడ్ మీద ఉన్నాడు.
ఒకవేళ ఇదే జోరు ఇంకో రెండు మూడు వారాలు కొనసాగిస్తే యాభై రోజుల వేడుక కూడా ఛాన్స్ ఉంటుంది. ఈ మధ్య కమిటీ కుర్రోళ్ళు ఇలాగే సెలెబ్రేట్ చేసుకున్నారు. కాకపోతే కొత్త రిలీజుల దృష్ట్యా అప్పటిదాకా దేవర ఎన్ని సెంటర్లలో రన్ ఉంటుందనేది కీలకం కానుంది. రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ చేసిన హీరోగా జూనియర్ ఎన్టీఆర్ సృష్టించిన రికార్డుని ఫ్యాన్స్ సెలెబ్రేట్ చేసుకుంటున్నారు.