గత వారం భారీ అంచనాల మధ్య వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ సినిమా ‘దేవర’ తొలి వీకెండ్లో మంచి వసూళ్లే రాబట్టింది. సోమవారం కలెక్షన్లు బాగానే డ్రాప్ అయినప్పటికీ.. దసరా సెలవులు ఆ సినిమాకు కలిసొస్తాయనే భావిస్తున్నారు.
‘దేవర’కు మిక్స్డ్ టాక్ ఉంది కానీ.. చూడలేని సినిమా అనే టాక్ అయితే లేదు. పైగా అది పెద్ద సినిమా. సెలవుల్లో ఇలాంటి సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తారు. ఇప్పటిదాకా ‘దేవర’కు పోటీయే లేదు.
కానీ ఈ శుక్రవారం ‘శ్వాగ్’ అనే మిడ్ రేంజ్ సినిమా వస్తోంది. ఆ సినిమా క్రేజీ టీజర్, ట్రైలర్లతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. టీం సినిమా మీద చాలా నమ్మకంగా ఉంది. సినిమా వర్కవుట్ అయితే.. శ్రీ విష్ణు కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ పడేలా ఉంది. మరి ఈ సినిమా ‘దేవర’ను దెబ్బ కొడుతుందా.. లేక దేవర వల్ల దెబ్బ తింటుందా అన్నది ఆసక్తికరం.
‘దేవర’తో పాటుగా తమిళ అనువాద చిత్రం ‘సత్యం సుందరం’ రిలీజైంది. ఆ సినిమాకు చాలా మంచి టాక్ వచ్చినప్పటికీ.. బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు ఫలితాన్నే అందుకుంది. వచ్చిన టాక్ ప్రకారం చూసుకుంటే ‘దేవర’ను దెబ్బ కొట్టి ఉండాలి. కానీ అలా జరగలేదు. వేరే రోజుల్లో రిలీజైతే ఇంకా మంచి ఫలితం వచ్చేదని.. ‘దేవర’ వల్ల ఈ సినిమా ఎక్కువగా ప్రేక్షకుల దృష్టిలో పడలేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఈ నేపథ్యంలో ‘శ్వాగ్’ పరిస్థితి ఏమవుతుందని చూడాలి. వారం గడిచిపోయింది కాబట్టి ప్రేక్షకులు ఆటోమేటిగ్గా కొత్త సినిమా వైపు చూస్తారు. ‘ఎ’ సెంటర్ ఆడియన్స్‌లో ఈ సినిమా మీద మంచి అంచనాలున్నాయి. కానీ మాస్ ప్రస్తుతానికి పట్టించుకునే పరిస్థితి లేదు.
ఇప్పుడు సినిమాకు ఎలాంటి టాక్ వస్తుందన్నది కీలకం. టీజర్, ట్రైలర్ అంత క్రేజీగా సినిమా కూడా ఉంటే.. ‘దేవర’ మీద కచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తుంది. కానీ సినిమా అంచనాలకు తగ్గట్లు లేదంటే మాత్రం ‘దేవర’ దెబ్బకు బలైపోవాల్సిందే. రెండో వీకెండ్లోనూ ‘దేవర’ దుమ్ము దులిపేస్తుంది.