ఎప్పుడో బిచ్చగాడుతో బ్లాక్ బస్టర్ కొట్టిన విజయ్ ఆంటోనీ ఆ తర్వాత మళ్ళీ హిట్టు మొహం చూసింది దాని సీక్వెల్ బిచ్చగాడు 2తోనే. అది కూడా కమర్షియల్ గా సక్సెస్ అనిపించుకుంది తప్పించి మొదటి భాగం లాగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. దీనికి ముందు వెనుకా ఇతనివి ఎన్ని సినిమాలు వచ్చాయో లెక్కబెట్టడం కష్టం. మొన్న తుఫాన్ అంటూ పలకరించాడు. అదొకటి థియేటర్లలో ఉందనే సంగతి గుర్తించేలోపే మాయమైపోయింది. ఓటిటిలో వచ్చినా ఎవరూ పట్టించుకోలేదు. దానికి ముందు హత్యది ఇదే పరిస్థితి. ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్టు ఉంది.
ఇప్పుడు సెప్టెంబర్ 27 హిట్లర్ గా రాబోతున్నాడు. విశేషం ఏంటంటే దేవర లాంటి ప్యాన్ ఇండియా మూవీతో తలపడేందుకు సిద్ధపడటం. ఆ రోజు క్లాష్ ఎందుకనే ఉద్దేశంతోనే కార్తీ సత్యం సుందరం ఒక రోజు ఆలస్యంగా సెప్టెంబర్ 28న తెలుగు డబ్బింగ్ వస్తోంది. కానీ హిట్లర్ మాత్రం ఫేస్ టు ఫేస్ దేవరని సవాల్ చేస్తోంది. నిజానికి విజయ్ ఆంటోనీ టార్గెట్ ఇప్పుడు టాలీవుడ్ కాదు. తమిళంలో కార్తీ ఒకడే పోటీ ఉన్నాడు కాబట్టి తన సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే వర్కౌట్ చేసుకోవచ్చనే ఉద్దేశం. పైగా దసరాకి రజినీకాంత్ వెట్టయన్ బరిలో ఉంది కాబట్టి ఆలోపే థియేటర్ రన్ ముగించేసుకుని బయటపడాలి.
ఒక విషయంలో విజయ్ ఆంటోనీని మెచ్చుకోవాలి. ఎన్ని ఫ్లాపులు వస్తున్నా ఘజిని మొహమ్మద్ లాగా దండయాత్రలు చేస్తూనే ఉన్నాడు. హైదరాబాద్ వచ్చి మరీ ప్రత్యేకంగా ప్రమోషన్లలో పాల్గొంటూనే ఉన్నాడు. పెర్ఫార్మన్స్ పరంగా తన మీద కొన్ని కామెంట్స్ ఉన్నప్పటికి రెగ్యులర్ ఫార్ములాకు భిన్నంగా ఏదో ప్రయోగాలు చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు రిలీజవుతున్న హిట్లర్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందింది. ట్రైలర్ కొంచెం ఆసక్తికరంగానే ఉంది. చాలా కాలం తర్వాత ప్రతిఘటన ఫేమ్ చరణ్ రాజ్ ఫుల్ లెన్త్ విలన్ రోల్ పోషించాడు. చిరంజీవి టైటిల్ వాడుకున్నాడు మరి ఫలితం అలాగే వస్తుందేమో చూడాలి.