‘ఉప్పెన’ సెన్సేషనల్ మూవీతో అరంగేట్రంలోనే తెలుగులో భారీ విజయాన్ని అందుకుంది కన్నడ అమ్మాయి కృతి శెట్టి. ఆమె నటించిన రెండో చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’ కూడా మంచి విజయాన్నే సాధించింది. ‘బంగార్రాజు’ పర్వాలేదనిపించింది. కానీ ఆ తర్వాత ఆమెకు అస్సలు కలిసి రాలేదు.
వరుస పరాజయాలు వెంటాడాయి. ది వారియర్, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, మాచర్ల నియోజకవర్గం, కస్టడీ.. ఇలా ఆమె చివరి చిత్రాలన్నీ నిరాశ పరిచాయి.దీంతో కెరీర్లో గ్యాప్ తప్పలేదు. ఈ మధ్యే ‘మనమే’ అనే సినిమాతో ఆమె రీఎంట్రీ ఇచ్చింది. కానీ అది కూడా ఆమెకు నిరాశనే మిగిల్చింది.
ఇటు తెలుగులో కలిసి రాక.. అటు తమిళంలోనూ తొలి చిత్రం ‘కస్టడీ’ నిరాశ పరచడంతో కెరీర్ బాగా డౌన్ అయిపోయే పరిస్థితి తలెత్తింది. ఇలాంటి టైంలో కృతి మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చింది.
మలయాళంలో ప్రస్తుతం రైజింగ్ స్టార్లలో ఒకడైన టొవినో థామస్ సరసన కృతి నటించిన సినిమా ‘ఏఆర్ఎం’. చారిత్రక నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా గత గురువారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీని రిలీజ్ చేశారు.
కానీ వేరే భాషల్లో పెద్దగా ప్రభావం చూపలేదు కానీ.. మలయాళంలో మాత్రం ఈ సినిమా సూపర్ హిట్ టాక్, బంపర్ ఓపెనింగ్స్ తెచ్చుకుంది. వీకెండ్లోనే రూ.50 కోట్ల క్లబ్బులోకి అడుగుపెట్టింది. తర్వాత కూడా స్ట్రాంగ్ రన్‌తో నడుస్తోంది ‘ఏఆర్ఎం’. టొవినో స్టార్ పవర్‌ను మరోసారి ఈ సినిమా రుజువు చేసింది.
వరుస పరాజయాలతో సతమతం అవుతున్న కృతికి ఈ సినిమా పెద్ద ఊరట అనడంలో సందేహం లేదు. సినిమాలో తన పాత్ర కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ మూవీ తర్వాత కృతి మలయాళంలో బిజీ అయ్యే అవకాశాలున్నాయి.ఈ చిత్రాన్ని ప్రముఖ తెలుగు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేయడం విశేషం. వారికి కూడా మలయాళంలో మంచి ఆరంభాన్నిచ్చింది ‘ఏఆర్ఎం’.