1996. మెగాస్టార్ గా నెంబర్ వన్ సింహాసనం మీద ఉన్న చిరంజీవికి కొన్ని ఫ్లాపులు స్పీడ్ బ్రేకర్స్ గా నిలిచాయి. అలాని ఇమేజ్ కొచ్చిన ముప్పేమీ లేదు కానీ ఒకరకమైన వెలితి అభిమానుల్లో మొదలయ్యింది.
హిట్లర్ నిర్మాణంలో ఉన్నప్పుడే చిన్న తమ్ముడు పవన్ కళ్యాణ్ తెరంగేట్రంని ప్రకటించినప్పుడు భవిష్యత్తులో ఈ అబ్బాయి ఒక జనసునామిగా మారతాడని ఎవరూ ఊహించి ఉండరు. ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అమ్మాయి’ కమర్షియల్ గా సేఫ్ అయినా ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టలేదు. కానీ రియల్ స్టంట్స్ చేసిన పవన్ అనే ధైర్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది.
రెండో సినిమా ‘గోకులంలో సీత’లో కొంత నెగటివ్ షేడ్ ఉన్న పాత్ర చేసినా నటనలో పరిణితి కనిపించింది. ‘సుస్వాగతం’ ఇంకో మెట్టు పైకి తీసుకెళ్లింది. ‘తొలిప్రేమ’ రూపంలో దొరికిన మలుపు మెగాస్టార్ తమ్ముడిని పవర్ స్టార్ గా మార్చే క్రమంలో మొదటి మెట్టుగా మారింది.
యువత పవన్ లో తమని తాము చూసుకున్నారు. తమ్ముడు, బద్రి దానికి మరింత దోహదం చేశాయి. ‘ఖుషి’ సృష్టించిన చరిత్ర దెబ్బకు వసూళ్ల ఖాతాలు బద్దలైపోవడమే కాదు యూత్ కి పవన్ ఒక ఐకాన్ గా మారిపోయాడు. స్వీయ దర్శకత్వంలో ‘జానీ’ అనే శరాఘాతం తగలకపోయి ఉంటే తన ప్రయాణం త్వరగా ఇంకో స్థాయికి వెళ్ళేది.
గుడుంబా శంకర్, బాలు, బంగారం, అన్నవరం అంచనాలు పూర్తిగా అందుకోలేకపోయినా ‘జల్సా’ అభిమానుల ఆకలిని తీర్చగలిగింది. ఖుషి రేంజ్ కాకున్నా వింటేజ్ పవన్ ని బయటికి తెచ్చింది. మళ్ళీ కొమరం పులి, తీన్ మార్, పంజాలతో హ్యాట్రిక్ ఫ్లాపులు. పవన్ మార్కెట్ మీద అనుమానాలు తలెత్తాయి.
వాటిని పటాపంచలు చేస్తూ ‘గబ్బర్ సింగ్‘ అనే సునామి టికెట్ కౌంటర్ల మీద విరుచుకుపడింది. రికార్డులు నామరూపాల్లేకుండా కొట్టుకుపోయాయి. కెమెరామెన్ గంగతో రాంబాబు మరో మంచి ప్రయత్నం. రిలీజ్ ముందే పైరసీకి గురైనా ఇండస్ట్రీ హిట్ గా నిలవడం బహుశా ఒక్క ‘అత్తారింటికి దారేది’కి మాత్రమే సాధ్యమేమో.
గోపాల గోపాల ఓకే అనిపించుకోగా సర్దార్ గబ్బర్ సింగ్, అజ్ఞాతవాసిలు మరోసారి నిరాశను మిగిల్చాయి. అయితే 2014లో జనసేన స్థాపన ద్వారా తన లక్ష్యాన్ని మార్చుకున్న పవన్ కళ్యాణ్ రెండు పర్యాయాలు ఎన్నికల్లో అపజయం చూసినా వెనుకడుగు వేయలేదు.
ఎక్కడ పడితే అక్కడే లేవాలనే సంకల్పంతో పార్టీని నడుపుతూ అభిమానుల అండతో పదేళ్ల తర్వాత టిడిపి కూటమి ప్రభుత్వంలో 21 సీట్లతో క్లీన్ స్వీప్ అందుకోవడం తన పట్టుదలకు నిదర్శనం. అందుకే డిప్యూటీ సిఎం పదవి కోరి వరించింది. ఒకపక్క ఫ్యాన్స్ కోసం సినిమాలు, మరోపక్క ప్రజల కోసం రాజకీయాలు ఇలా రెండు పడవల ప్రయాణంలో ఎప్పుడూ పట్టు తప్పని చుక్కాని పవన్.