టికెట్ రేట్లకు పాజిటివ్ టాక్ తోడైతే

ఊహించినదాని కన్నా ఎక్కువగా ఏపీలో దేవరకు టికెట్ రేట్ల పెంపుకు అనుమతులు ఇచ్చేశారు. ఆ మేరకు అధికారిక జిఓ విడుదల కావడంతో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, నాగవంశీ తదితరులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్లు పెట్టారు.

ప్రతి టికెట్ పై సింగల్ స్క్రీన్లకు 110, మల్టీప్లెక్సులకు 135 రూపాయలు పెంచుకుని తొమ్మిది రోజుల పాటు అమలు చేసుకోవచ్చు. మొదటిరోజు అర్ధరాత్రి 12 గంటల నుంచే షోలు వేసుకునే వెసులుబాటు ఇవ్వగా రెండో రోజు నుంచి రోజుకు 5 షోలు వేసుకునేలా పర్మిషన్లు వచ్చాయి. చెప్పాలంటే కల్కి 2898 ఏడి కంటే ఎక్కువ హైక్ రావడం గమనించాల్సిన విషయం.

సో రికార్డులకు గ్రౌండ్ సెట్ అయ్యింది. పాజిటివ్ టాక్ రావడం ఆలస్యం నెంబర్లు భారీగా ఉండబోతున్నాయి. మిడ్ నైట్ షోలు కాబట్టి తెల్లవారేలోపు సినిమా ఎలా ఉందనే దాని మీద మీడియా, సామజిక మాధ్యమాలు హోరెత్తిపోతాయి. ఏదైనా సరే నిమిషాల్లో వైరల్ కావడం ఖాయం.

దేవర టీమ్ నమ్మకానికి తగినట్టే డిస్ట్రిబ్యూటర్లు స్పెషల్ షోలను ప్లాన్ చేస్తున్నారు. అరవింద సమేత వీరరాఘవ తర్వాత సోలో హీరోగా తారక్ కి ఇంత గ్యాప్ రావడం కెరీర్ లోనే మొదటిసారి. పలు కేంద్రాల్లో ఊళ్ళో ఉన్న అన్ని స్క్రీన్లలో దేవరనే ప్రదర్శించేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారంటే హైప్ అర్థం చేసుకోవచ్చు.

ఇప్పుడు మిగిలింది ప్రేక్షకుల అంచనాలు అందుకోవడమే. గత డిజాస్టర్ నుంచి దర్శకుడు కొరటాల శివ పూర్తిగా కోలుకుని కొత్త ఉత్సాహంతో కనిపిస్తున్నారు. పాజిటివ్ వైబ్స్ చూపిస్తున్నారు. తిరుమల వెళ్లి ఏడుకొండల వాడి దర్శనం చేసుకున్నారు.

ఎలాంటి టెన్షన్ లేకుండా పోస్ట్ ప్రొడక్షన్ త్వరగా పూర్తి చేసుకోవడంతో కంటెంట్ డెలివరీ వేగంగా జరిగిపోతోంది. ఓవర్సీస్ షోలలో ఒక్క క్షణం ఆలస్యం లేకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కాన్ఫిడెన్స్ చూస్తూనే ఉన్నాం. తెలంగాణ జిఓ సైతం ఏ క్షణమైనా రావొచ్చు. ఎప్పుడు ఇచ్చే పెంపు తప్ప ప్రత్యేకంగా ఉండకపోవచ్చు.