ముందు లక్కు వెనుక చిక్కు

యూత్ హీరో సుహాస్ కొత్త సినిమా గొర్రె పురాణం ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కానుంది. ట్రైలర్ కూడా వచ్చేసింది. కసాయి కత్తికి బలి కావాల్సిన ఒక గొర్రె రెండు మతాల మధ్య విద్వేషాలకు కారణమవుతుంది. దాన్ని ఏకంగా జైల్లో వేస్తే సాటి ఖైదీగా ఉన్న హీరో కోర్టుకు వెళ్లి న్యాయం కోసం పోరాడతాడు.

స్థూలంగా ఇదీ కథ. పాయింట్ వెరైటీగా ఉంది కానీ ఎంతమేరకు థియేటర్ ఆడియన్స్ ని మెప్పిస్తుందనేది కంటెంట్ బాగుండటం మీద ఆధారపడి ఉంది. ప్రమోషన్లు భీభత్సంగా చేయడం లేదు. బజ్ కూడా అంతంత మాత్రమే. అవుట్ డోర్ పబ్లిసిటీ జరుగుతున్నా రీచ్ పూర్తి స్థాయిలో లేదు.

ఇప్పుడు లక్కు, చిక్కు విషయానికి వద్దాం. ముందుగా కలిసి వచ్చే అంశం ఏంటంటే బాగుందంటే చాలు చిన్న సినిమాలకు బాక్సాఫీస్ వద్ద మంచి ఆదరణ దక్కుతోంది. ఆయ్, కమిటీ కుర్రోళ్ళు దాన్నే ఋజువు చేశాయి. గతంలో ఇదే సుహాస్ అంబాజీపేట మ్యారేజీ బ్యాండు డీసెంట్ గా వర్కౌట్ అయ్యింది.

సో గొర్రె పురాణంకు టాక్ చాలా కీలకం. ఇక చిక్కు సంగతి చూస్తే వారం తిరక్కుండానే దేవర పార్ట్ 1 వస్తుంది. దీని మీద నెలకొన్న అంచనాల దృష్ట్యా తెలుగు రాష్ట్రాల్లోని అత్యధిక థియేటర్లలో దీన్నే ప్రదర్శించబోతున్నారు. బ్లాక్ బస్టర్ అనిపించుకుంటే పోటీలో ఎవరూ నిలబడే ప్రసక్తే ఉండదు.

సో గొర్రె పురాణం ఒక పాజిటివ్, ఒక నెగటివ్ పరిస్థితుల మధ్య నెగ్గుకురావాల్సి ఉంటుంది. అదే రోజుగా పోటీగా చెప్పుకోదగ్గవి లేకపోవడం మరో ప్లస్ పాయింట్. ఈ అవకాశం ఉందనే దిల్ రాజు బొమ్మరిల్లు రీ రిలీజ్ ని గ్రాండ్ గా ప్లాన్ చేశారు. దీన్నీ కాచుకోవాల్సి ఉంటుంది.

బాబీ దర్శకత్వం వహించిన గొర్రె పురాణంలో పాటలు పెద్దగా ఉన్నట్టు లేవు. బాగుంటే బజ్ కు తోడ్పడేవి. సుహాస్ ఈ సినిమా పట్ల ఎంత సీరియస్ గా ఉన్నాడో ఈ నాలుగు రోజులు చేయబోయే ప్రమోషన్ల మీద ఆధారపడి ఉంటుంది. ఇంకో ఇరవై రోజులు తిరగడం ఆలస్యం అక్టోబర్ 11 మరో చిత్రం జనక అయితే గనక రిలీజ్ కు వచ్చేస్తుంది.