సందీప్ కిషన్ రిస్కు వెనుక మతలబు

2025 సంక్రాంతి రేసులో మహామహులు తలపడుతున్నారని బయ్యర్లు థియేటర్ల సర్దుబాటు గురించి ఇప్పటి నుంచే తలలు పట్టుకోవడం చూస్తున్నాం. చిరంజీవి విశ్వంభర, బాలయ్య 109, వెంకటేష్ – అనిల్ రావిపూడి, అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ / విదాముయార్చిలు రావడంలో ఎలాంటి అనుమానాలు లేవు.

చివరి నిమిషంలో ఏదైనా అనూహ్యంగా జరిగితే తప్ప ఈ నాలుగు కన్ఫర్మ్ గా దిగుతున్నాయి. అయితే ఇక్కడితో స్టోరీ అయిపోలేదు. సందీప్ కిషన్ – దర్శకుడు నక్కిన త్రినాధరావు కలయికలో రూపొందుతున్న ఎంటర్ టైనర్ ని సైతం సంక్రాంతికే రిలీజ్ చేయాలని ఫిక్స్ కావడం కొత్త ట్విస్టు.

అంత కాంపిటీషన్ లో రిస్క్ చేయడం ఎందుకనే మతలబు ఆలోచిస్తే కొన్ని విషయాలు అర్థమవుతాయి. మజాకా (రిజిస్టర్ చేసిన టైటిల్) కు ట్రేడ్ వర్గాల్లో క్రేజ్ ఉంది. రవితేజ ధమాకా తర్వాత త్రినాధరావు చేసిన మూవీ కావడంతో దానికి మించి ఎంటర్ టైనర్ అవుతుందనే నమ్మకం బయ్యర్లలో ఉంది.

దానికి తోడు ఓటిటి డీల్ సుమారు ఇరవై కోట్లకు పైగా ఆల్రెడీ అయిపోయిందట. అంటే బడ్జెట్ కన్నా ఎక్కువ రికవరీ డిజిటల్ అమ్మకంలోనే అయిపోయింది. థియేట్రికల్ హక్కుల కోసం ఉన్న డిమాండ్ ని దృష్టిలో పెట్టుకుంటే సులభంగా డబుల్ ట్రిపుల్ మార్జిన్ తో నిర్మాతలు సేఫ్ సైడ్ అయిపోతారు.

అయితే పోటీలోనే ఎందుకు దిగాల్సి వచ్చిందంటే బహుశా ఓటిటి సంస్థకు సంబంధించిన షెడ్యూల్ ఫిబ్రవరి ప్రీమియర్ ప్లాన్ చేసుకుని ఉండొచ్చు. దానికోసమైనా జనవరి థియేటర్ రిలీజ్ తప్పనిసరి. ఇంకోవైపు ఎంత అగ్ర హీరోలు బరిలో ఉన్నా సరే మీడియం సినిమాలు సక్సెస్ అయిన దాఖలాలు గతంలో ఉన్నాయి.

ఖైదీ నెంబర్ 150, గౌతమిపుత్రశాతకర్ణిలను తట్టుకుని శతమానంభవతి సూపర్ హిట్ అయ్యింది. గుంటూరు కారం, నా సామిరంగా, సైంధవ్ ని ఎదిరించి హనుమాన్ ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఆ నమ్మకంతోనే మజాకాని దించుతున్నారేమో. ఎల్లుండి ఫస్ట్ లుక్ పోస్టర్ రానుంది.