సంవత్సరాలు, నెలల నుంచి కౌంట్ డౌన్ ఇప్పుడు రోజుల్లోకి వచ్చేసింది. దేవర పార్ట్ 1 విడుదలకు సరిగ్గా పది రోజులు ఉన్న నేపథ్యంలో అభిమానుల ఆతృత అంతకంతా పెరిగిపోతోంది. ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ లో నమోదవుతున్న నెంబర్లు ఒకపక్క ట్రేడ్ వర్గాలకు షాక్ ఇస్తుండగా అంతకు పదింతల స్పందన తెలుగు రాష్ట్రాల్లో ఉంటుందని ఫ్యాన్స్ నమ్మకంగా ఎదురు చూస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ టీమ్ ఎడతెరిపి లేకుండా ప్రమోషన్లు చేస్తూనే ఉంది. ఇవాళ చెన్నైలో కీలక ఈవెంట్ ఉంటుంది. ముంబైలో చేసిన ట్రైలర్ లాంచ్, ప్రెస్ మీట్, మీడియా ఇంటర్వ్యూలు బజ్ పెరగడానికి దోహదపడ్డాయి.
ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మత్తువదలరా 2 తప్ప ఇంకే సినిమా చెప్పుకోదగ్గ స్థాయిలో ఆడటం లేదు. 35 చిన్న కథ కాదుకు టాక్ బాగుంది కానీ కింది స్థాయి కేంద్రాల్లో ఏమంత వసూళ్లు లేవు. ఈ వారం రాబోతున్న సుహాస్ గొర్రె పురాణం ఏమైనా అద్భుతం చేస్తే తప్ప దేవర వరకు పరిస్థితి డ్రైగానే ఉంటుంది. బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపుకి సంబంధించి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇబ్బందులు తలెత్తే సూచనలు లేవు. అడిగినంత హైక్ తో పాటు అదనపు ఆటలకు అనుమతులు వచ్చే సూచనలు పుష్కలంగా ఉన్నాయి. అర్ధరాత్రి ఒంటి గంట ప్రీమియర్లు దాదాపుగా ఖరారే.
సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా కొందరు చేస్తున్న ట్రోల్స్ పక్కనపెడితే సలార్ తరహాలో దేవర అండర్ కరెంట్ మార్కెటింగ్ చేస్తోంది. అంటే అతిగా పబ్లిసిటీ చేయకుండా ఒకరకంగా కొంచెం లో ప్రొఫైల్ మెయిటైన్ చేస్తూ థియేటర్లలోనే నేరుగా సర్ప్రైజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఎక్కువ హడావిడి చేయడం లేదు. దీని వల్ల అంచనాలకు వచ్చిన ఇబ్బందేమీ లేదు. ఓపెనింగ్స్ కు ఢోకా లేదు. టాక్ మీద నమ్మకంతోనే యుఎస్ తో పాటు ఇండియాలోనూ ఒకేసారి షోలు మొదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. కల్కి 2898 ఏడి తర్వాత మళ్ళీ ఆ స్థాయి ఓపెనింగ్స్, వసూళ్లు దీనికే వస్తాయని ఫ్యాన్స్ ధీమా.