స్వంత అభిమాని హత్యకేసులో అభియోగాలు ఎదురుకుంటున్న శాండల్ వుడ్ స్టార్ హీరో దర్శన్ వ్యవహారం అంతకంతా పీకల్లోతు బురదలోకి లాగేస్తోంది. రేణుకస్వామి హత్య కేసులో ప్రియురాలు పవిత్ర గౌడతో పాటు బెంగళూరు జైల్లో ఉన్న ఈ ఖైదీగారు ఇటీవలే తాపీగా సిగరెట్ తాగుతూ మీటింగ్ పెట్టిన ఫోటో బయటికి రావడంతో తీవ్ర వివాదం రేగిన సంగతి తెలిసిందే. దీంతో కర్ణాటక సర్కారు ఆఘమేఘాల మీద అతన్ని బళ్లారి కారాగారానికి బదిలీ చేసింది. జూన్ పదకొండు నుంచి ఊచలు లెక్కబెడుతున్న దర్శన్ ఎంత ప్రయత్నించినా బెయిలు రాలేదు. కేసు మరింత టైట్ అవుతోంది.
తాజా సమాచారం మేరకు పోలీసులు దర్శన్ మీద సుమారు నాలుగు వేల పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఇందులో బలమైన సాక్ష్యాధారాలతో పాటు ఫోటో, వీడియో ప్రూఫ్ లు కూడా ఉన్నాయి. ఇవి రెండు వందలకు పైగా దొరికినట్టు సమాచారం. దర్శన్ పవిత్ర ఆనవాళ్లు క్రైమ్ జరిగిన స్థలంలో ఉన్నాయనేందుకు దుస్తులు ఇతరత్రా సామాగ్రిని స్వాధీనం చేసుకున్న అధికారులు వాటి ఆధారంగా తప్పు చేయలేదని చెప్పుకోలేని విధంగా పకడ్బందీగా తమ ఆర్గుమెంట్ సిద్ధం చేశారట. మొత్తం పదిహేను నిందితులు ఈ నేరంలో భాగం కాగా మొదటి వరస ఏ1. ఏ2 పవిత్ర గౌడ్, దర్శన్ లే.
ఇవన్నీ కనక న్యాయస్థానంలో రుజువైన పక్షంలో దర్శన్ కు తీవ్రమైన శిక్ష పడబోతోందని లీగల్ వర్గాల భోగట్ట. ఇప్ప్పటిదాకా ఇండియన్ సినిమాలో రియల్ లైఫ్ లో అత్యంత సుదీర్ఘమైన శిక్ష అనుభవించిన స్టార్ హీరో రికార్డు సంజయ్ దత్ పేరు మీద ఉంది. ఒకవేళ దర్శన్ కనక హంతకుడని తేలితే మాత్రం ఆ స్థానాన్ని ఇతను తీసుకుంటాడు. రెండు వందలకు పైగా సాక్షులు ఉన్న కేసులో బయటపడటం దుర్లభంగా మారింది. అహంకారంతోనో లేదా బ్యాక్ గ్రౌండ్ ఉందనే పొగరుతోనో క్రైమ్స్ చేస్తే ఎంతటి హేయమైన పరిస్థితి వస్తుందో చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ అక్కర్లేదు. సినిమాని మించిన డ్రామా ఇది.