దేవర లాంటి ప్యాన్ ఇండియా మూవీతో తలపడటం అంత సులభం కాదు. అందులోనూ డబ్బింగ్ సినిమా అయితే రిస్క్ ఇంకా ఎక్కువ. కానీ కార్తీ ఆ సాహసం చేస్తున్నాడు. అరవింద్ స్వామి కాంబినేషన్ లో తను నటించిన సత్యం సుందరం ఒక రోజు ఆలస్యంగా సెప్టెంబర్ 28 శనివారం థియేటర్లలో రిలీజ్ కానుంది. తెలుగు చక్కగా మాట్లాడే కార్తీ ప్రమోషన్ల విషయంలో రాజీ పడడు. ముఖ్యంగా ఖైదీ, నా పేరు శివ, యుగానికి ఒక్కడు లాంటి హిట్స్ తో తనకు మంచి మార్కెట్ ఇచ్చిన టాలీవుడ్ ప్రేక్షకులంటే మహా ప్రేమ. అందుకే నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కార్తీ మాటలతో వచ్చినోళ్లను పడగొట్టేశాడు.
సోదరుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నానని, దేవర వార్ లాంటిది అయితే తమది సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టని చమత్కరించాడు. ఇందులో పాటలు ఫైట్లు ఉండవని తనదైన శైలిలో దిల్ రాజుని అనుకరించి చెప్పడం పేలింది. తిరుపతి లడ్డు వివాదం గురించి ప్రస్తావిస్తే సున్నితమైన అంశాన్ని అలాగే వదిలేద్దామని దాటేయడం మంచిదయ్యింది. కళాతపస్వి కె విశ్వనాథ్ గారితో సినిమా చేయలేని లోటు ఇప్పుడే సత్యం సుందరం తీర్చిందని, 96 లాంటి క్లాసిక్ ఇచ్చిన ప్రేమ్ కుమార్ మరో చక్కని ఆణిముత్యాన్ని తనకు అందించాడని ప్రశంసలు గుప్పించాడు.
ఆద్యంతం హుషారుగా కనిపించిన కార్తీ ఇందులో మాస్ కంటెంట్ ఉండదని స్పష్టంగా చెప్పాడు. ట్రైలర్ లో ఫీల్ గుడ్ నెస్ సినిమా మొత్తం ఉంటుందని హామీ ఇస్తున్నాడు. కేవలం ఒక రాత్రి జరిగే సంఘటనల ఆధారంగా రూపొందిన సత్యం సుందరం టీమ్ ని ఇంకో విషయంలో మెచ్చుకోవచ్చు. తమిళ టైటిల్ యధాతథంగా ఉంచకుండా తెలుగులో సులభంగా అర్థమయ్యేలా పాత్రల పేర్లు పెట్టి మంచి పని చేశారు. కాకపోతే దేవర ఉదృతిని తట్టుకోవడం అంత సులభంగా ఉండదు. ఏషియన్ సురేష్ సంయుక్త మద్దతు ఉంది కాబట్టి థియేటర్స్ పరంగా ఇబ్బంది లేదు కానీ టాక్ తెచ్చుకోవడం కీలకం.